వెలగపూడిలో కమాండ్ కంట్రోల్ కేంద్రం!
సీఎం కార్యాలయానికి సమీపంలోనే ఏర్పాటు: సీఎం
సాక్షి, అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు పక్కాగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణం గురించి సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఒకటో బ్లాకు మొదటి అంతస్తులో తన కార్యాలయానికి సమీపంలోనే కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు.
అసెంబ్లీ భవనాన్ని సచివాలయంలోని మిగిలిన ఐదు భవనాల నుంచి విడదీసే ప్రణాళికపై చర్చించి సూచనలు చేశారు. అసెంబ్లీ చుట్టూ ఎత్తై ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. సచివాలయం కంటే అసెంబ్లీ భవనం ప్రత్యేకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఆర్‌డీఏ అధికారులు తయారు చేసిన ప్రణాళికను ఆమోదించారు. రాజధాని గ్రామాల్లో ప్లాట్ల పంపిణీపైనా చర్చించారు. ఈ నెల 21న శాఖమూరులో చేసే ప్లాట్ల కేటాయింపు గురించి అధికారులు ఆయనకు వివరించారు.
డ్రోన్లతో రియల్‌టైమ్ గవర్నెన్స్ : రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా రియల్‌టైమ్ గవర్నెన్స్ కింద డ్రోన్‌లు, సర్వైలెన్సు కెమేరాల పర్యవేక్షణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆదివారం ఫైబర్ నెట్‌వర్క్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో డ్రోన్‌ల వినియోగం గురించి ఆయన చర్చించారు. గృహ నిర్మాణాలు, కాలువల నిర్వహణతోపాటు అన్ని రంగాల్లోనూ డ్రోన్‌లు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.