అమరావతిలో డ్రోన్‌లతో నిఘా | Surveillance with drones | Sakshi
Sakshi News home page

అమరావతిలో డ్రోన్‌లతో నిఘా

Published Thu, Jun 16 2016 8:30 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

అమరావతిలో డ్రోన్‌లతో నిఘా - Sakshi

అమరావతిలో డ్రోన్‌లతో నిఘా

- అమరావతిలో పటిష్ట భద్రత: సీఎం వెల్లడి
- తాత్కాలిక సచివాలయ పనుల్ని పరిశీలించిన బాబు

 
అమరావతి/విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తామన్నారు. అంతేగాక నాలుగు డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లనడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. తాత్కాలిక సచివాలయం నుంచి అత్యాధునిక టెక్నాలజీతో పాలన కొనసాగిస్తామని చెప్పారు. ప్రస్తుతం స్మార్ట్‌పల్స్ సర్వే చేస్తున్నట్టు, అది పూర్తై ఎటువంటి సర్టిఫికెట్లు కావాలన్నా వెంటనే పొందే అవకాశం లభిస్తుందన్నారు.

 ఉద్యోగులు తరలిరావాల్సిందే..
 ‘‘రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదు. అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతిలోని తాత్కాలిక రాజధానికి తరలిరావాల్సిందే. ఇక్కడినుంచే పాలన జరగాలి’ అని సీఎం అన్నారు. ఈనెల 27 నుంచి అమరావతి నుంచే మొత్తం పాలన సాగాలని చెబుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. అందులో భాగంగా పనులు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. 22న మరోసారి తాత్కాలిక సచివాలయ పనుల్ని పరిశీలించి యాక్షన్‌ప్లాన్ ప్రకటిస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్  వచ్చేంతవరకు అమరావతి ప్రాంతంలో ఉన్నరోడ్లనే అభివృద్ధి చేస్తామని చెప్పారు.

 వెంటనే నిధులివ్వకపోతే కష్టం :శ్రీధరన్
 విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు వెంటనే నిధులివ్వకపోతే కష్టమని రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. నిధులు విడుదల చేస్తే పనులు మొదలు పెడతామని అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని మెట్రో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో శ్రీధరన్ నిధుల సమస్యను లేవనెత్తినట్లు సమాచారం.  దీంతో సీఎం తొలి విడతగా  రూ.150 కోట్లు విడుదల చేస్తామని, భూసేకరణ చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబును ఆదేశించారు.
 

26 నుంచి చంద్రబాబు చైనా పర్యటన
 వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు హాజరు
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకూ చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని తియాన్‌జిన్ నగరంలో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొంటారు. 25వ తేదీ రాత్రి ఢిల్లీ మీదుగా చైనా వెళతారు. తిరిగి 30న విజయవాడకుచేరుకుంటారు. చైనాలో పర్యటించే బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, వ్యక్తిగత కార్యదర్శి పి. శ్రీనివాస్, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, సమాచార కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, పలు పత్రికలు, చానళ్ల ప్రతినిధులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు,  పారిశ్రామికవేత్తలు ఉన్నారు. చైనా పర్యటనలో పలువురు వ్యాపార, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement