Battery buses
-
ఆర్టీసీకి ఎలక్ట్రిక్ షాక్!
సాక్షి, హైదరాబాద్: అందినట్టే అంది బ్యాటరీ బస్సులు చేజారిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 325 ఎలక్ట్రిక్ బస్సులు అందకుండా పోతున్నాయి. ఇవన్నీ సబ్సిడీ ధరలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి కావటం విశేషం. కొత్త బస్సులు కొనే పరిస్థితి లేక కునారిల్లుతున్న ఆర్టీసీ ఖాతాలో ఒకేసారి ఇన్ని బస్సులు చేరే అవకాశం చేజారిపోతోంది. డిసెంబర్ 15లోపు టెండర్ల తంతు పూర్తి చేసి కేంద్ర ఉపరితల రవాణాశాఖకు వివరాలు అందజేయాల్సి ఉన్నా, ఆర్టీసీ సమ్మె వల్ల ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇక గడువుకు ఎక్కువ సమయం లేకపోవటంతో ఆ బస్సుల కేటాయింపు రద్దయినట్టేనని ఆర్టీసీ తేల్చేసింది. ఇదీ సంగతి.. కేంద్ర ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో అన్ని ప్రధాన నగరాలు, కొన్ని పట్టణాలకు బ్యాటరీ బస్సులను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ ఖరీదైనవి కావటంతో వాటిని సబ్సిడీ ధరలకు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఫాస్టర్ అడా ప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) పథకం పేరుతో వీటిని మంజూరు చేస్తోంది. తొలిదశలో హైదరాబాద్ సిటీకి వంద ఏసీ బస్సులు మంజూరు చేయగా వాటిల్లో 40 వచ్చాయి. వీటిల్లో ఒక్కో బస్సుపై రూ.కోటి సబ్సిడీ ప్రకటించింది. రెండో దశలో భాగంగా 325 నాన్ ఏసీ బస్సులు మంజూరయ్యాయి. వీటిల్లో ఒక్కో దానిపై రూ.50 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించింది. ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో వాటిని ఏర్పాటు చేసేలా ఆర్టీసీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సరిగ్గా ఫర్మ్‌ను ఎంపిక చేసే సమయంలో ఆర్టీసీలో సమ్మె మొదలైంది. వాస్తవానికి సెప్టెంబర్‌లోనే ఆర్టీసీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్‌లో దాన్ని మదించి కాం ట్రాక్టు సంస్థను గుర్తించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను సగానికి సగం తగ్గించి 5,100 బస్సులను ప్రైవేటు పర్మిట్ల ద్వారా తిప్పాలని నిర్ణయించింది. అంటే, ఆర్టీసీ బస్సులు తిరిగే రూట్లలో ప్రైవేటు బస్సులు స్టేజీ క్యారి యర్లుగా తిరగాల్సి ఉందన్నమాట. దీంతో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఏ ఖాతాలో ఉంచాలన్న విషయంలో స్పష్టత రాకపోవటంతో, వాటి కోసం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను అధికారులు రద్దు చేశారు. స్పష్టత వచ్చాక తిరిగి పిలవాలని నిర్ణయించారు. కానీ సమ్మె ఏకంగా 52 రోజుల సుదీర్ఘ సమయం కొనసాగటం, రూట్ పర్మిట్లపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావటంతో తీవ్ర జాప్యం జరిగింది. తిరిగి సమ్మె ముగిసి ఆర్టీసీ యథావిధిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి తేల్చారు. కానీ, డిసెంబర్ 15 వరకు టెండర్ ఖరారు చేసి ఢిల్లీకి పంపాల్సి ఉంది. దానికి సమయం చాలా తక్కువగా ఉండటంతో అధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి ఇప్పటికిప్పుడు అదనపు సమయం తీసుకునే వెసులుబాటు లేకపోవటంతో ఈ సంవత్సరానికి ఆ ప్రాజెక్టును వదులుకోవాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేస్తే తప్ప ఈ బస్సులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అన్నీ ప్రైవేటు సంస్థలకే.. నిజానికి ఎలక్ట్రిక్ బస్సులను కొనే స్థోమత ఆర్టీసీకి లేదు. ఒక్కో బస్సుకు రూ.50లక్షల సబ్సిడీ వస్తున్నందున ప్రభుత్వం సహకరిస్తే కొనే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం అన్ని నిధులు ఆర్టీసీకి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. దీంతో ప్రైవేటు సంస్థలకు ఆ సబ్సిడీని బదిలీ చేసి అద్దె ప్రాతిపదికన ఆ సంస్థ నుంచి బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. ఫేమ్ పథకంలో ఈ వెసులుబాటు ఉండటంతో దాన్నే ఆర్టీసీ అనుసరించింది. డిసెంబర్ 15లోపు టెండర్ల ప్రక్రియ పూర్తయితే, మరో ఏడెనిమిది నెలల్లో బస్సులందే అవకాశం ఉండేది. వాటిల్లో 309 బస్సులను సిటీలో, మిగతావి వరంగల్ పట్టణంలో నడపాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న దశలో ఈ అవాంతరం ఆర్టీసీని నిరాశకు గురిచేసింది. -
అయితే డొక్కు.. లేదా తుక్కు!
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన బస్సులతో కుస్తీ పడుతున్న ఆర్టీసీ ఇప్పుడు కొన్ని రూట్లకు సర్వీసులు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏడాది కాలంలో దాదాపు 200 బస్సులను కోల్పోవడమే దీనికి కారణం. కొన్నేళ్లుగా నిధులు లేక కునారిల్లుతున్న రవాణా సంస్థ కొత్త బస్సులు సమకూర్చుకోలేకపోయింది. ఫలితంగా దాదాపు జీవితకాలం పూర్తి చేసుకున్న బస్సులని బలవంతంగా తిప్పాల్సి వస్తోంది. వాటిల్లో కొన్ని ఇక అంగుళం కూడా ముందుకు కదలని స్థితికి చేరుకోవటంతో పక్కన పెట్టేసింది. అలా దాదాపు 150 సొంత బస్సులను తుక్కు కింద మార్చేసింది. మరో 50 అద్దె బస్సులు కూడా రద్దయ్యాయి. దీంతో ఒక్కసారిగా 200 బస్సులు తగ్గిపోవటంతో ఇప్పుడు ఆర్టీసీకి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. గడచిన ఏడాది కాలంలో ఏకంగా కోటి కిలోమీటర్ల మేర తక్కువగా బస్సులు తిరిగాయి. కొన్ని గ్రామాలకు ట్రిప్పుల సంఖ్య తగ్గించగా, మరికొన్ని గ్రామాలకు సర్వీసులు నిలిపేసింది. ముఖ్యంగా నైట్‌హాల్ట్ సర్వీసుల్లో కొన్నింటిని రద్దు చేసుకుంది. ఇది ఇప్పుడు సంస్థ పనితీరుపై ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఐదారొందల బస్సులను తుక్కుకింద మార్చాల్సిన పరిస్థితి ఉండటంతో రవాణా సేవలపై ప్రభావం పడబోతోంది. తుక్కు చేసినవి 4,401.. కొన్నవి 1,584.. ఏయేటికాయేడు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున బస్సుల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది. ఇందుకోసం కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. కానీ ఆర్టీసీలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. గడచిన ఐదేళ్లలో 4,401 బస్సులను తుక్కు కింద మూలపడేశారు. వాటి స్థానంలో కేవలం 1,584 బస్సులను మాత్రమే కొత్తగా చేర్చారు. అంటే దాదాపు 3 వేల బస్సులు తగ్గిపోయాయి. ఇప్పట్లో కొత్త బస్సులుకొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. అప్పులు పేరుకుపోయినందున కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకులు కూడా ససేమిరా అంటున్నాయి. ఇక ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడంలేదు. దీంతో కొత్త బస్సులు కొనే అవకాశమే లేదు. ఇప్పుడు దాదాపు నాలుగు వేల బస్సులు పరిమితికి మించి తిరిగి పూర్తి డొక్కుగా మారాయి. రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ వాటిని వాడుతోంది. కొత్త బస్సులు రానందున ఒకేసారి అన్ని బస్సులను తుక్కుగా మారిస్తే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీంతో దశలవారీగా కొన్ని చొప్పున వచ్చే మూడునాలుగేళ్లలో వాటిని తొలగించబోతున్నారు. ఈ సంవత్సరం కనీసం ఐదొందల వరకు తొలగించే అవకాశం ఉంది. ఇప్పుడు 200 బస్సులు తగ్గిపోతేనే కోటి కిలోమీటర్ల మేర బస్సులు తిరగలేకపోయాయి. బ్యాటరీ బస్సుల కోసం ఎదురుచూపు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో కొనే బ్యాటరీ బస్సుల కోసం ఇప్పుడు ఆర్టీసీ ఎదురు చూస్తోంది. ఫేమ్ పథకం రెండో దశ కింద 500 నుంచి 600 బస్సులు కోరుతూ ఆర్టీసీ ఈ నెలలో ఢిల్లీకి ప్రతిపాదన పంపబోతోంది. ఇందులో కనీసం మూడొందలకు తగ్గకుండా బస్సులు మంజూరవుతాయని ఆశిస్తోంది. ఇవన్నీ అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోనున్నా... ప్రయాణికులకు సేవలు మెరుగవటం ఖాయం. సొంతంగా బస్సులు కొనే పరిస్థితి లేనందున వీటిపై ఆధారపడాల్సి వస్తోంది. బ్యాటరీ బస్సులు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయోనన్న ఆందోళన కూడా ఆర్టీసీని వెంటాడుతోంది. -
ఆర్టీసీ ‘బ్యాటరీ’ డౌన్!
సాక్షి, హైదరాబాద్: బ్యాటరీ బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ఆర్టీసీ వినియోగించుకోలేక ప్రైవేటు సంస్థ చేతుల్లో పెట్టేస్తోంది. పర్యావరణానికి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పెద్ద నగరాల్లో వీలైనన్ని బ్యాటరీ బస్సులను రోడ్ల మీదకు తేవటం ద్వారా సాధారణ బస్సుల నుంచి వెలువడే పొగను తగ్గించాలని కేంద్రం భావించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరానికి తొలి విడతలో 40 ఎలక్ట్రిక్ బస్సులను కొనేందుకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున సబ్సిడీ ప్రకటించింది. ఆ మొత్తాన్ని ఆర్టీసీకి కేటాయిస్తోంది. కానీ దాన్ని వినియోగించుకోలేక చేతులెత్తేసిన ఆర్టీసీ.. ఆ మొత్తాన్ని ప్రైవేటు సంస్థపాలు చేస్తోంది. జూలైలో కొన్ని బస్సులను అందుబాటులోకి తేవాలని సంబంధిత ప్రైవేటు సంస్థ యోచిస్తోంది. ఇదేం విడ్డూరం ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో బ్యాటరీ బస్సులు ఇప్పటికే తిరుగుతున్నాయి. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో కొన్ని నగరాలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, లక్నో, జైపూర్, అహ్మదాబాద్, గువాహటి తదితర నగరాలకు నిర్ధారిత మొత్తంలో సబ్సిడీ బస్సులను మంజూరు చేసింది. హైదరాబాద్‌కు మొదటి దశలో 40 బస్సులు మంజూరు చేసింది. మన దేశంలో సొంత పరిజ్ఞానంతో ఈ బస్సులు తయారు కావటంతో లేదు. చైనా, యూరప్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావటంతో ఖరీదు ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కొన్ని కంపెనీలు చైనా సాంకేతిక సహకారంతో సొంతంగా తయారు చేయటం మొదలుపెట్టాయి. కీలకమైన బ్యాటరీలను మాత్రం చైనా నుంచే కొంటున్నాయి. ఒక్కో బ్యాటరీ ధర దాదాపు రూ.90 లక్షలు ఉంటుండటంతో బస్సు ధర రూ.2.40 కోట్లు పలుకుతోంది. దీంతో ప్రోత్సాహకంగా ఒక్కో బస్సుకు కేంద్రం రూ.కోటి సబ్సిడీ ప్రకటించింది. హైదరాబాద్‌లో 40 బస్సులకు రూ.40 కోట్లు మంజూరు చేసింది. కానీ ఆర్టీసీ మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరించింది. సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున బస్సుల కొనుగోలు సాధ్యం కాదని నిర్ణయించి ఆ మొత్తాన్ని ప్రైవేటు సంస్థకు కట్టబెడుతోంది. ఆ సాయాన్ని పొందిన ప్రైవేటు సంస్థ.. బస్సులు సమకూర్చుకుని అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగించనుంది. ఇందుకు ప్రతి కిలోమీటరుకు రూ.50కి పైగా ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ బస్సులు కొన్నారు కదా.. గతంలో ఆర్టీసీ జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద ఒక్కోటి రూ.1.10 కోట్లు ఖరీదు చేసే 80 బస్సులు కొనుగోలు చేసింది. కేంద్రం ఇచ్చిన సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో సమకూరిస్తే ఈ బ్యాటరీ బస్సులు కూడా ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అప్పుడు వాటిని నడిపేందుకు ప్రైవేటు సంస్థకు అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరోవైపు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేసిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించటం సహజమే. అలా ఆర్టీసీకి కూడా పర్యావరణ ప్రోత్సాహం ప్రకటించే వీలుంది. కానీ ఈ ప్రయత్నాలేవీ జరగకుండా ప్రైవేటు సంస్థలతో కూడిన కన్సార్షియంకు బస్సుల బాధ్యత అప్పగించేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం పోను మిగతా మొత్తంపైనే అద్దెను లెక్క గడతామని, ఇది తక్కువగానే ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల నిర్వహణ అనుకూలంగా ఉంటే మరో 60 బస్సులు కొనాలని ఆర్టీసీ భావిస్తోంది. వాటికి కూడా కేంద్రాన్ని సబ్సిడీ కోరాలని భావిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో 500 వరకు బ్యాటరీ బస్సులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో కొన్ని మినీ బస్సులు ప్రవేశపెట్టి అంతర్గత రోడ్లలో నడపాలన్న ఆలోచనతో ఉంది. 40 బస్సుల విషయంలోనే చేతులెత్తేసి ప్రైవేటు సంస్థపై ఆధారపడ్డ ఆర్టీసీ.. అంతపెద్ద సంఖ్యలో బస్సులను ఎలా సమకూర్చుకుంటుందో మరి. -
భాగ్యనగరంలో బ్యాటరీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని రోడ్లపై బ్యాటరీ బస్సులు పరుగుపెట్టబోతున్నాయి. చాలా కాలంగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ప్రయ త్నం చేస్తున్నా.. వివిధ సాంకేతిక కారణాలతో ఇప్పటివరకు అది సాధ్యంకాలేదు. తాజాగా కేంద్రం చొరవతో ఎట్టకేలకు ఆ బస్సులు భాగ్య నగర రోడ్లెక్కబోతున్నాయి. మొత్తం వంద బస్సులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమో దం తెలిపింది. ఇందులో మొదట 40 బస్సులు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) గ్లోబల్ బిడ్లను ఆహ్వానించింది. ఇందులో స్వదేశీ కంపెనీలతోపాటు విదేశీ కంపెనీలు కూడా పాల్గొన్నాయి. మరో నాలుగైదు రోజుల్లో వాటిని తెరిచి ఆపరేటర్లను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 50 లక్షల వాహనాలు పరుగుపెడుతున్నాయి. ఫలితంగా కాలుష్యం తీవ్రమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే వాహన కాలు ష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గత సంవత్సరమే అన్ని ప్రధాన ఆర్టీసీలతో అవగాహన సదస్సు కూడా నిర్వహించింది. ఇటీవలే రాష్ట్ర ఆర్టీసీ ప్రయోగాత్మకంగా చైనాకు చెందిన ఓ బస్సును ఎయిర్‌పోర్టు మార్గంలో నడిపి చూసింది. తాజాగా కేంద్రం వంద బస్సులను తెలంగాణ ఆర్టీసీకి మంజూరు చేసింది. అద్దె ప్రాతిపదికపై.. ఆర్టీసీలో ప్రస్తుతం సాధారణ బస్సులు అద్దె ప్రాతిపదికపై నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్యాటరీ బస్సులు కూడా ఇదే పద్ధతిలో నడవనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకు బ్యాటరీ బస్సులను ఇవ్వనుంది. ఆసక్తి ఉన్న ఆపరేటర్లు వాటిని కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇస్తారు. వాటి నిర్వహణ భారమంతా ఆపరేటర్లే చూసుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్లను కూడా వారే ఏర్పాటు చేసుకోవాలి. కాగా, ఈ బస్సులను కేటాయించిన డిపోల్లో వాటి బ్యాటరీ చార్జింగ్ వ్యవస్థ ఏర్పాటుకు స్థలాన్ని ఆర్టీసీ కేటాయించాల్సి ఉంటుంది. ఈ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో ప్రతి కిలోమీటర్‌కు నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ ఆయా ఆపరేటర్లకు చెల్లిస్తుంది. ధర రెండున్నర కోట్లకు పైనే.. బ్యాటరీ బస్సు ధర దాదాపు రూ.రెండున్నర కోట్లకు మించి ఉంటుంది. అందులో 60 శాతం లేదా రూ.కోటి.. ఏది ఎక్కువో దాన్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. మిగతా మొత్తాన్ని ఆపరేటర్ భరించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం హైదరాబాద్‌కు 40 బస్సులు మంజూరైనందున వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెండర్ల ద్వారా త్వరలో ఆపరేటర్లను గుర్తించనున్నారు. ఆపరేటర్లకు కనీసం రూ.10 కోట్ల టర్నోవర్ ఉండాలని, బస్సు తయారీ సంస్థతో వారికి ఒప్పందం ఉండాలని నిబంధనలు విధించారు. ఆసక్తి చూపుతున్న బ్రిటన్... హైదరాబాద్‌లో బ్యాటరీ బస్సుల నిర్వహణకు బ్రిటన్ ఆసక్తి చూపుతోంది. ఆ దేశంలో తయా రైన బస్సులు అమ్మేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మరో పక్క చైనా ఓ అడుగు ముందుకేసి తమ దేశంలో తయారైన బస్సును నెలపాటు ఉచితంగా నడుపుకునేందుకు అందజేసింది. దాన్ని ఎయిర్‌పోర్టు రూట్లో నడిపి చూశారు. వందబస్సులు అవసరం ఉన్నందున ఈ డీల్‌ను చేజిక్కించుకోవాలని బ్రిటన్ తాపత్రయపడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రివ్ ఫ్లెమిం గ్ ఆర్టీసీ ఎండీ రమణారావుతో భేటీ అయ్యా రు. బ్రిటన్ హైకమిషన్‌లో పనిచేసే ఇద్దరు ప్రతినిధులతో కలసి ఆయన బస్‌భవన్ సందర్శించి బ్యాటరీ బస్సుల అంశంపై చర్చించారు. -
ఉద్యోగులు రావాల్సిందే
- సీఎం చంద్రబాబు - 27 నాటికి తాత్కాలిక సచివాలయంలో చాలా నిర్మాణాలు పూర్తవుతాయి సాక్షి, విజయవాడ, అమరావతి: ‘ఇక్కడ సౌకర్యాలు లేవని, ఉద్యోగులు హైదరాబాద్‌లోనే ఉంటామంటే కుదరదు. తొలుత కొన్ని ఇబ్బందులు తప్పవు. నేను బస్సులో ఉంటూ పరిపాలన సాగించాను. ఉద్యోగులు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి అమరావతికి రావాల్సిందే’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.గుంటూరు జిల్లా వెలగపూడిలో కొత్తగా నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఆ తర్వాత విజయవాడ ఏ-1 కన్వెన్షన్ ప్రాంగణంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల 27 నాటికి చాలా నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. తొలుత కొందరు ఉద్యోగులు, ఆ తర్వాత మిగతా వారంతా రావాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రాజధానికి అప్రోచ్ రోడ్లు వేస్తామన్నారు. రాష్ట్ర పాలనలో ఇబ్బందులు రాకూడదనే తాను సైతం బస్సుల్లో ప్రయాణిస్తున్నానన్నారు. ఇల్లు నిర్మించుకునే వారికి అన్ని సౌకర్యాలు ఏకకాలంలో ఉండవని, ఒకదాని తరువాత ఒకటి ఏర్పాటు చేసుకుంటారని చెప్పారు. ఆ దిశగానే సచివాలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ మేరకు షాపూర్జీ పల్లోంజి, ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించామన్నారు. ‘రాజధాని’ ఆర్టీసీలో ఐదు రోజుల పని విజయవాడ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే పనిదినాలుగా నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రు బస్‌స్టేషన్(పీఎన్బీఎస్)పై అంతస్తులో రూ.10 కోట్లతో నందమూరి తారక రామారావు పేరుతో నిర్మించిన ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ బస్‌భవన్ నుంచి విజయవాడకు వచ్చే సుమారు 325 మంది ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలు అమలు చేస్తామని చెప్పారు. విజయవాడ బస్‌స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో ఆధునికీకరించడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్స్టేషన్లను బస్పోర్టులుగా తీర్చిదిద్దుతామని, ఇందుకు సహకరించే దాతల పేర్లను పెట్టేందుకు అభ్యంతరం లేదన్నారు. భవిష్యత్‌లో బ్యాటరీ బస్సులు రానున్న కాలంలో కాలుష్య రహిత రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ సీఎన్జీ, కరెంటు చార్జింగ్పెట్టి బ్యాటరీతో నడిచే బస్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం ఆర్టీసీ కార్మికుల ఒక రోజు వేతనం రూ.కోటి 36 లక్షల చెక్కును ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు, ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్‌లు సీఎంకు అందించారు. అంతకు ముందు.. ఆధునికీకరించిన సిటీ బస్సు టెర్మినల్, వై్ర స్కీన్స్ సంస్థ నిర్మించిన మినీ థియేటర్లను, ఆర్టీసీ కొత్త యాప్‌లను సీఎం ప్రారంభించారు.