పల్లెవెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ సర్వీసులకూ వినియోగం
‘నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు’ కింద టీజీఎస్ ఆర్టీసీకి 450 ఎలక్ట్రిక్ బస్సులు
ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థకు కాంట్రాక్టు.. అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలో నిర్వహణ
హైదరాబాద్ – నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వెలుపలా ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో పరిమితంగా తిరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇటీవల హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయోగాత్మకంగా పది ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను గరుడ ప్లస్ కేటగిరీలో ప్రారంభించారు. ఇప్పుడు తొలిసారి రాష్ట్రపరిధిలో హైదరాబాద్‌తో ఇతర ప్రధాన పట్టణాలను ఎలక్ట్రిక్ బస్సులతో అనుసంధానించే బృహత్తర కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.
ఇవి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు కేటగిరీలో సేవలందించనున్నాయి. ఇప్పటివరకు నగరం వెలుపలి ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు లేవు. ఆ లోటును భర్తీ చేస్తూ 450 బస్సులు ఆర్టీసీ బస్సు శ్రేణిలో చేరబోతున్నాయి. మరో వారం తర్వాత నుంచి ఈ బస్సులు దశలవారీగా రోడ్డెక్కనున్నాయి. హైదరాబాద్–నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య ఇవి తిరగనున్నాయి.
నేషనల్ ఎలక్ట్రిక్ బస్సు ప్రోగ్రాం కింద సరఫరా..
దేశవ్యాప్తంగా వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటానని భారత్ ఐక్యరాజ్య సమితికి హామీ ఇచ్చి, ఆమేరకు చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకునే మోదీ ప్రభుత్వం గతంలో ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్)’పేరుతో పథకాన్ని ప్రారంభించింది. రెండుదశల్లో దీన్ని అమలు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ఈ పథకం కింద వచ్చినవే.
రెండోదశలో మరో 500 బస్సుల కోసం ఆర్టీసీ ప్రతిపాదించగా, అవి కూడా మంజూరయ్యాయి. కానీ కొన్ని కారణాలతో ఆ కాంట్రాక్టు వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండటంతో ఆ బస్సులు రాలేదు. ఇప్పుడు ఫేమ్ స్థానంలో కేంద్రప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు(ఎన్‌ఈబీపీ)ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణ ఆర్టీసీకి 450 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో బస్సులు సరఫరా చేసే ఆ టెండర్‌ను ఢిల్లీకి చెందిన జేబీఎం కంపెనీ దక్కించుకుంది.
వారంరోజుల్లో తొలిదశ బస్సులు
బ్యాటరీ బస్సులకు జేబీఎం సంస్థ మరో వారంరోజుల్లో శ్రీకారం చుట్టనుంది. ఆ సంస్థనే అద్దె ప్రాతిపదికన బస్సుల నిర్వహణ చూసుకుంటుంది. డ్రైవర్ల బాధ్యత జేబీఎందే కాగా,కండక్టర్ మాత్రం ఆర్టీసీ నుంచి విధుల్లో ఉంటాడు. ఈ బస్సులను నడిపినందుకుగాను ప్రతి కి.మీ.కు రూ.40 చొప్పున అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లిస్తుంది. వీటికి అవసరమైన చార్జింగ్ వ్యవస్థను ఆ సంస్థనే ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్‌తోపాటు ఆయా పట్టణాల్లోని సంబంధిత డిపోల్లో వీటిని ఏర్పాటు చేస్తుంది. తొలుత 20 బస్సులు రానున్నాయి.
అలా విడతలవారీగా వచ్చే రెండు నెలల్లో మొత్తం బస్సులు రోడ్డెక్కే అవకాశముంది. 450 బస్సులను సరఫరా చేయాల్సి ఉండగా, 400 బస్సులకు సంబంధించిన షెడ్యూళ్లను ఆర్టీసీ ఆ సంస్థకు అందించింది. ఇప్పుడు ఆ 400 బస్సులు వీలైనంత త్వరలో అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ ఆ సంస్థకు సూచించింది. వీటిల్లో 245 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 85 సూపర్ లగ్జరీ బస్సులు, 70 పల్లెవెలుగు సర్వీసులు ఉంటాయి. దాదాపు వేయి వరకు డీజిల్ బస్సులను ఆర్టీసీ దశలవారీగా సమకూర్చుంటుండగా, వాటికి అదనంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి.
ఒకసారి చార్జింగ్ చేస్తే 350 కి.మీ. వరకు ప్రయాణం
గతంలో ఎలక్ట్రిక్ బస్సులు ఒకసారి ఫుల్‌చార్జ్ చేస్తే 225 కి.మీ.వరకు తిరిగేవి. దీంతో వాటిని దూరప్రాంతాలకు నడపటం కష్టంగా మారింది. హైదరాబాద్ నుంచి గమ్యం చేరి తిరిగి సిటీకి వచ్చేలోపు చార్జింగ్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఈ సమస్యను అప్పటికిప్పుడు అధిగమించలేక ఇతర పట్టణాలకు తిప్పేందుకు ఆర్టీసీ సాహసించలేదు.
ఇప్పుడు కొత్తగా వస్తున్న బస్సులు ఫుల్‌చార్జ్ చేస్తే 350 కి.మీ.వరకు నడుస్తాయి. దీంతో దూరప్రాంత పట్టణాలకు వాటిని తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆయా పట్టణాల్లో కూడా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నందున, తిరుగు ప్రయాణంలో మళ్లీ ఫుల్ చార్జింగ్‌తో వస్తాయి. దీంతో మధ్యలో చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment