నేడు అసెంబ్లీలో 11 కీలక బిల్లులు | 11 Key Bills In Andhra Pradesh Assembly Today | Sakshi
Sakshi News home page

నేడు అసెంబ్లీలో 11 కీలక బిల్లులు

Published Mon, Dec 16 2019 2:36 AM | Last Updated on Mon, Dec 16 2019 7:55 AM

11 Key Bills In Andhra Pradesh Assembly Today - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రత్యేకంగా వేర్వేరు బోర్డుల ఏర్పాటు, మద్యం అక్రమాలపై కఠిన చర్యలతో పాటు పలు రంగాలకు చెందిన 11 కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ  కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులపై సోమవారం సభలో చర్చించి ఆమోదించనున్నారు.
 
ఆర్టీసీ ఉద్యోగుల విలీనం కోసం కొత్త చట్టం 
ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ‘అబ్జార‡్ష్పన్‌ ఆఫ్‌ ఎంప్లాయిస్‌ ఆఫ్‌ ఏపీఎస్‌ఆర్‌టీసీ ఇన్‌ టు గవర్నమెంట్‌ సర్వీసు యాక్ట్‌–2019’ బిల్లును రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేసి, ఆర్టీసీ ఉద్యోగులందరినీఈ శాఖ కిందకు తీసుకొస్తారు. ఈ చారిత్రక చట్టం చేయడం ద్వారా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేర్చిన ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
 
మద్దతు ధర కోసం చిరు, పప్పు ధాన్యాల బోర్డులు
రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు మెరుగైన ధరలు కల్పించడమే లక్ష్యంగా కాఫీ, టీ బోర్డుల తరహాలోనే చిరు, పప్పు ధాన్యాల బోర్డులను (వేర్వేరుగా) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బిల్లుప్రవేశపెట్టనుంది. ప్రధానంగా చిరు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడం, ఆ పంటలకు మద్దతు ధర కల్పించడం ఈ బోర్డుల ఏర్పాటు లక్ష్యం. ఈ బోర్డుల్లో చైర్మన్‌తో పాటు సీఈవో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. పరిశోధన విస్తరణ విభాగం, మార్కెట్‌ ఇంటలిజెన్స్, ట్రేడ్‌ ప్రమోషన్, గోదాములు, శీతల గిడ్డంగులు, యాంత్రికీకరణ విభాగం, మార్కెటింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ విభాగాలకు చెందిన నిపుణులను డైరెక్టర్లుగా నియమిస్తారు. ఈ బోర్డులు స్వయం ప్రతిపత్తితో పని చేస్తాయి.  

చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సాహకం, నాణ్యమైన దిగుబడులు సాధించడం, ఆ ఉత్పత్తుల విలువ పెంచేలా (విలువ జోడించడం) ప్రాసెసింగ్‌ చేయడం, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు అందేలా చేయడమే ఈ బోర్డుల ఉద్దేశం. వివిధ మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోనున్నారు. ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, అగ్రివాచ్‌తో సహా మరో ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నారు. మార్కెట్‌ ఇంటలిజెన్సీ కోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్‌ ధరలు, బిజినెస్‌ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఏజెన్సీ చూస్తుంది.

ఏ ఏ పంటలు వేయాలనే ప్రణాళికను ఈ బోర్డులు రూపొందిస్తాయి. ఇన్సూరెన్స్, వ్యవసాయ యాంత్రికీకరణ, మార్కెటింగ్, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, ప్రణాళికా విభాగాలు ఈ బోర్డుల్లో పనిచేస్తాయి. అవసరమైన సమయంలో మార్కెట్‌లో రైతులకు మెరుగైన ధరలు లభించని పక్షంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని వినియోగిస్తారు. పంటల ప్రణాళిక నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు ఈ బోర్డులు స్వతంత్రంగా పనిచేయనున్నాయి. అవసరమైన మౌలిక వసతుల కల్పన, పరిశోధన, స్టోరేజీ, ప్రాసెసింగ్, మార్కెట్‌ ఇంటలిజెన్స్‌కు అవసరమైన ప్రణాళికలను రూపొందించనున్నాయి.  
 
అక్రమ మద్యం విక్రయం, రవాణపై ఇక ఉక్కుపాదమే 
దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాలను, బార్ల సంఖ్యను గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేరాలను నాన్‌ బెయిలబుల్‌ కేసులుగా పరిగణిస్తారు. కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, మొదటిసారి పట్టుబడితే రూ.2 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్‌ ఫీజు కన్నా 2 రెట్లు జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్‌ రద్దు చేసేలా ఎక్సైజ్‌ చట్టంలో సవరణలకు బిల్లును నేడు ప్రవేశపెడతారు. 
 
ఈ అంశాలపై కూడా బిల్లులు.. 
మద్యం ముట్టుకుంటే షాక్‌ తగిలేలా అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎక్సైజ్‌ చట్టంలో సవరణలు. 
వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు, యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఏర్పాటుకు సంబంధించి జవహర్‌లాల్‌ నెహ్రూ అర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ చట్టంలో సవరణ. 
కర్నూలులో సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్‌ గవర్నమెంట్‌ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్‌ యూనివర్సిటీగా ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీల చట్టంలో సవరణ. 
ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ లేదా ఆయన ద్వారా నియమించబడిన వ్యక్తిని అన్ని యూనివర్సిటీల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియమించేందుకు వీలుగా యూనివర్సిటీల చట్టంలో సవరణ.  
ఆంధ్రప్రదేశ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ చట్టంలో సవరణ.  
ఆంధ్రప్రదేశ్‌ ట్యాక్స్‌ ఆన్‌ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టంలో సవరణ. 
ఆంధ్రప్రదేశ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ (ఏపీసీఎస్‌) చట్టం 1964లో సెక్షన్‌ 21–ఎ (1) (ఇ) సవరణ. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement