
సీఎం పింఛన్లు పంపిణీ చేయనున్న ప్రదేశంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న శశిభూషణ్‌కుమార్, ఎస్.నాగలక్ష్మి తదితరులు
ఉ.6గంటలకు ప్రారంభించకపోతే క్రమశిక్షణ చర్యలు
సచివాలయాల సిబ్బందికి ఉన్నతాధికారుల హెచ్చరిక
నేడు పెనుమాకలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటివద్దే పింఛన్ల పంపిణీని చేపడుతున్నందున ఉన్నతాధికారుల ఆదేశాలతో పలు జిల్లాల్లో సచివాలయాల సిబ్బంది ఆదివారం రాత్రి తాము పనిచేసే సచివాలయంలోనే బస చేశారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ పింఛన్ల పంపిణీ కోసం సిబ్బంది అంతా సచివాలయానికి హాజరై ఏర్పాట్లుచేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సోమవారం ఉ.6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు మొదలుపెట్టాల్సిన నేపథ్యంలో సిబ్బంది అంతా ఆదివారం రాత్రి సచివాలయం పరిధిలోనే బసచేయాలని పలుచోట్ల జిల్లాల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారని.. దీంతో అత్యధిక శాతం మంది సచివాలయాల్లోనే బసచేశారని ఉద్యోగ ప్రతినిధులు తెలిపారు.
ఉ.6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించని వారిపై క్రమశిక్షణ చర్యలు చేపడతామని కూడా హెచ్చరించారని వారన్నారు. కాగా, ఒకటో తేదీనే దాదాపు వీలైనంత ఎక్కువమందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో చాలా జిల్లాల్లో ఉన్నతాధికారులు సచివాలయాల వారీగా గంట గంటకు పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ డీఎల్‌డీఓలు, డీపీఓలను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు.
పంపిణీకి 30వేల మంది సిబ్బంది..
ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పంపిణీ చేసే పింఛన్ల కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ అన్నారు. తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జూలై 1న ఉ.6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పింఛన్ల పంపిణీకి దాదాపు 30 వేల మంది ప్రభుత్వోద్యోగులను నియమించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment