RTC Employess
-
తెలంగాణ ఆర్టీసీకి ఆరోగ్యమస్తు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని రవాణా సంస్థ నిర్ణయించింది. నవంబరు 3వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుండటంతో నవంబరు నెలను హెల్త్ అండ్ ఫిట్నెస్ ఛాలెంజ్ మంత్‌గా ఆర్టీసీ నామకరణం చేసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 48 వేల మంది ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి వ్యక్తిగతంగా వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తారు. మొత్తం 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం కాల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో ఉద్యోగికి ఈ పరీక్షల కోసం ఆర్టీసీ రూ.333 చొప్పున ఆ సంస్థకు చెల్లించనుంది. మళ్లీ ఇన్నేళ్లకు..: గతంలో ప్రసాదరావు ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యం విషయంలో చర్యలు తీసుకున్నారు. ఇంతకాలం తర్వాత మళ్లీ ప్రస్తుత ఎండీ సజ్జనార్ హయాంలో మరింత మెరుగైన చర్యలు చేపడుతున్నారు. నిరంతర నిఘా.. మందులు.. చికిత్సలు.. ఆర్టీసీ డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటేనే ఆ బస్సులోని ప్రయాణికులు క్షేమంగా గమ్యం చేరతారు. అందుకే వారికి తరచూ వైద్య పరీక్షలు చేస్తుంటారు. ఇప్పుడు కేవలం డ్రైవర్లకే కాకుండా మిగతా అందరు ఉద్యోగులకూ సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది బృహత్ సంక్షేమ కార్యక్రమంగా ఎండీ సజ్జనార్ చేపట్టారు. ఈ వైద్య పరీక్షల కోసం డిపోల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బీపీ, షుగర్, జనరల్ ఎగ్జామినేషన్, దూర/దగ్గరి దృష్టి, ఈఎన్టీ, ఈసీజీ... ఇలా 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్టుల్లో తేలిన ఫలితాల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా ఉద్యోగులను విభజించను న్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు, కొన్ని రుగ్మతలకు చేరువగా ఉండి వైద్యపరమైన అప్రమత్తత ఉన్నవారు, మరింత లోతుగా విశ్లేషించి వైద్యం అవసరమైన వారు, అత్యంత తీవ్రంగా సమస్యలుండి వెంటనే చికిత్స అవసరమైనవారు.. ఇలా నాలుగు కేటగిరీలుగా విభజించి తదనుగుణంగా వారికి చికిత్సలు అందిస్తారు. -
ఉద్యోగుల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అందుకే ఆర్థికభారమైనప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన నేషనల్ మజ్దూర్ యూనిటీ(ఎన్ఎంయూ) రాష్ట్ర మహాసభల్లో ఆయన ప్రసంగించారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు అండగా నిలిచిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందన్నారు. స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ పథకం పునరుద్ధరణ, పాత పద్ధతిలో ఆర్టీసీ ఉద్యోగులకు మెడికల్ పాలసీ అమలు తదితర అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులపట్ల మొదటి నుంచి సానుకూలత ఉందన్నారు. 2004లో తీవ్రనష్టాల్లో ఉన్న ఆర్టీసీని వైఎస్సార్ ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసి ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చారన్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు, ఎన్ఎంయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాల సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు, ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు 5 శాతం డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం పెరుగుతోంది. వచ్చేవేతనాల నుంచి అందుకునేలా 5% డీఏను చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మూల వేతనంపై ఐదు శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుం దని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయటం, తర్వాత కోవిడ్ దెబ్బతో.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని, డీఏల చెల్లింపు ఆగిపోయింది. ఆరు డీఏలు కలిపి 27శాతం వరకు రావాల్సి ఉందని.. వెంటనే చెల్లించా లని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా డీఏ ఆదేశాలు జారీ అయ్యాయి. బకాయిల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అసలు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కాగా.. సుదీర్ఘ విరామం తర్వాత డీఏ పెంచటం కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటేనని.. అయితే పెండింగ్ డీఏల ప్రకారం ఇవ్వాలని, ఎరియర్స్ చెల్లించాలని టీఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుపతి, ఏఆర్ రెడ్డి, ఎన్ఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు కమాల్‌రెడ్డి, నరేందర్ డిమాండ్ చేశారు. -
తెలంగాణ ఆర్టీసీలో ‘61 ఏళ్ల’ చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అంశం మరోసారి చర్చకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఆర్టీసీ కూడా తన ఉద్యోగులకు దాన్ని వర్తింప చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ, 2019 సమ్మె సమయంలోనే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంటు వయసును 60 ఏళ్లకు పెంచింది. మళ్లీ 61 ఏళ్ల పెంపు ప్రతిపాదన రావడంతో ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. కానీ వయసు పైబడే కొద్దీ బస్సులు నడపటం కష్టంగా ఉంటోందని, తమకు వయసు పెంపు అవసరం లేదని డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లలో సింహభాగం మంది మొరపెట్టుకున్నారు. వీలైతే వీఆర్ఎస్ ప్రకటిస్తే వెళ్లిపోతామని కూడా పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం ఆర్టీసీకి 61 ఏళ్ల వయసు అంశాన్ని వర్తింపచేయకుండా పెండింగులో ఉంచింది. డిసెంబరు 31నుంచి 60 ఏళ్ల ప్రాతిపదికన రిటైర్మెంట్లు మొదలుకానున్నాయి. అయితే పెంపునకు సానుకూలంగా ఉన్నతస్థాయి అధికారులు మరోసారి రిటైర్మెంట్ వయసు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలని నిర్ణయించారు. విషయాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి పువ్వాడతో గురువారం చర్చించి, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనకు పచ్చజెండా ఊపేలా చూడాలని యత్నిస్తున్నారు. ఉన్నతాధికారులు దాన్ని స్వాగతిస్తుండటం, శారీరక శ్రమ ఎక్కువగా చేసే కార్మికులు వ్యతిరేకిస్తుండటంతో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఆర్టీసీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారమైనా పట్టించుకోని అధికారులు... అసలే అప్పట్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం కష్టంగా ఉన్న ఆర్టీసీకి 60 ఏళ్ల పెంపు పెద్ద సమస్యగా మారింది. వేయికిపైగా బస్సులను తగ్గించటం, కొత్త బస్సులు కొనకపోవటంతో 4 వేల మందికి పనులే లేకుండా పోయాయి. వయసుపెంపు ప్రతిపాదన పెండింగ్‌లో ఉండటం వల్ల మరో రెండేళ్లు రిటైర్మెంట్లు లేకపోవడం ఆర్టీసీకి మరింత భారమయ్యింది. అయినా అధికారులు వ్యవస్థను పట్టించుకోకుండా కేవలం తమ పదవీవిరమణ పెంపుపై ఆసక్తి చూపుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
నేడు అసెంబ్లీలో 11 కీలక బిల్లులు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రత్యేకంగా వేర్వేరు బోర్డుల ఏర్పాటు, మద్యం అక్రమాలపై కఠిన చర్యలతో పాటు పలు రంగాలకు చెందిన 11 కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులపై సోమవారం సభలో చర్చించి ఆమోదించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం కోసం కొత్త చట్టం ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ‘అబ్జార‡్ష్పన్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీసు యాక్ట్–2019’ బిల్లును రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేసి, ఆర్టీసీ ఉద్యోగులందరినీఈ శాఖ కిందకు తీసుకొస్తారు. ఈ చారిత్రక చట్టం చేయడం ద్వారా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేర్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. మద్దతు ధర కోసం చిరు, పప్పు ధాన్యాల బోర్డులు రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు మెరుగైన ధరలు కల్పించడమే లక్ష్యంగా కాఫీ, టీ బోర్డుల తరహాలోనే చిరు, పప్పు ధాన్యాల బోర్డులను (వేర్వేరుగా) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బిల్లుప్రవేశపెట్టనుంది. ప్రధానంగా చిరు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడం, ఆ పంటలకు మద్దతు ధర కల్పించడం ఈ బోర్డుల ఏర్పాటు లక్ష్యం. ఈ బోర్డుల్లో చైర్మన్‌తో పాటు సీఈవో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. పరిశోధన విస్తరణ విభాగం, మార్కెట్ ఇంటలిజెన్స్, ట్రేడ్ ప్రమోషన్, గోదాములు, శీతల గిడ్డంగులు, యాంత్రికీకరణ విభాగం, మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ విభాగాలకు చెందిన నిపుణులను డైరెక్టర్లుగా నియమిస్తారు. ఈ బోర్డులు స్వయం ప్రతిపత్తితో పని చేస్తాయి. చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సాహకం, నాణ్యమైన దిగుబడులు సాధించడం, ఆ ఉత్పత్తుల విలువ పెంచేలా (విలువ జోడించడం) ప్రాసెసింగ్ చేయడం, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు అందేలా చేయడమే ఈ బోర్డుల ఉద్దేశం. వివిధ మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోనున్నారు. ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు, అగ్రివాచ్‌తో సహా మరో ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నారు. మార్కెట్ ఇంటలిజెన్సీ కోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్ ధరలు, బిజినెస్ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఏజెన్సీ చూస్తుంది. ఏ ఏ పంటలు వేయాలనే ప్రణాళికను ఈ బోర్డులు రూపొందిస్తాయి. ఇన్సూరెన్స్, వ్యవసాయ యాంత్రికీకరణ, మార్కెటింగ్, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, ప్రణాళికా విభాగాలు ఈ బోర్డుల్లో పనిచేస్తాయి. అవసరమైన సమయంలో మార్కెట్లో రైతులకు మెరుగైన ధరలు లభించని పక్షంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని వినియోగిస్తారు. పంటల ప్రణాళిక నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు ఈ బోర్డులు స్వతంత్రంగా పనిచేయనున్నాయి. అవసరమైన మౌలిక వసతుల కల్పన, పరిశోధన, స్టోరేజీ, ప్రాసెసింగ్, మార్కెట్ ఇంటలిజెన్స్‌కు అవసరమైన ప్రణాళికలను రూపొందించనున్నాయి. అక్రమ మద్యం విక్రయం, రవాణపై ఇక ఉక్కుపాదమే దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాలను, బార్ల సంఖ్యను గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, మొదటిసారి పట్టుబడితే రూ.2 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ ఫీజు కన్నా 2 రెట్లు జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేసేలా ఎక్సైజ్ చట్టంలో సవరణలకు బిల్లును నేడు ప్రవేశపెడతారు. ఈ అంశాలపై కూడా బిల్లులు.. ►మద్యం ముట్టుకుంటే షాక్ తగిలేలా అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎక్సైజ్ చట్టంలో సవరణలు. ► వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటుకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ చట్టంలో సవరణ. ► కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ గవర్నమెంట్ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్సిటీగా ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీల చట్టంలో సవరణ. ►ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేదా ఆయన ద్వారా నియమించబడిన వ్యక్తిని అన్ని యూనివర్సిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించేందుకు వీలుగా యూనివర్సిటీల చట్టంలో సవరణ. ►ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టంలో సవరణ. ► ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ చట్టంలో సవరణ. ►ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21–ఎ (1) (ఇ) సవరణ. -
సీఎం వైఖరికి వ్యతిరేకంగా నిరసన
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్ వైఖరీని నిరసిస్తూ శనివారం ఆర్టీసీ డిపో గేటు ఎదుట తెలంగాణ ఎంప్లాయీస్ యూ నియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, టీజేఎంయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా చైర్మన్ ఎండి జాబీర్, డిపో కార్యదర్శి కేవీ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నూతన జీతభత్యాలను అందించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని కేసీఆర్ అనడం దురదృష్టకరంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మెతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మరిచిపోయారని అన్నారు. సకల జనుల సమ్మెలో 27 రోజుల జీతాలను నేటికి ఇవ్వలేదన్నారు. కార్మికుల శ్రమకు తగ్గ వేతనాలను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు అరుణ్, వెంకటయ్య, నాగార్జున, బొట్టు శ్రీను తదితరులున్నారు. -
ఈనెల 21 తర్వాత టీఎస్ఆర్టీసీ సమ్మె!
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం ‘చలో బస్‌భవన్’ చేపట్టారు. దీంతో బస్‌భవన్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికుల వేతన సవరణ, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని టీఎంయూ డిమాండ్ చేస్తోంది. 2017, ఏప్రిల్ నుంచి రావాల్సిన పే స్కేల్‌ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్‌భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరించారు. ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ.. టీఎంయూ మీటింగ్ ఓ ఉదాహరణ మాత్రమేనన్నారు. కార్మిక లోకం కన్నెర్ర చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు కార్మికులు శాంతియుతంగా ఉన్నారన్నారు. ప్రగతి భవన్ ముట్టడి వరకు రానివ్వద్దననారు. ప్రభుత్వంలో కొందరు మంత్రులుగా ఉన్నారంటే అది తెలంగాణ అర్టీసీ కార్మికుల చలువేనన్నారు. ఎవరి దయదాక్షిణ్యాల మీద కార్మికులు లేరని తెలిపారు. చీటికిమాటికీ కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించే నాధుడే లేరన్నారు. ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అదే ఉద్యమకారుల మీటింగ్‌కు ఎందుకు అనుమతి దొరకడం లేదు? కార్మిక, ఉద్యోగులకు ఆర్టీసీలో ఎందుకు ఉద్యోగ భద్రత లేదు? అని ప్రశ్నించారు. ఇతర కార్మిక సంఘాలు కూడా ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని కోరారు. నేడు జరిగిన ఈ ధర్నా హెచ్చరిక మాత్రమేనని, ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు ముందుగానే జీతాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శనివారం ఇవ్వాల్సిన జీతాలను దసరా పండుగను పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే విడుదల చేశారు. దీంతో కార్మికులలో సంతోషం వ్యక్తమైంది. కార్మికులకు ముందుగానే జీతాలు ఇవ్వడానికి కృషిచేసిన రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ రమణారావుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు, రాష్ట్ర కార్యదర్శులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. పలు డిమాండ్లకు సంబంధించి కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం అమలు చేయకుండా జాప్యం చేస్తుండటంతో కొద్ది రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు ఇక అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మేరకు గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు శుక్రవారం సంయుక్తంగా ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాయి. తమ డిమాండ్లపై వెంటనే సానుకూలంగా స్పందించి అమలు చేయని పక్షంలో జనవరి 3 నుంచి సమ్మె ప్రారంభిస్తామని అందులో హెచ్చరించాయి. మరోవైపు మరో ముఖ్య కార్మిక సంఘం అయిన ఎన్ఎంయూ కూడా ప్రభుత్వానికి 21 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఆ గడువులోపు ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 24న సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. వెరసి ప్రధాన కార్మిక సంఘాలన్నీ సమ్మెకు సై అంటుండటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కార్మికుల ప్రధాన డిమాండ్లకు కచ్చితంగా తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. విచిత్రమైన విషయం ఏంటంటే... కార్మికులు డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశాలపై స్వయంగా రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదివరకే సానుకూల ప్రకటన చేసినా, ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోకపోవటంతో అవి అమలుకు నోచుకోలేదు. డిమాండ్లపై ఒప్పందం చేసుకున్నాక కూడా అమలు చేయకపోవటంతో ప్రభుత్వంపై నమ్మకం సడలిందని, దీంతో గత్యంతరం లేక సమ్మెకు సిద్ధమయ్యామని కార్మిక సంఘాల నేతలు పద్మాకర్, అశ్వద్ధామరెడ్డి తదితరులు పేర్కొన్నారు. ఎండీగా పూర్ణచంద్రరావు ఇటీవలే బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో సమ్మె నోటీసు ఇవ్వటం బాధగా ఉన్నా, తమకు తప్పని పరిస్థితి అని వారు పేర్కొన్నారు. తమ సమ్మె ప్రతిపాదనకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు మద్దతు పలకాలని వారు కోరారు.