విశాఖ ద్వారకా బస్‌స్టేషన్‌లో సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీకి సంక్రాంతి సంతోషాన్నిచ్చింది. ఈ ఏడాది ఊహించిన దానికంటే అధిక ఆదాయాన్ని ఆర్జించింది. ఈనెల ఎనిమిదో తేదీ నుంచే సంక్రాంతి రద్దీ మొదలైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను అందుబాటులోకి తెచ్చారు. 765 సంక్రాంతి స్పెషల్ సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 22వ తేదీ వరకు నడిపారు. వీటిలో జోన్–1 నుంచి హైదరాబాద్‌కే 120కి పైగా బస్సులను తిప్పారు. గత సంక్రాంతికి కేవలం 60 బస్సులనే నడపగా ఈసారి వాటిని రెట్టింపు చేశారు.
తెలంగాణలో మహలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించడంతో ఎక్కువ బస్సులను అక్కడ అవసరాలకే కేటాయించారు. ఫలితంగా సంక్రాంతికి టీఎస్‌ఆర్టీసీ బస్సుల కొరతతో ఆంధ్రప్రదేశ్ వైపు స్పెషల్ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్–విశాఖపట్నంల మధ్య ఎక్కువ సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రయత్నం బాగా ఫలించి మంచి ఆదాయాన్ని సమకూర్చింది. గత సంక్రాంతికి విశాఖ జిల్లా నుంచి 745 స్పెషల్స్‌ను నడపగా.. ఈ సంవత్సరం 20 బస్సులను అదనంగా వెరసి 765 స్పెషల్స్‌ను నడిపారు.
వీటిలో సంక్రాంతికి ముందు 472, తర్వాత 293 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ప్రయాణికుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం, పలాస, పాలకొండ, రాజాం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు తిప్పారు. ఈ స్పెషల్ బస్సుల ద్వారా సంక్రాంతి దాకా రూ.79,81,655, అనంతరం రూ.74,64,119 వెరసి రూ. 1,54,45,774 రాబడి వచ్చింది. గత సంక్రాంతికి రూ.1,41,57,400 ఆదాయాన్ని ఆర్జించింది. అంటే గత సంక్రాంతికంటే సుమారు రూ.12 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందన్న మాట!
పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో
మరోవైపు ఈ సంక్రాంతికి ప్రయాణికుల ఆక్యపెన్సీ రేషియో (ఓఆర్) కూడా బాగానే పెరిగింది. గతేడాది ఓఆర్ 62 శాతం ఉండగా ఇప్పుడది 67 శాతానికి చేరింది. కిలోమీటరుకు రూ.42.90 ఆదాయం సమకూరింది. కాగా సంక్రాంతి పండగకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యే వారిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 28వ తేదీ వరకు స్పెషల్ సర్వీసులను నడుపుతామని విశాఖ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment