కిక్కిరిసిపోయిన ఉత్తరాది రైళ్లు
రైళ్లు లేక, బెర్తులు లభించక..
జనరల్ బోగీల్లో చోటులేక ప్రయాణికుల పడిగాపులు
మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు మంగళవారం కిటకిటలాడాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లు ప్రయాణికుల రద్దీతో సందడి నెలకొంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలకు దీపావళి, ఛట్ పండుగలు ఎంతో ముఖ్యం. ఈ మేరకు నగరంలో ఉంటున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తప్పనిసరిగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. దీపావళి పర్వదినానికి మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో మంగళవారం పెద్ద ఎత్తున బయలుదేరారు. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లు కిక్కిరిశాయి.
నెల రోజుల క్రితమే రిజర్వేషన్లు..
👉హైదరాబాద్ నుంచి పాటా్న, కోల్‌కతా, వారణాసి, దానాపూర్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో సాధారణ రోజుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, దర్బంగా తదితర రైళ్లలో నెల రోజుల క్రితమే రిజర్వేషన్‌లు భర్తీ అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ సైతం వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో బుకింగ్‌కు కూడా అవకాశం లేకుండా నో రూమ్ దర్శనమిస్తోంది. దీంతో ప్రయాణికులు అనివార్యంగా జనరల్ బోగీలపై ఆధారపడాల్సి వస్తోంది.
👉 ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. జనరల్ బోగీల్లో కాలు మోపేందుకు కూడా చోటు లేకుండాపోయిందని దానాపూర్ ప్రయాణికులు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే ఏదోఒక విధంగా సొంత ఊళ్లకు వెళ్లాలనే పట్టుదలతో జనరల్ బోగీల్లోనే అతికష్టంగా బయలుదేరి వెళ్తున్నారు. మరో రెండు రోజుల పాటు కూడా ఇదే రద్దీ ఉండవచ్చని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. జనరల్ టికెట్‌ల కోసం అదనపు బుకింగ్ కౌంటర్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అదనంగా 30 వేల మంది ప్రయాణికులు..
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది వలస కూలీలు నగరంలో నిర్మాణరంగంలో పని చేస్తున్నారు. కుటుంబాలతో సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కూలీలంతా దీపావళి వేడుకల కోసం సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దూరభారం దృష్ట్యా రోడ్డు మార్గంలో కంటే రైళ్లలో బయలుదేరి వెళ్లేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపడంతో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఈ రద్దీని ముందే ఊహించి అదనపు రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ అవి ఏ మాత్రం చాలడం లేదు. ముఖ్యంగా జనరల్ బోగీల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా వరకు 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 మాత్రమే జనరల్ బోగీలు ఉన్నాయి.
కొన్నింటిలో మాత్రం 3 నుంచి 4 సాధారణ బోగీలు ఉన్నాయి. అయినప్పటికీ అందుకు 5 రెట్ల మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు తరలి వస్తున్నారు. భార్యాపిల్లలతో సహా సికింద్రాబాద్ స్టేషన్‌కు తరలి వచి్చన ప్రయాణికులు చివరకు జనరల్ బోగీల్లో కూడా వెళ్లేందుకు అవకాశం లేక స్టేషన్ బయటపడిగాపులు కాస్తున్నారు. ‘తిరిగి ఇంటికి వెళ్లడం కంటే ఇక్కడే ఉండి ఏదో ఒక ట్రైన్ పట్టుకొని వెళ్లిపోవడం మంచిది కదా’ అని సంజన్ అనే ప్రయాణికుడు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా.. మంగళవారం అదనంగా మరో 30 వేల మందికి పైగా సొంత ఊళ్లకు బయలుదేరినట్లు అంచనా.
షాపింగ్ సందడి
దీపావళి, ధన్‌తేరస్ సందర్భంగా నగరంలోని టపాసులు, బంగారం, వస్త్ర దుకాణాలు మంగళవారం కిటకిటలాడాయి. ఎటు చూసినా దీపావళి సందడే కనిపించింది. కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బంగారం రేట్లు కాస్త పెరిగినప్పటికీ... దీపావళితో పాటు ధన్ తేరస్, ముఖ్యంగా వివాహాల సీజన్ కావడంతో నగరంలో బంగారం కొనుగోళ్లు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలకున్న సెంటిమెంట్లు, అపోహలు ఇతర ఏ అంశాలు బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపలేదు. అంతేకాకుండా పండుగ నేపథ్యం, వివాహాల శుభకార్యాల కారణంగా వజ్రాభరణాల దుకాణాల యాజమాన్యాలు వినియోగదారులను సంతృప్తి పరచడానికి ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే.. షాపింగ్ మాల్స్ సైతం కొనుగోనుదారులతో కిటకిటలాడుతూ కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment