అబ్బే.. కార్యాలయం బాగాలేదు
- సచివాలయంలోని తన ఆఫీసుపై చంద్రబాబు అసంతృప్తి
- మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ /అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏ మాత్రం బాగా లేదు... నాణ్యత అసలే లేదు.. ఈ మాటలన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. ఆయన బుధవారం తాత్కాలిక సచివాలయంలో ప్రవేశించారు. తన కార్యాలయంలోకి వెళ్లిన తరువాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌పై తీవ్రస్థారుులో మండిపడ్డారు. ఇదేనా ఇన్ని రోజులు ఇక్కడ కూర్చుని మీరు ఏర్పాటు చేసిన కార్యాలయం? అని నిలదీశారు. హైదరాబాద్ సచివాలయంలోని ‘డి’ బ్లాకును ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిందని, అక్కడ బాగా నిర్మించిన ఆ సంస్థ వెలగపూడిలో కార్యాలయ భవనాన్ని సొంతంగా నిర్మించిందా? లేక సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చారా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో అధికారులు కంగుతిన్నారు. నిర్మాణంలో నాణ్యత కూడా లేదని చంద్రబాబు పెదవి విరిచారు.
సచివాలయ ప్రవేశం నా రెండో మజిలీ
ఉద్యోగుల త్యాగాలు వృథాగా పోవని, వారి ఇబ్బందులను తొలగించి తోడుగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తనదని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులదని అన్నారు. వెలగపూడి సచివాలయంలో ప్రవేశం తన రెండో మజిలీ అని తెలిపారు. ఈరోజు కొత్త శకం ప్రారంభమైందన్నారు. బుధవారం ఉదయం సచివాలయానికి చేరుకున్న బాబుకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణతోపాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు.
అమరావతిలో ‘మెట్రో’ రహదారులు
మెట్రో నగరాలకు దీటుగా రాజధాని అమరావతిలో అంతర, బాహ్య, ప్రాంతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు కమిటీలు
పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలను చక్కదిద్దేందుకు రాష్ట్రం నుంచి మండల స్థారుు వరకూ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.పదివేలు ఒకేసారి చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లను కోరుతున్నట్లు చెప్పారు. ఒకేసారి వీలుకాని పక్షంలో గ్రామీణ ప్రాంతాల్లో రెండు, మూడు రోజుల్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఒకేసారి రూ.పదివేలు చెల్లించేలా బ్యాంకర్లు ప్రయత్నం చేయాలని ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు సంబంధిత బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బ్యాంకులకు రాసిన లేఖలో సూచించారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలపై చంద్రబాబు బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్‌స నిర్వహించారు. సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.