Transport company
-
ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాల స్తంభన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై భవిష్యనిధి (పీఎఫ్) సంస్థ తీవ్ర చర్యకు ఉపక్రమించింది. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలను తీవ్రంగా పరిగణిస్తూ ఏకంగా ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. తనకున్న ప్రత్యేక అధికారాలతో ఆర్టీసీ ప్రధాన కార్యాలయంతో ముడిపడిన ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఆర్టీసీ రోజువారీ ఆదాయం ఈ ఖాతాల్లోనే డిపాజిట్ అవుతుంది. ఆ మొత్తం నుంచే సంస్థ రోజువారీ కార్యకలాపాలు సాగుతుంటాయి. ఇప్పుడు బ్యాంకు ఖాతాలు స్తంభించడంతో ఆర్టీసీలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రూ.వేయి కోట్లకు చేరువలో బకాయిలు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన భవిష్యనిధి ఖాతాల్లో ప్రతినెలా కంట్రిబ్యూషన్ జమ అవుతుంటుంది. సాధారణ సంస్థల్లాగా కాకుండా, భవిష్యనిధి ఖాతాలను సంస్థనే నిర్వహిస్తుంది. వాటిల్లో ఉద్యోగుల కంట్రిబ్యూషన్, వారి పక్షాన సంస్థ కంట్రిబ్యూషన్ జమ చేస్తుంది. గతంలో ఈ కంట్రిబ్యూషన్ ఠంచన్‌గా జమయ్యేది. కానీ, పదేళ్లుగా సంస్థ పనితీరు సరిగా లేకపోవటంతో.. సంస్థ అవసరాల కోసం భవిష్యనిధి మొత్తాన్ని ఆర్టీసీ వినియోగించుకోవడం ప్రారంభించింది. ఏడాదిన్నర క్రితం వరకు అలా రూ.1,200 కోట్లకు ఆ బకాయిలు పేరుకుపోయాయి.పలు దఫాలుగా భవిష్యనిధి సంస్థ నిలదీసింది. కానీ ఆర్టీసీ స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో, విడతల వారీగా రూ.300 కోట్ల వరకు చెల్లించింది. ఆ తర్వాత ఆ చెల్లింపులు ఆగిపోయాయి. ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు రూ.950 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ప్రతినెలా కంట్రిబ్యూషన్ల కింద రూ.25 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీన్ని ఇప్పుడు పీఎఫ్ కమిషనరేట్ తీవ్రంగా పరిగణించి నిలదీయటం ప్రారంభించింది. ఇప్పుడు ఏకంగా తన ప్రత్యేక అధికారాలను వినియోగించి ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. రీజినల్ ఖాతాల్లోకి జమ..భవిష్యనిధి సంస్థ చర్యతో వెంటనే తేరుకున్న ఆర్టీసీ.. రోజువారీ ఆదాయాన్ని బస్‌భవన్‌కు ఉన్న ప్రధాన ఖాతాల్లో కాకుండా రీజినల్ కార్యాలయాలతో అనుసంధానమైన ఇతర ఖాతాల్లో జమ చేయటం ప్రారంభించింది. ఈమేరకు అన్ని కార్యాలయాలకు బస్‌భవన్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలందాయి. ఈ ఖాతాలు ఫ్రీజ్ కానందున వాటిల్లో జమ చేసి వాటి నుంచే డ్రా చేసుకుంటూ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని ఆదేశించింది. భవిష్యనిధి సంస్థ వాటినీ ఫ్రీజ్ చేయబోతోందని సమాచారం అందడంతో హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్కాకుండా స్టే పొందాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు తెలిసింది.అలా జరగని పక్షంలో ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు ఉన్న టోల్గేట్ల ఫాస్టాగ్‌లకు సంబంధించి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంది. దాన్ని కూడా పీఎఫ్ సంస్థ ఫ్రీజ్ చేయబోతోందని ఆరీ్టసీకి సమాచారం అందింది. అదే జరిగితే, ఫాస్టాగ్‌ల నుంచి టోల్ రుసుము మినహాయింపునకు వీలుండదు. దీంతో టోల్ గేట్ల వద్ద నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌తో కాకుండా నగదు చెల్లిస్తే, రుసుము రెట్టింపు ఉంటుంది. ఇది ఆర్టీసీపై రోజువారీ రూ.లక్షల్లో భారం పడుతుంది. దీంతో ఫాస్టాగ్ ఖాతాకు కూడా ప్రత్యామ్నాయ చర్య లకు ఉపక్రమించింది. సోమవారం సెలవు కావటంతో, మంగళవారం దాన్ని కొలిక్కి తేవాలని భావిస్తోంది. పీఎఫ్ బకాయిలకు సాయం సాధ్యమా?హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేనిపక్షంలో కచి్చతంగా పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సిందే. అన్ని నిధులు ఆర్టీసీ వద్ద సిద్ధంగా లేనందున.. ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, 2013 వేతన సవరణ బాండు బకాయిలకు సంబంధించి ఉద్యోగుల చెల్లింపునే ప్రభుత్వం అర్ధంతరంగా వదిలేసిన ప్రస్తుత తరుణంలో, పీఎఫ్ బకాయిలకు సాయం చేయటం సాధ్యమా అన్న మీమాంస ఉత్పన్నమవుతోంది. బాండు బకాయిలను ఆర్టీసీ డ్రైవర్లకు చెల్లించి, మిగతా వారికి చెల్లించలేదు. బాండు బకాయిలకు రూ.280 కోట్లు అవసరం కాగా, కేవలం రూ.80 కోట్లే అందినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని గత ఫిబ్రవరిలో డ్రైవర్ కేటగిరీ ఉద్యోగులకు చెల్లించారు. మిగతా వారికి చెల్లించలేదు. దీంతో భవిష్యనిధి బకాయిల విషయంలో గందరగోళం నెలకొంది. -
రవాణా సంస్థకు 145 కొత్త కార్లు
కొరుక్కుపేట: డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల కోసం కొత్తగా రవాణా సంస్థకు 145 కొత్త కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కార్లు కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో డ్రైవింగ్ శిక్షణ స్కూళ్లు, మరిన్ని ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయి. ప్రతి పాఠశాలలో కోచ్‌లు, కార్యాలయ సహాయకులు పని చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో శిక్షణ అందించే ఇతర సేవలు ఫీజులు మారుతుంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు దరఖాస్తుదారుడు చాలాఖర్చు చేయాల్సి వస్తుంది. వాహనాలు ఏర్పాటు చేయలేని వారి సౌకర్యార్థం ఢిల్లీలోని సరాయ్ కాలేగావ్ జిల్లా రవాణా కార్యాలయంలో అద్దెకు కార్లను అందించే కొత్త పథకం అమలు చేశారు. అదేవిధంగా త్వరలో తమిళనాడులో కూడా సొంతంగా కారు లేని వారు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న కార్లను ఉపయోగించి డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఎస్ఎస్ శివశంకర్ మాట్లాడుతూ దరఖాస్తుదారులు స్కూళ్లకు చేరుకుని వారు అడిగిన ఫీజులు చెల్లిస్తున్నారని తెలిపారు. డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనేందుకు కారు లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. అందుకోసం తమిళనాడులో 145 ఆర్టీఓ కార్యాలయాలకు కూడా లైట్ మోటార్ వాహనాలను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు. దీంతో వృత్తి విద్యా పాఠశాలల ప్రభావం తగ్గుతుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్రైవింగ్ స్కూళ్లు దరఖాస్తుదారుడి నుంచి రూ.5000 నుంచి రూ.10,000 వరకు అడుగుతున్నాయి. చాలామంది తమ స్నేహితులు, బంధువుల సహాయంతో డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పటికీ, వారు డ్రైవింగ్ స్కూళ్లను సంప్రదించి అదనపు డబ్బు చెల్లిస్తున్నారు. -
తెలంగాణ ఆర్టీసీకి ఆరోగ్యమస్తు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని రవాణా సంస్థ నిర్ణయించింది. నవంబరు 3వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుండటంతో నవంబరు నెలను హెల్త్ అండ్ ఫిట్నెస్ ఛాలెంజ్ మంత్‌గా ఆర్టీసీ నామకరణం చేసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 48 వేల మంది ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి వ్యక్తిగతంగా వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తారు. మొత్తం 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం కాల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో ఉద్యోగికి ఈ పరీక్షల కోసం ఆర్టీసీ రూ.333 చొప్పున ఆ సంస్థకు చెల్లించనుంది. మళ్లీ ఇన్నేళ్లకు..: గతంలో ప్రసాదరావు ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యం విషయంలో చర్యలు తీసుకున్నారు. ఇంతకాలం తర్వాత మళ్లీ ప్రస్తుత ఎండీ సజ్జనార్ హయాంలో మరింత మెరుగైన చర్యలు చేపడుతున్నారు. నిరంతర నిఘా.. మందులు.. చికిత్సలు.. ఆర్టీసీ డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటేనే ఆ బస్సులోని ప్రయాణికులు క్షేమంగా గమ్యం చేరతారు. అందుకే వారికి తరచూ వైద్య పరీక్షలు చేస్తుంటారు. ఇప్పుడు కేవలం డ్రైవర్లకే కాకుండా మిగతా అందరు ఉద్యోగులకూ సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది బృహత్ సంక్షేమ కార్యక్రమంగా ఎండీ సజ్జనార్ చేపట్టారు. ఈ వైద్య పరీక్షల కోసం డిపోల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బీపీ, షుగర్, జనరల్ ఎగ్జామినేషన్, దూర/దగ్గరి దృష్టి, ఈఎన్టీ, ఈసీజీ... ఇలా 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్టుల్లో తేలిన ఫలితాల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా ఉద్యోగులను విభజించను న్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు, కొన్ని రుగ్మతలకు చేరువగా ఉండి వైద్యపరమైన అప్రమత్తత ఉన్నవారు, మరింత లోతుగా విశ్లేషించి వైద్యం అవసరమైన వారు, అత్యంత తీవ్రంగా సమస్యలుండి వెంటనే చికిత్స అవసరమైనవారు.. ఇలా నాలుగు కేటగిరీలుగా విభజించి తదనుగుణంగా వారికి చికిత్సలు అందిస్తారు. -
TSRTC: నష్టాల సాకు.. బస్సులకు బ్రేకు
సాక్షి, హైదరాబాద్: ప్రగతి రథచక్రం ప్రజారవాణా నుంచి మెల్లగా తప్పుకుంటోంది. నష్టాల సాకుతో బస్సు సర్వీసులకు కోత పెడుతూ ‘సిటీ’జనులను ప్రత్యామ్నాయ రవాణా మార్గాల వైపు మళ్లేలా చేస్తోంది. దేశవ్యాప్తంగా మహానగరాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను ఆయా రాష్ట్రాల రవాణా సంస్థలు పెంచుతుండగా.. మన గ్రేటర్లో మాత్రం బస్సుల సంఖ్య దాదాపు సగానికి తగ్గిపోయింది. సామర్థ్యానికి మించి రాకపోకలు సాగించిన బస్సులను ఫిట్‌నెస్‌లేమి కారణంగా తుక్కుకు పంపిస్తుండగా.. వాటి స్థానాన్ని భర్తీ చేసేందుకు సరిపడా బస్సులను రోడ్డెక్కించడంలో ఆర్టీసీ విఫలమవుతోంది. దీనికి సంస్థ ఆర్థిక నష్టాలే ప్రధాన కారణం. దీంతో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయడం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థకు భారంగా పరిణమించింది. ఆక్యుపెన్సీ బాగా ఉన్నా.. ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్న రూట్లలోనూ బస్సుల సంఖ్య పెంచుకోకపోవడానికి ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. కేవలం 2,550 బస్సులే.. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు జనాభా 1.30 కోట్లు. ఆ నగరంలో సిటీ బస్సుల సంఖ్య 6 వేలు. మరో 2,500 బస్సులను కొనేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. అదే కోటి జనాభా దాటిన మన భాగ్యనగరంలో బస్సుల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 2,550 మాత్రమే. ఐదేళ్లలో హైదరాబాద్‌లో సిటీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో బెంగళూరు సహా ముంబై, ఢిల్లీ నగరాల్లో బస్సుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మెట్రో నగరాల్లో ప్రజారవాణా సేవలను విస్తరించేందుకు ఆయా రవాణా సంస్థ ప్రత్యేకకార్యాచరణను అమలు చేస్తున్నాయి. శివార్లకు బస్సుల సంఖ్య పెంచడం, విమాన, రైల్వేస్టేషన్లకు బస్సులను అనుసంధానించడం ద్వారా రవాణా సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. అదే మన గ్రేటర్లో మాత్రం సిటీ బస్సుల సంఖ్య తగ్గి వ్యక్తిగత వాహనాలు భారీగా పెరిగాయి. మెట్రో, ఎంఎంటీఎస్, సిటీ బస్సుల మధ్య అనుసంధానత లేకపోవడంతో నగరవాసులు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో సుమారు 74 లక్షల సొంత వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. పడిపోయిన ప్రజా రవాణా... రవాణారంగ నిపుణుల అంచనాల ప్రకారం 2015 నాటికే హైదరాబాద్ నగరానికి కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ 2013 నుంచి ఇప్పటివరకు కేవలం 80 ఏసీ బస్సులు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటివరకు ఉన్న 3,850 బస్సులలో 850 బస్సులను కార్గో వాహనాలుగా మార్చారు. మరికొన్నింటికి కాలం చెల్లిపోవడంతో తుక్కుగా మార్చారు. వాటి స్థానంలో ఒక్క నయా బస్సు కూడా అందుబాటులోకి రాలేదు. మూడేళ్ల క్రితం వరకు రోజుకు 42 వేల ట్రిప్పుల చొప్పున సుమారు 9 లక్షల కిలోమీటర్ల పైచిలుకు తిరిగిన బస్సులు ఇప్పుడు 30 వేల ట్రిప్పులు కూడా తిరగడం లేదు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టాలని భావించినా నిధుల్లేమి కారణంగా ఆ ప్రతిపాదనను ఆర్టీసీ విరమించుకుంది. అయితే హెచ్ఎండీఏ సాయంతో బస్సులను ప్రవేశపెట్టే దిశగా ఏడాదిగా ఆలోచన చేస్తున్నా కార్యరూపం దాల్చలేదు. అదే ముంబైలో మాత్రం విద్యుత్‌తో నడిచే డబుల్ డెక్కర్ బస్సుల ప్రవేశానికి ఆ నగర రవాణా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మెట్రో నగరాల్లో ఇలా ►సుమారు 3.2 కోట్ల జనాభా కలిగిన ఢిల్లీలో మెట్రో రైలు సదుపాయాలను గణనీయంగా విస్తరించారు. మరోవైపు ప్రస్తుతం అక్కడ నడుస్తున్న 6,000కుపైగా సిటీ సీఎన్జీ బస్సుల స్థానంలో 2025 నాటికి పూర్తిగా విద్యుత్ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టారు. ►సుమారు 2.09 కోట్ల జనాభా కలిగిన ముంబై నగరంలో ప్రతిరోజూ 600కు పైగా లోకల్ రైళ్లు తిరుగుతున్నాయి. 4,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 2,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే 300 బస్సులు బృహన్ ముంబై విద్యుత్ సరఫరా, రవాణా (బెస్ట్)కు చేరాయి. మరో 100 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ►బెంగళూరు మహానగరంలో 6,000 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు మరో 2,500 బస్సులను కొత్తగా కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. దశలవారీగా 12,000 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. విఫలమైన కనెక్టివిటీ ప్రపంచంలోని ఏ నగరంలోనైనా వివిధ రకాల ప్రజారవాణా వాహనాల మధ్య పటిష్టమైన కనెక్టివిటీ ఉంటుంది. లండన్ మహానగరంలో సుమారు 19,000 బస్సులతో రైల్వే వ్యవస్థకు కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రజారవాణాపై సమగ్ర సమీక్ష నిర్వహించి సదుపాయాలను విస్తరిస్తారు. హైదరాబాద్‌లో నాలుగు మార్గాల్లో మెట్రో రైళ్లు, ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి వంటి రద్దీ రూట్లలో ఎంఎంటీఎస్ అందుబాటులో ఉన్నా సిటీ బస్సులతో కనెక్టివిటీ లేదు. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు 7 జిల్లాల పరిధిలో విస్తరించింది. నగర శివార్ల నుంచి నగరంలోని ప్రధాన మార్గాలను అనుసంధానిస్తూ సర్వీసులనునడపాలనే ప్రజల డిమాండ్ మేరకు బస్సులు లేకపోవడం గమనార్హం. -
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మంచి రోజులు.. మళ్లీ రుణాలు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప సహకార పరపతి సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొంది, ఆ తర్వాత ఆర్టీసీ నిర్వాకంతో దివాలా తీసిన ఆ సంస్థ సహకార పరపతి సంఘం (సీసీఎస్) మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. చాలాకాలం తర్వాత మళ్లీ దాని ద్వారా ఉద్యోగులకు రుణాల పంపిణీ మొదలైంది. ఎన్నో ఏళ్లుగా నిధులు వాడేసుకోవటమే కాని, తిరిగి చెల్లించని ఆర్టీసీ.. కొత్త ఎండీ సజ్జనార్ చొరవతో బకాయిల చెల్లింపు ప్రారంభించింది. తాజాగా రూ.100 కోట్లను సహకార పరపతి సంఘానికి విడుదల చేసింది. దీంతో దాదాపు 2 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు రుణాలు, విశ్రాంత ఉద్యోగుల డిపాజిట్లపై వడ్డీ బకాయిల చెల్లింపునకు మార్గం సుగమమైంది. 2019 జూన్ నుంచి పెండింగులో ఉన్న లోన్ దరఖాస్తులను క్లియర్ చేసే పని మొదలైంది. తాజా నిధులతో ఆరునెలల కాలానికి సంబంధించిన పెండింగు దరఖాస్తులకు రుణాల చెల్లింపు జరగనుంది. అంటే 2020 జనవరి వరకు ఉన్న వాటికి రుణాలు అందుతున్నాయి. ఇంకా రూ.950 కోట్ల బకాయిలు సీసీఎస్‌కు ఆర్టీసీ రూ.1,050 (సెప్టెంబరు నెలతో) కోట్ల బకాయి ఉంది. ఇందులో తాజాగా రూ.100 కోట్లు చెల్లించటంతో మరో రూ.950 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి సీసీఎస్‌కు రూ.500 కోట్లను ప్రభుత్వ పూచీకత్తు రుణం తెచ్చి చెల్లించేందుకు ఇప్పటికే ఆర్టీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించి నేషనల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో అధికారులు చర్చించారు. కానీ ఇది ప్రభుత్వ పూచీ కత్తు రుణం అయినందున ముఖ్యమంత్రి నుంచి అనుమతి పొందాల్సి ఉంది. దానికి సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయంలో ఉంది. అక్కడి నుంచి రావటంలో జాప్యం జరుగుతుండటంతో పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దీంతో ఇటీవలే బ్యాంకు నుంచి తీసుకున్న రుణం నుంచి రూ.100 కోట్లు విడుదలయ్యేలా ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. మళ్లీ సీసీఎస్వైపు ఉద్యోగుల చూపు సీసీఎస్‌లో సభ్యత్వం కలిగిన ఉద్యోగుల జీతం నుంచి ప్రతినెలా 7 శాతం చొప్పున కోత పెట్టి దాన్ని సొసైటీకి ఆర్టీసీ బదలాయించాల్సి ఉంటుంది. ఆ మొత్తం నుంచి ఉద్యోగుల సొంత అవసరాలకు రుణాలు సీసీఎస్ అందజేస్తుంది. అయితే కొన్నేళ్లుగా ఆ నిధులను ఆర్టీసీ వాడేసుకుని, ప్రతినెలా డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని ఎగవేస్తోంది. దీంతో సీసీఎస్ దివాలా తీసింది. దీంతో చాలామంది ఉద్యోగులు సభ్యత్వాన్ని రద్దు చేసుకునేందుకు పోటీ పడ్డారు. అలా 12 వేల మంది దరఖాస్తు చేసుకోవడంతో వారందరికీ సెటిల్మెంట్లు చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ సీసీఎస్ నుంచి రుణాల పంపిణీ మొదలు కావటంతో కొత్తగా సభ్యత్వ రద్దుకు దరఖాస్తు చేసుకునేవారు తగ్గిపోయారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది తిరిగి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
ఎట్టకేలకు సీసీఎస్‌కు నిధులు
సాక్షి, హైదరాబాద్: మూతపడే దశలో ఉన్న ఆర్టీసీ సహకార పరపతి సంఘాని(సీసీఎస్)కి ఎట్టకేలకు రవాణా సంస్థ నిధులు కేటాయించింది. వేయి కోట్లకు పైగా సంఘం నిధులు సొంతానికి వాడుకుని, దాన్ని దివాలా దశకు చేర్చిన ఆర్టీసీ.. తాజాగా దానికి రూ.90 కోట్లు అందజేసింది. త్వరలో నేషనల్ క్రెడిట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి ప్రభుత్వ పూచీకత్తు ద్వారా సీసీఎస్‌కు రూ.400 కోట్ల నిధులు సమకూర్చాల్సి ఉంది. కానీ గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి సీసీఎస్ కొంత బకాయి పడింది. అవి మొండి బకాయిలుగా మారటంతో సంఘం ప్రస్తుతం ఎన్పీఏ జాబితాలోకి చేరింది. ఆ బకాయిలు తీరిస్తేగానీ ఎన్సీడీసీ నుంచి రుణం పొందే వీలులేదు. ఈ నేపథ్యంలోనే అందుకు కావాల్సిన నిధులు కేటాయించాల్సిందిగా సీసీఎస్ చాలాకాలంగా ఆర్టీసీని కోరుతోంది. కానీ పట్టించుకోలేదు. అయితే ఆర్టీసీ కొత్త ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో.. ఆ కసరత్తు వేగం అందుకుంది. నాలుగు రోజుల క్రితం రూ.90 కోట్లు సీసీఎస్‌కు అందాయి. వడ్డీ బకాయిలకు రూ.7.5 కోట్లు: తాజా నిధుల్లోంచి బ్యాంకు బకాయిల కిం ద రూ.80 కోట్లను చెల్లించిన సీసీఎస్, మిగతా మొత్తం నుంచి రిటైర్డ్ ఉద్యోగుల డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు చెల్లించనుంది. గత మూడు నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులు వడ్డీ అందక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద వచ్చిన మొత్తాన్ని సీసీఎస్‌లోనే డిపాజిట్ చేశారు. -
అయితే డొక్కు.. లేదా తుక్కు!
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన బస్సులతో కుస్తీ పడుతున్న ఆర్టీసీ ఇప్పుడు కొన్ని రూట్లకు సర్వీసులు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాది కాలంలో దాదాపు 200 బస్సులను కోల్పోవడమే దీనికి కారణం. కొన్నేళ్లుగా నిధులు లేక కునారిల్లుతున్న రవాణా సంస్థ కొత్త బస్సులు సమకూర్చుకోలేకపోయింది. ఫలితంగా దాదాపు జీవితకాలం పూర్తి చేసుకున్న బస్సులని బలవంతంగా తిప్పాల్సి వస్తోంది. వాటిల్లో కొన్ని ఇక అంగుళం కూడా ముందుకు కదలని స్థితికి చేరుకోవటంతో పక్కన పెట్టేసింది. అలా దాదాపు 150 సొంత బస్సులను తుక్కు కింద మార్చేసింది. మరో 50 అద్దె బస్సులు కూడా రద్దయ్యాయి. దీంతో ఒక్కసారిగా 200 బస్సులు తగ్గిపోవటంతో ఇప్పుడు ఆర్టీసీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. గడచిన ఏడాది కాలంలో ఏకంగా కోటి కిలోమీటర్ల మేర తక్కువగా బస్సులు తిరిగాయి. కొన్ని గ్రామాలకు ట్రిప్పుల సంఖ్య తగ్గించగా, మరికొన్ని గ్రామాలకు సర్వీసులు నిలిపేసింది. ముఖ్యంగా నైట్‌హాల్ట్ సర్వీసుల్లో కొన్నింటిని రద్దు చేసుకుంది. ఇది ఇప్పుడు సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఐదారొందల బస్సులను తుక్కుకింద మార్చాల్సిన పరిస్థితి ఉండటంతో రవాణా సేవలపై ప్రభావం పడబోతోంది. తుక్కు చేసినవి 4,401.. కొన్నవి 1,584.. ఏయేటికాయేడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున బస్సుల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది. ఇందుకోసం కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. కానీ ఆర్టీసీలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. గడచిన ఐదేళ్లలో 4,401 బస్సులను తుక్కు కింద మూలపడేశారు. వాటి స్థానంలో కేవలం 1,584 బస్సులను మాత్రమే కొత్తగా చేర్చారు. అంటే దాదాపు 3 వేల బస్సులు తగ్గిపోయాయి. ఇప్పట్లో కొత్త బస్సులుకొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. అప్పులు పేరుకుపోయినందున కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకులు కూడా ససేమిరా అంటున్నాయి. ఇక ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడంలేదు. దీంతో కొత్త బస్సులు కొనే అవకాశమే లేదు. ఇప్పుడు దాదాపు నాలుగు వేల బస్సులు పరిమితికి మించి తిరిగి పూర్తి డొక్కుగా మారాయి. రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ వాటిని వాడుతోంది. కొత్త బస్సులు రానందున ఒకేసారి అన్ని బస్సులను తుక్కుగా మారిస్తే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీంతో దశలవారీగా కొన్ని చొప్పున వచ్చే మూడునాలుగేళ్లలో వాటిని తొలగించబోతున్నారు. ఈ సంవత్సరం కనీసం ఐదొందల వరకు తొలగించే అవకాశం ఉంది. ఇప్పుడు 200 బస్సులు తగ్గిపోతేనే కోటి కిలోమీటర్ల మేర బస్సులు తిరగలేకపోయాయి. బ్యాటరీ బస్సుల కోసం ఎదురుచూపు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో కొనే బ్యాటరీ బస్సుల కోసం ఇప్పుడు ఆర్టీసీ ఎదురు చూస్తోంది. ఫేమ్ పథకం రెండో దశ కింద 500 నుంచి 600 బస్సులు కోరుతూ ఆర్టీసీ ఈ నెలలో ఢిల్లీకి ప్రతిపాదన పంపబోతోంది. ఇందులో కనీసం మూడొందలకు తగ్గకుండా బస్సులు మంజూరవుతాయని ఆశిస్తోంది. ఇవన్నీ అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోనున్నా... ప్రయాణికులకు సేవలు మెరుగవటం ఖాయం. సొంతంగా బస్సులు కొనే పరిస్థితి లేనందున వీటిపై ఆధారపడాల్సి వస్తోంది. బ్యాటరీ బస్సులు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయోనన్న ఆందోళన కూడా ఆర్టీసీని వెంటాడుతోంది. -
గన్‌తో బెదిరించారు..
పటమట(విజయవాడ తూర్పు): ఓ కాంట్రాక్టర్, ట్రాన్స్‌పోర్టు సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీల్లో నెలకొన్న వివాదం చివరికి గన్‌తో బెదిరించే వరకు వెళ్లింది. రాజకీయ నాయకుల పేరుతో కొంతమంది తమ ఇంట్లో చొరబడి, చాతీపై గన్ గురి పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. యార్లగడ్డ ప్రవీణ్ కుమార్ తెలంగాణలోని ఓ కాంట్రాక్టర్ వద్ద సబ్‌కాంట్రాక్ట్ తీసుకుని పలు నిర్మాణ పనులకు వాహనాలు పెట్టాడు. ఈ నేపథ్యంలో హరిప్రియ బల్క్ కొరియర్ సర్వీస్ సంస్థకు చెందిన కోనేరు శివశంకర్ పరిచయమయ్యాడు. ప్రవీణ్‌కుమార్‌కు లారీలను మాట్లాడుకున్నాడు. 40 రోజుల పాటు పనులకు వినియోగించుకున్నాడు. దీనికి సంబంధించి హరిప్రియ ట్రాన్స్‌పోర్టు సంస్థకు ప్రవీణ్ కుమార్ రూ.1.17 లక్షలు బాకీ పడ్డాడు. ఆ డబ్బు వసూలు చేసేందు ఈ నెల 27వ తేదీ కోనేరు శివశంకర్, సతీష్, సంతోష్, కోటేశ్వరరావులతో కలిసి మురళీనగర్‌లోని ఇంట్లోకి ప్రవేశించి భార్య వద్ద ఖాళీ చెక్కులు, ప్రాంసరీనోట్లు రాయించుకున్నారని, అక్కడితో ఆగకుండా విజయవాడ ఆటోనగర్‌లోని 5వ రోడ్డులో ఉన్న తన కార్యాలయంలోకి ప్రవేశించి తనను గన్‌తో బెదిరించారని ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టామని పటమట పోలీసులు తెలిపారు. -
డబ్బులివ్వం.. అప్పు చేయండి!
♦ ఆర్టీసీకి సాయంపై తూచ్ అన్న రాష్ట్ర ప్రభుత్వం ♦ కావాలంటే రుణం తెచ్చుకునేందుకు అనుమతి ♦ పూచీకత్తు ఉండేందుకు కేబినెట్ తీర్మానం ♦ గ్రాంటు ఆశలు వదులుకున్న రవాణా సంస్థ ♦ బడ్జెట్లో కేటాయింపులుండవని పరోక్షంగా చెప్పిన సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రగతి రథచక్రం దిక్కుతోచని స్థితిలో పడింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి గ్రాంటు రూపంలో సాయం కోసం ఆర్టీసీ పెట్టుకున్న ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. అప్పు తెచ్చుకొమ్మని ఉచిత సలహా ఇచ్చి.. కావాలంటే పూచీకత్తు ఉంటానన్న హామీతో సరిపుచ్చింది. అది కూడా ఆర్టీసీ బస్సు పాసు రాయితీలకు ప్రభుత్వం రీయింబర్స్ చేసే మొత్తానికి సంబంధించింది కావటంతో ఆర్టీసీ షాక్ తినాల్సి వచ్చింది. ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని చెప్పటంతో అదనంగా గ్రాంటు రావటం ఇక కల్లేనని తేలిపోయింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఉదారంగా నిధులు కేటాయిస్తుందన్న నమ్మకం కూడా సడలిపోయింది. గడ్డు పరిస్థితుల్లో ఆర్టీసీ.. ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఆర్టీసీ ఎదుర్కొంటోంది. ప్రతి నెలా జీతాల కోసం దిక్కులు చూడాల్సిన దుస్థితిలో ఉంది. గతేడాది సిబ్బందికి భారీగా జీతాలు పెంచాల్సి రావటంతో ఆ భారం ఆర్టీసీకి ఇప్పుడు శాపంగా మారింది. జీతాలు పెంచిన సమయంలో.. ఆ భారాన్ని పూర్తిగా ఆర్టీసీపై రుద్దకుండా బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించటం ద్వారా ఆదుకుంటామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పటంతో ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉందని ఎదురుచూసింది. కానీ, కేబినెట్ భేటీలో ఆ నిధుల ఊసెత్తని ముఖ్యమంత్రి.. బస్సు పాస్ రీయింబర్స్మెంట్ నిధులను అప్పు రూపంలో ఆర్టీసీ తెచ్చుకోవాలని, దానికి పూచీకత్తు ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. దీనికి కేబినెట్ ఓకే చెప్పింది. ఆర్టీసీకి గ్రాంటుపై చర్చే లేదు. బస్సు పాసుల రాయితీని భరించినందుకు దాదాపు రూ.650 కోట్ల వరకు ఆర్టీసీ నష్టపోతోంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోంది. అందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఎంపీ ట్యాక్స్‌ను మినహాయించుకుని రూ.500 కోట్లు రీయింబర్స్ చేస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్నే అప్పుగా తెచ్చుకోవాలని పేర్కొంది. రీయింబర్స్ చేయాల్సిన డబ్బులనే నేరుగా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోవాలని పేర్కొనటం, గ్రాంటు గురించి ప్రస్తావించకపోవటంతో ఇక బడ్జెట్లో ఆర్టీసీకి ప్రత్యేక కేటాయింపులు ఉండకపోవచ్చని ఆర్టీసీ అధికారులు నిర్ణయానికొచ్చారు. కొత్త బస్సుల కోసం రూ.40 కోట్లు బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. పేరుకుపోయిన నష్టాలు.. ఫిట్మెంట్ ప్రకటన తర్వాత ఎరియర్స్‌కు సంబంధించి ఆర్టీసీ రూ.200 కోట్లు చెల్లించింది. ఆ మొత్తంతో సంస్థ నష్టాలు ఒక్కసారిగా గుట్టలా పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే నష్టాల మొత్తం రూ.600 కోట్లను మించింది. దీంతో ఎరియర్స్ భారాన్నయినా ప్రభుత్వం పంచుకుంటే బాగుండేదన్న ఆర్టీసీ అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవటం ద్వారా ఆదాయాన్ని వృద్ధి చేసుకోవాలని పదేపదే చెబుతున్న సీఎం ఇటీవల బడ్జెట్ సన్నాహక భేటీలో కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు సూచించే ఉదంతాలేవీ లేకపోవటంతో అధికారులు సాయం అడగటానికి సాహసించలేని పరిస్థితి ఎదురైంది. నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహిస్తానని గతంలో చెప్పిన సీఎం ఇప్పుడా సమావేశం నిర్వహణకు కూడా ఆసక్తి చూపటం లేదు. -
మాకు అప్పు పుట్టలేదు.. మీ పేరుతో తెస్తారా!
- కార్మికుల క్రెడిట్ సొసైటీతోఆర్టీసీ అవగాహన - దసరా అడ్వాన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపు తిప్పలివి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు సాయం చేయవు. నిండా అప్పులు, నష్టాల్లో మునిగిపోవడంతో బ్యాంకులు అప్పు ఇవ్వవు. వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోవడంతో అవసరాలకు డబ్బుల్లేవు. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సంస్థగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్న ఆర్టీసీ (ఉమ్మడి రూపం) ప్రస్తుత దుస్థితి ఇది. కార్మికుల ‘గుడ్‌విల్’ను ముందుంచి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుని రోజులు గడిపే స్థాయికి చేరుకుంది. మంగళవారం జరిగిన ఓ పరిణామం ఆర్టీసీ దుస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇదీ సంగతి: ఏ నెలకానెల జీతాలు చెల్లించడం టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీలకు చాలాకష్టమైంది. కార్మికులు ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగకు అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం అందించే ఆనవాయితీ ఉంది. ఇందుకు రెండు సంస్థలకు కలిపి రూ.43 కోట్లు కావాలి. కానీ చిల్లిగవ్వ చేతిలో లేక దాన్ని వాయిదా వేశాయి. అలాగే, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపు 2012 నుంచి పెండింగులో ఉంది. 2012 సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని ఆగస్టులో చెల్లించనున్నట్టు సంస్థలు కార్మిక సంఘాలతో గతంలోనే ఒప్పందం చేసుకున్నాయి. కానీ మాట తప్పాయి. దీంతో కార్మికుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయకపోవటంతో బ్యాంకుల నుంచి అప్పు తీసుకుందామన్నా బ్యాంకులు సిద్ధంగా లేవు. దీంతో కార్మికులకు సంబంధించిన క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)పై దృష్టి సారించింది. ప్రతినెలా తమ జీతం నుంచి 5 శాతం చొప్పున ఈ సొసైటీకి కార్మికులు జమ చేస్తారు. క్రమం తప్పకుండా నిధి జమ అయ్యే సొసైటీ కావటంతో దీనికి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు సరేనంటున్నాయి. ఆ సొసైటీ నిధులను గతంలో సొంతానికి వాడుకున్న ఆర్టీసీ వాటిని తిరిగి చెల్లించేందుకు ఏపీ కేంద్ర సహకార బ్యాంకు నుంచి రూ.162 కోట్ల అప్పు కోసం యత్నించింది. అక్కడ చేదు అనుభవం ఎదురుకావడంతో సీసీఎస్ పేరుతో అప్పు పొందింది. ఇదే మాదిరే తాజాగా కెనరాబ్యాంకు నుంచి రూ.80 కోట్లు అప్పు తెచ్చేందుకు సీసీఎస్ సరేనంది. ఈమేరకు మంగళవారం జరిగిన పాలకమండలి సమావేశం తీర్మానించింది. ఆర్టీసీ కోసం అప్పు తెస్తే సీసీఎస్ గుడ్‌విల్ దెబ్బతింటుందని నలుగురు పాలకమండలి సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. మెజార్టీ సభ్యులు సానుకూలంగా ఉండటంతో తీర్మానానికి ఆటంకం కలగలేదు. తెచ్చిన అప్పులో రూ.40 కోట్ల చొప్పున రెండు ఆర్టీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు.