అయితే డొక్కు.. లేదా తుక్కు! | RTC Stranding with outdated buses | Sakshi
Sakshi News home page

అయితే డొక్కు.. లేదా తుక్కు!

Published Wed, Jul 17 2019 1:19 AM | Last Updated on Wed, Jul 17 2019 1:19 AM

RTC Stranding with outdated buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాలం చెల్లిన బస్సులతో కుస్తీ పడుతున్న ఆర్టీసీ ఇప్పుడు కొన్ని రూట్లకు సర్వీసులు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాది కాలంలో దాదాపు 200 బస్సులను కోల్పోవడమే దీనికి కారణం. కొన్నేళ్లుగా నిధులు లేక కునారిల్లుతున్న రవాణా సంస్థ కొత్త బస్సులు సమకూర్చుకోలేకపోయింది. ఫలితంగా దాదాపు జీవితకాలం పూర్తి చేసుకున్న బస్సులని బలవంతంగా తిప్పాల్సి వస్తోంది. వాటిల్లో కొన్ని ఇక అంగుళం కూడా ముందుకు కదలని స్థితికి చేరుకోవటంతో పక్కన పెట్టేసింది. అలా దాదాపు 150 సొంత బస్సులను తుక్కు కింద మార్చేసింది.

మరో 50 అద్దె బస్సులు కూడా రద్దయ్యాయి. దీంతో ఒక్కసారిగా 200 బస్సులు తగ్గిపోవటంతో ఇప్పుడు ఆర్టీసీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. గడచిన ఏడాది కాలంలో ఏకంగా కోటి కిలోమీటర్ల మేర తక్కువగా బస్సులు తిరిగాయి. కొన్ని గ్రామాలకు ట్రిప్పుల సంఖ్య తగ్గించగా, మరికొన్ని గ్రామాలకు సర్వీసులు నిలిపేసింది. ముఖ్యంగా నైట్‌హాల్ట్‌ సర్వీసుల్లో కొన్నింటిని రద్దు చేసుకుంది. ఇది ఇప్పుడు సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఐదారొందల బస్సులను తుక్కుకింద మార్చాల్సిన పరిస్థితి ఉండటంతో రవాణా సేవలపై ప్రభావం పడబోతోంది.  

తుక్కు చేసినవి 4,401.. కొన్నవి 1,584.. 
ఏయేటికాయేడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున బస్సుల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది. ఇందుకోసం కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. కానీ ఆర్టీసీలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. గడచిన ఐదేళ్లలో 4,401 బస్సులను తుక్కు కింద మూలపడేశారు. వాటి స్థానంలో కేవలం 1,584 బస్సులను మాత్రమే కొత్తగా చేర్చారు. అంటే దాదాపు 3 వేల బస్సులు తగ్గిపోయాయి. ఇప్పట్లో కొత్త బస్సులుకొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. అప్పులు పేరుకుపోయినందున కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకులు కూడా ససేమిరా అంటున్నాయి.

ఇక ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడంలేదు. దీంతో కొత్త బస్సులు కొనే అవకాశమే లేదు. ఇప్పుడు దాదాపు నాలుగు వేల బస్సులు పరిమితికి మించి తిరిగి పూర్తి డొక్కుగా మారాయి. రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ వాటిని వాడుతోంది. కొత్త బస్సులు రానందున ఒకేసారి అన్ని బస్సులను తుక్కుగా మారిస్తే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీంతో దశలవారీగా కొన్ని చొప్పున వచ్చే మూడునాలుగేళ్లలో వాటిని తొలగించబోతున్నారు. ఈ సంవత్సరం కనీసం ఐదొందల వరకు తొలగించే అవకాశం ఉంది. ఇప్పుడు 200 బస్సులు తగ్గిపోతేనే కోటి కిలోమీటర్ల మేర బస్సులు తిరగలేకపోయాయి.  

బ్యాటరీ బస్సుల కోసం ఎదురుచూపు
కేంద్రం ఇచ్చే సబ్సిడీతో కొనే బ్యాటరీ బస్సుల కోసం ఇప్పుడు ఆర్టీసీ ఎదురు చూస్తోంది. ఫేమ్‌ పథకం రెండో దశ కింద 500 నుంచి 600 బస్సులు కోరుతూ ఆర్టీసీ ఈ నెలలో ఢిల్లీకి ప్రతిపాదన పంపబోతోంది. ఇందులో కనీసం మూడొందలకు తగ్గకుండా బస్సులు మంజూరవుతాయని ఆశిస్తోంది. ఇవన్నీ అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోనున్నా... ప్రయాణికులకు సేవలు మెరుగవటం ఖాయం. సొంతంగా బస్సులు కొనే పరిస్థితి లేనందున వీటిపై ఆధారపడాల్సి వస్తోంది. బ్యాటరీ బస్సులు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయోనన్న ఆందోళన కూడా ఆర్టీసీని వెంటాడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement