
సాక్షి, విజయవాడ: ప్రచారార్భాటమే తప్ప.. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు అసంపూర్తిగా సాగుతున్నాయి. వరదలు సంభవించి 15 రోజులైనా రోజులైనా వరద కష్టాలు వీడటంలేదు. నిన్న రాత్రి(శనివారం) కండ్రిగ సాయిబాబానగర్‌లో మంత్రి నారాయణ పర్యటనలో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. మంత్రి నారాయణను వరద బాధితులు నిలదీశారు. తమకు కనీసం మంచినీరు కూడా అందడం లేదని మండిపడ్డారు. ఎక్కడ చెత్త అక్కడే వదిలేశారని ప్రజలు నిలదీయడంతో ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోయిన మంత్రి నారాయణ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షకు పైగా కుటుంబాలకు మానని గాయాన్ని మిగిల్చింది. బతుకులను దుర్భరంగా మార్చింది. గత నెల 31న అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరదకు సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న విజయవాడ శాంతినగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, డాబాకోట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, సింగ్‌నగర్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంబంధిత వార్త: మానని గాయం.. తీరని నష్టం
బుడమేరు వరదకు ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయాయి. కాస్త పనికొచ్చే వస్తువులను పాత సామాన్ల వాళ్లు తృణమో పణమో ఇచ్చి పట్టుకెళ్తున్నారు. అందుకూ పనికిరాని వస్తువులను బాధితులు రోడ్లపై పడేస్తున్నారు. దీంతో విజయవాడలోని వరద ప్రాంతాల్లో రోడ్ల పక్కన పాడైన ఇంటి సామాగ్రి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది.
బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్నారు. పాడైపోయిన విలువైన సామాగ్రితో వీధులన్నీ నిండిపోయాయి. డాబాలపైనే బాధితులు బతుకీడుస్తున్నారు. పేరుకున్న చెత్త, మురుగుతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎమ్మెల్యేలు, అధికారులు ఏమైపోయారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment