విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రాజధాని బస్సు సీటు ఊడిపోయింది. సీటు రిజర్వు చేసుకున్న ప్రయాణికురాలు ఇలా డ్రైవర్ క్యాబిన్ దగ్గర సింగిల్ సీటుపై కూర్చోవలసి వచ్చింది.
విరిగిన సీట్లు.. పనిచేయని ఏసీలు
పది లక్షల కిలోమీటర్లు తిరిగినా ఇంకా నడుపుతున్న ఆర్టీసీ
కొత్త బస్సులు కొనేందుకు నిధులేవీ ?
సాక్షి, హైదరాబాద్: రాజధాని బస్సులు ఆర్టీసీ ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. విరిగిన కుర్చిలు, సరిగ్గా పనిచేయని ఏసీ, పరిశుభ్రత అంతంతమాత్రమే కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికుల నుంచి సంపూర్ణ ఆదరణ ఉన్నా, కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో కావాల్సినన్ని బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోలేకపోతోంది. గత సంవత్సరం ఖరారైన టెండర్లకు సంబంధించిన బస్సులు విడతల వారీగా సమకూరుతున్నాయి. కానీ, అది ఆర్టీసీ డిమాండ్‌కు తగ్గట్టుగా లేకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితిలో డొక్కు బస్సులను ఆర్టీసీ కొనసాగించాల్సి వస్తోంది. ఇటీవల 750 వరకు కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసింది. పాత సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని వినియోగించుకుంటూ, మిగతా వాటిని ఎక్స్‌ప్రెస్ బస్సులుగా, సిటీ బస్సులుగా అధికారులు మార్చారు. కానీ, రాజధాని కేటగిరీకి మాత్రం కొత్త బస్సులు లేక, పాత వాటినే వినియోగిస్తున్నారు.
డిమాండ్ ఉన్నా..
రాజధాని బస్సులకు బాగా డిమాండ్ ఉంది. గరుడ బస్సుల్లో టికెట్ ధర ఎక్కువగా ఉన్నందున, టికెట్ ధరలు తక్కువగా ఉండే ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. రైలు నెట్‌వర్క్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అంతగా తిరగని దూర ప్రాంతాల్లో ఈ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో అయితే, విజయవాడ లాంటి రైలు కనెక్టివిటీ మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కూడా వీటిల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంది.
2016లో కొన్న బస్సులే...
ప్రస్తుతం 235 రాజధాని బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. అవన్నీ 2016లో కొన్న బస్సులు. సాధారణంగా ఐదు లక్షల కిలోమీటర్లు తిరగ్గానే బస్సులను మార్చేస్తారు. కానీ, ఇవి 10 లక్షల కి.మీ. తిరిగినా వాటినే వాడాల్సి వస్తోంది. పాతవాటి స్థానంలో కొత్తవి కొనాల్సి ఉన్నా నిధుల లేమితో ఆర్టీసీ సమకూర్చుకోలేకపోయింది. గతేడాది 46 బస్సులకు టెండర్లు పిలిచారు. తాజాగా అవి సమ కూరాయి. దీంతో వాటి సంఖ్య 281కి చేరింది. వాస్తవానికి పాత 235 బస్సు లను తొలగించి అంతమేర కొత్తవి సమకూర్చుకోవాల్సి ఉంది. నిధులు లేక కొత్తవి కొనలేకపోతున్నారు.
అన్నీ సమస్యలే....
పాత బస్సుల్లో ఏవీ సక్రమంగా ఉండటం లేదు. సీట్లు పాడైనా మరమ్మతు చేయకుండానే ట్రిప్పులకు పంపుతున్నారు. ఆది, సోమవారాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. సీట్లు విరిగినా.. ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ రిజర్వేషన్‌లో ఉంచుతున్నారు. వాటిని బుక్ చేసుకున్నవారు వాటిల్లో కూర్చోలేక నానా తిప్పలు పడుతున్నారు. కొందరు మధ్యలోనే దిగిపోతున్నారు. ఇక వాటిల్లో ఏసీ వ్యవస్థ పాతబడి సరిగ్గా పనిచేయటం లేదు. మధ్యాహ్నం వేళ ఏసీ ప్రభావం అంతగా లేక ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగటంతో ఈ బస్సులెక్కాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్సుల్లో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం నిత్యకృత్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment