
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెషల్ బస్సుల చార్జీలను మాత్రమే సంస్థ సవరించిందని, రెగ్యులర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఒక ప్రకటనలో తెలిపారు.
పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లేప్పుడు బస్సుల్లో ప్రయాణికులు అధికంగా ఉంటారని, వారిని దింపి బస్సులు ఖాళీగా నగరానికి రావలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో డీజిల్ ఖర్చుకు సరిపడా ఆదాయం కూడా ఉండదని తెలిపారు. అందుకోసం స్పెషల్ బస్సుల్లో చార్జీలను స్వల్పంగా సవరించే వెసులుబాటు ఉందని వెల్లడించారు.