సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని రవాణా సంస్థ నిర్ణయించింది. నవంబరు 3వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుండటంతో నవంబరు నెలను హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ మంత్‌గా ఆర్టీసీ నామకరణం చేసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 48 వేల మంది ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి వ్యక్తిగతంగా వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తారు.
మొత్తం 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం కాల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో ఉద్యోగికి ఈ పరీక్షల కోసం ఆర్టీసీ రూ.333 చొప్పున ఆ సంస్థకు చెల్లించనుంది.
మళ్లీ ఇన్నేళ్లకు..: గతంలో ప్రసాదరావు ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యం విషయంలో చర్యలు తీసుకున్నారు. ఇంతకాలం తర్వాత మళ్లీ ప్రస్తుత ఎండీ సజ్జనార్ హయాంలో మరింత మెరుగైన చర్యలు చేపడుతున్నారు.
నిరంతర నిఘా.. మందులు.. చికిత్సలు..
ఆర్టీసీ డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటేనే ఆ బస్సులోని ప్రయాణికులు క్షేమంగా గమ్యం చేరతారు. అందుకే వారికి తరచూ వైద్య పరీక్షలు చేస్తుంటారు. ఇప్పుడు కేవలం డ్రైవర్లకే కాకుండా మిగతా అందరు ఉద్యోగులకూ సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది బృహత్ సంక్షేమ కార్యక్రమంగా ఎండీ సజ్జనార్ చేపట్టారు. ఈ వైద్య పరీక్షల కోసం డిపోల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బీపీ, షుగర్, జనరల్ ఎగ్జామినేషన్, దూర/దగ్గరి దృష్టి, ఈఎన్‌టీ, ఈసీజీ... ఇలా 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
రిపోర్టుల్లో తేలిన ఫలితాల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా ఉద్యోగులను విభజించను న్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు, కొన్ని రుగ్మతలకు చేరువగా ఉండి వైద్యపరమైన అప్రమత్తత ఉన్నవారు, మరింత లోతుగా విశ్లేషించి వైద్యం అవసరమైన వారు, అత్యంత తీవ్రంగా సమస్యలుండి వెంటనే చికిత్స అవసరమైనవారు.. ఇలా నాలుగు కేటగిరీలుగా విభజించి తదనుగుణంగా వారికి చికిత్సలు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment