పంట కుంటలతో కరవును అధిగమించొచ్చు
‘నీరు–ప్రగతి’ టెలికాన్ఫరెన్స్‌లో సీఎం
సాక్షి, అమరావతి: పంట కుంటల ద్వారా కరవు పరిస్థితులను అధిగమించవచ్చునని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పూర్తయిన 3.41 లక్షల పంట కుంటలను గురువారం జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో గురువారం ‘నీరు–ప్రగతి’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నీటి సంఘాల ప్రతినిధులు, అధికారులతో బుధవారం సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. రాష్ట్రంలో మరో 6.59 లక్షల పంట కుంటలను ఏర్పాటు చేస్తే కరవు పరిస్థితులను పూర్తిగా అధిగమించవచ్చునని సీఎం చెప్పారు.
కాగా రాజధాని పరిపాలనా నగరంలో ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలూ ఒకేచోట ఉండేలా భవనాల నిర్మాణం ఉండాలని చంద్రబాబు సూచించారు. బుధవారం వెలగపూడి లో సీఆర్‌డీఏ అధికారుల సమావేశంలో రాజధాని అంశాలపై చర్చించారు. రాజధాని లో ఇప్పటికే గుర్తించిన ఏడు ద్వీపాలను స్వాధీనం చేసుకుని అక్కడ చేపట్టే అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఏడు ద్వీపాలతోపాటు ఎనిమిదో ద్వీపాన్ని గుర్తించామని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ చెప్పగా దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.