ముంబై : ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్ సంజయ్ మోర్‌కి ఎలక్ట్రిక్ బస్సు నడపడం రాదని, ఈవీ బస్సుపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తేలింది.
పోలీస్ కస్టడీలో ఉన్న పోలీసుల విచారణలో బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ పలు కీలక విషయాల్ని వెల్లడించాడు. ఎలక్ట్రిక్ బస్సు నడపడంలో తనకు అనుభవం లేదని, కేవలం ఒక్క రోజు ఈవీ బస్సును డ్రైవింగ్ చేసినట్లు చెప్పాడు. ఆ ఒక్క రోజు కేవలం మూడుసార్లు నడిపిట్లు చేసినట్లు, అనంతరం విధులకు హజరైనట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.
కాబట్టే 60 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న ఈవీ బస్సును ఎలా కంట్రోల్ చేయాలో తనకు అర్ధం కాలేదని, కాబట్టే ఈ ఘోర ప్రమాదానికి దారి తీసినట్లు పోలీసులకు చెప్పాడు. అనుభవం లేకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి ఘోర ప్రమాదానికి దారి తీసింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కిటికి అద్దాలు పగులగొట్టి, తన క్యాబిన్‌లో ఉన్న బ్యాగ్ తీసుకుని పారిపోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ముంబై ఆర్టీసీ విభాగంపై విమర్శలు
ముంబై ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. ఆరు వారాల పాటు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ మోరాకు ఈవీ బస్సులో విధులు అప్పగించడంపై ముంబై ఆర్టీసీ అధికారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్టీసీ బస్సు బీభత్సం
గత సోమవారం సాయంత్రం 9.30 గంటల సమయంలో హౌసింగ్ కాలనీలో కుర్లాలోని ఎస్‌జీ బార్వేరోడ్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 42మందికి తీవ్ర గాయాలయ్యాయి. 20కి పైగా వాహనాలు ధ్వంస మయ్యాయి. బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్(43)ని అరెస్ట్ చేశారు.
బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment