వాటిపై అవగాహనకు చెన్నై అశోక్‌లేలాండ్ ప్లాంట్‌కు వెళ్లిన అధికారులు
కాలుష్య కారకాల ఉత్పత్తిని నియంత్రించే ప్రమాణాలతో తయారీ
31 సెన్సార్లు.. అతి తక్కువ కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: భారత్ స్టేజ్–6 బస్సుల వాడకంపై ఆర్టీసీ దృష్టి సారించింది. వాయు కాలుష్య కారకాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఉద్దేశించిన ఉద్గారాల ప్రమాణాల జాబితాలోని బీఎస్–6 బస్సుల వాడకానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. ఇంతకాలం బీఎస్–4 ప్రమాణాల బస్సుల వాడకానికి పరిమితమైన ఆర్టీసీకి ఇప్పుడు బీఎస్–6కు చెందిన 1,500 బస్సులు కొత్తగా సమకూరాయి. 2020 నుంచి మన దేశంలో ఈ ప్రమాణ బస్సులను అందుబాటులోకి తెచ్చినా..ఆర్టీసీ కొత్త బస్సులు కొనకపోవటంతో ఆ శ్రేణి బస్సులు ఇప్పటివరకు సమకూరలేదు.
గతేడాది ఆర్టీసీ కొత్త బస్సులకు ఆర్డర్ ఇవ్వగా, దశలవారీగా అవి సమకూరుతున్నాయి. కొత్త బస్సులన్నీ బీఎస్–6 శ్రేణి బస్సులే. తాజా యూరో ప్రమాణాల మేరకు ఇవి రూపొందాయి. కర్బన ఉద్గారాలు తక్కువ పరిమితిలో విడుదల చేయటంతోపాటు ఎక్కువ ఎల్రక్టానిక్ డిజైన్‌తో ఇవి రూపొందాయి. దీంతో వీటి వినియోగంపై అవగాహన కల్పించేందుకు బీఎస్–6 బస్సులున్న డిపోలను పర్యవేక్షిస్తున్న అధికారులకు చెన్నైలోని అశోక్ లేలాండ్ కంపెనీలో వాటి తయారీ ఇంజినీర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఆ బస్సుల ప్రత్యేకత ఏంటంటే...
మన దేశంలో 2000 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అమలులోకి వచ్చింది. తొలుత భారత్ స్టేజ్–1 ప్రారంభమైంది. అలా 2020 నుంచి బీఎస్–6 ప్రమాణాలు మొదలయ్యాయి. అంతకుముందు శ్రేణి వాహనాలతో పోలిస్తే వీటిల్లో కాలుష్య కారకాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేలా ఇంజిన్లను ఆధునికీకరించారు. అంతకు ముందున్న బీఎస్–4 (బీఎస్–5 స్కిప్) డీజిల్ బస్సుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితి 250 మి.గ్రా.గా ఉండేది. దానిని బీఎస్–6 బస్సుల్లో 80 మి.గ్రా.కు కట్టడి చేశారు. పరి్టక్యులేట్ మ్యాటర్ పరిమితిని 25 మి.గ్రా.ల నుంచి 4.5 మి.గ్రా/కి.మీ.కు తగ్గించారు. దీనివల్ల కొత్తతరం బస్సుల్లో కాలుష్య కారకాల విడుదల చాలా తక్కువగా ఉంటుంది.
డాష్ బోర్డులో పలు రకాల సూచనలు
ఈ బస్సుల్లో డాష్‌బోర్డుపై పలు రకాల సూచనలు బ్లింక్ అవుతుంటాయి. ఆ మేరకు డ్రైవర్లు బస్సులను నడపాలి. ఈ బస్సుల్లోని చాలా భాగాలు సెన్సార్ల ఆధారంగా పనిచేస్తాయి. వీటిల్లో దాదాపు 31 సెన్సార్లు ఏర్పాటు చేశారు. పాత బస్సుల్లో డాష్ బోర్డుకు ప్రాధాన్యమే ఉండేదికాదు. డిస్‌ప్లే బోర్డులో రీడింగ్ మీటర్లు పగిలిపోయి రంధ్రాలే కనిపిస్తుండేవి. కానీ, కొత్తతరం బస్సుల్లో 31 సెన్సార్లు అలర్ట్‌లను చూపుతుంటాయి.
ఏదైనా బ్లింక్ కనిపిస్తే, సంబంధిత ఇంజిన్ భాగంపై దృష్టి సారించాలి. దీనికి సంబంధించి ఆయా బస్సులను నిర్వహిస్తున్న డిపోల అధికారులకు ముందు అవగాహన కలిగితే, వారు డ్రైవర్లను ప్రశ్నిస్తూ బస్సులు మెరుగ్గా నడిచేలా చూస్తారని సంస్థ భావిస్తోంది. ఈమేకు ఆయా డిపోల అధికారులను చెన్నైలోని అశోక్‌లేలాండ్ ప్లాంట్‌కు పంపింది. మొదటి బ్యాచ్ అధికారుల బృందం ప్రస్తుతం చెన్నై ప్లాంట్‌లో ఉంది. త్వరలో రెండో బృందం వెళ్లనుంది.
కాలుష్య కణాలు వెలువడవు
బస్సు వదిలే పొగలో లక్షల సంఖ్యలో కాలుష్య కణాలుంటాయి. అవి మన శరీరంలోకి చేరితే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొగగొట్టం నుంచి వెలువడే పొగతో అవి వాతావరణంలోకి చేరతాయి. కానీ, బీఎస్–6 బస్సుల్లో ప్రత్యేక వ్యవస్థ ఉంది. డీజిల్ మండిన తర్వాత వెలువడే ఈ సూక్ష కణాలు ఒకచోట జమవుతాయి. నిర్ధారిత సమయంలో అవి మరోసారి మండి బూడిదగా మారి నేల మీద పడిపోతాయి. పొగ రూపంలో అవి వాతావరణంలో కలిసే ప్రమాదం బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ బస్సుల్లో, పాతతరం బస్సుల తరహాలో పొగగొట్టం ఉండదు. డ్రైవర్ పక్కనున్న ఇంజిన్ కిందే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకతలు ఈ బస్సుల్లో ఎన్నో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment