సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఇంకా జీతాలు అందలేదు. జీతాలు చెల్లించేందుకు కావాల్సిన రూ.120 కోట్లు అందుబాటులో లేకపోవటంతో ఆర్టీసీ చేతులెత్తేసింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా రోజువారీ ఆదాయం నామమాత్రంగా మారింది. రూ. 2.5 కోట్లకు ఆదాయం పడిపోవటంతో డీజిల్ ఖర్చులకు కూడా సరిపోవట్లేదు. దీంతో బ్యాంకు నుంచి వచ్చే రుణం కోసం ఆర్టీసీ ఎదురుచూస్తోంది. ఇటీవలే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లకు పూచీకత్తు ఇవ్వటంతో ఓ బ్యాంకుకు ఆర్టీసీ దరఖాస్తు చేసుకుంది. అయితే గతంలో తీసుకున్న రుణానికి సంబంధించి రూ.190 కోట్ల మొండిబకాయిలు ఉండటంతో ఆర్టీసీ ఎన్‌పీఏ జాబితాలో చేరింది.
ఫలితంగా వెంటనే రుణం పొందే వీల్లేకుండా పోయింది. ఎట్టకేలకు ఆ మొండి బకాయిలు చెల్లించే పని ప్రారంభం కావటంతో రుణం పొందేందుకు మార్గం సుగమమైంది. రెండు రోజుల కింద దీనిపై ఆ బ్యాంకు బోర్డు సమావేశంలో చర్చించి, రుణాన్ని మంజూరు చేయాలని తీర్మానించినట్లు తెలిసింది. ఆ మొత్తం అందితే గానీ జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఈసారి ఆర్థిక సాయం బదులు రుణానికి పూచీకత్తు ఇవ్వడం వల్లే ఆర్టీసీకి ఈ పరిస్థితి తలెత్తింది. కాగా, మరో రెండు రోజుల్లో రూ. వెయ్యి కోట్లు చేతికందే అవకాశం ఉందని, అప్పుడే జీతాలు చెల్లిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment