ఉద్యోగులు రావాల్సిందే
- సీఎం చంద్రబాబు
- 27 నాటికి తాత్కాలిక సచివాలయంలో చాలా నిర్మాణాలు పూర్తవుతాయి
సాక్షి, విజయవాడ, అమరావతి: ‘ఇక్కడ సౌకర్యాలు లేవని, ఉద్యోగులు హైదరాబాద్‌లోనే ఉంటామంటే కుదరదు. తొలుత కొన్ని ఇబ్బందులు తప్పవు. నేను బస్సులో ఉంటూ పరిపాలన సాగించాను. ఉద్యోగులు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి అమరావతికి రావాల్సిందే’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.గుంటూరు జిల్లా వెలగపూడిలో కొత్తగా నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఆ తర్వాత విజయవాడ ఏ-1 కన్వెన్షన్ ప్రాంగణంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ నెల 27 నాటికి చాలా నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు.
తొలుత కొందరు ఉద్యోగులు, ఆ తర్వాత మిగతా వారంతా రావాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రాజధానికి అప్రోచ్ రోడ్లు వేస్తామన్నారు. రాష్ట్ర పాలనలో ఇబ్బందులు రాకూడదనే తాను సైతం బస్సుల్లో ప్రయాణిస్తున్నానన్నారు. ఇల్లు నిర్మించుకునే వారికి అన్ని సౌకర్యాలు ఏకకాలంలో ఉండవని, ఒకదాని తరువాత ఒకటి ఏర్పాటు చేసుకుంటారని చెప్పారు. ఆ దిశగానే సచివాలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ మేరకు షాపూర్జీ పల్లోంజి, ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించామన్నారు.
‘రాజధాని’ ఆర్టీసీలో ఐదు రోజుల పని
విజయవాడ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే పనిదినాలుగా నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రు బస్‌స్టేషన్(పీఎన్‌బీఎస్)పై అంతస్తులో రూ.10 కోట్లతో నందమూరి తారక రామారావు పేరుతో నిర్మించిన ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ బస్‌భవన్ నుంచి విజయవాడకు వచ్చే సుమారు 325 మంది ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలు అమలు చేస్తామని చెప్పారు. విజయవాడ బస్‌స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో ఆధునికీకరించడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్‌స్టేషన్‌లను బస్‌పోర్టులుగా తీర్చిదిద్దుతామని, ఇందుకు సహకరించే దాతల పేర్లను పెట్టేందుకు అభ్యంతరం లేదన్నారు.
భవిష్యత్‌లో బ్యాటరీ బస్సులు
రానున్న కాలంలో కాలుష్య రహిత రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ సీఎన్‌జీ, కరెంటు చార్జింగ్‌పెట్టి బ్యాటరీతో నడిచే బస్సులను ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం ఆర్టీసీ కార్మికుల ఒక రోజు వేతనం రూ.కోటి 36 లక్షల చెక్కును ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, శ్రీనివాసరావు, ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్‌లు సీఎంకు అందించారు. అంతకు ముందు.. ఆధునికీకరించిన సిటీ బస్సు టెర్మినల్, వై్ర స్కీన్స్ సంస్థ నిర్మించిన మినీ థియేటర్లను, ఆర్టీసీ కొత్త యాప్‌లను సీఎం ప్రారంభించారు.