మళ్లీ ‘ఒక్కరోజు’ ముచ్చట
తాత్కాలిక సచివాలయానికి నేడు మరో నాలుగు శాఖలు
సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయంలో మారోమారు ఒక్కరోజు ముచ్చటకు ముహూర్తం ఖరారైంది. ఐదో భవనం మొదటి అంతస్తులో సోమవారం రోడ్లు, భవనాలు, రవాణా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది కూడా ఒక్కరోజు ముచ్చటేనని తెలుస్తోంది. గత నెల 27 నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పరిపాలన అంతా సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న ప్రాంతం లూజ్‌సాయిల్ కావడంతో నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి.
రెండో ముచ్చట..
తాత్కాలిక సచివాలయ ప్రారంభం తొలుత జూన్ 27 అనుకుని.. తర్వాత 29కి వాయిదా వేసి ఆరోజు మొక్కుబడిగా ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. నేటికీ ఏ ఒక్క భవనం పూర్తి కాలేదు. గత నెల 29న ప్రారంభించిన కార్యాలయంలోకి ఇప్పటికీ అధికారులు ఎవరూ రాలేదు. ఇటీవల తుళ్లూరులో నిర్వహించిన ప్లాట్ల కేటాయింపు సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జూలై 20 నాటికి తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని, నెలాఖరుకు అన్ని శాఖలు వెలగపూడి నుంచే పరిపాలన కొనసాగిస్తాయని గట్టిగా చెప్పారు. భవనాలు అసంపూర్తిగా ఉన్నా ప్రారంభాలతో హడావుడి చేయాలని భావించి నేడు నాలుగు శాఖలను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుత నిర్మాణాల తీరు పరిశీలిస్తే ఆగస్టు చివరకు కూడా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే విషయాన్ని తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ స్పష్టం చేశారు.