ఆర్టీసీ ‘బ్యాటరీ’ డౌన్‌! | Subsidy to Battery buses | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ‘బ్యాటరీ’ డౌన్‌!

Published Sat, Jun 30 2018 2:10 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Subsidy to Battery buses  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాటరీ బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ఆర్టీసీ వినియోగించుకోలేక ప్రైవేటు సంస్థ చేతుల్లో పెట్టేస్తోంది. పర్యావరణానికి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పెద్ద నగరాల్లో వీలైనన్ని బ్యాటరీ బస్సులను రోడ్ల మీదకు తేవటం ద్వారా సాధారణ బస్సుల నుంచి వెలువడే పొగను తగ్గించాలని కేంద్రం భావించింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌ నగరానికి తొలి విడతలో 40 ఎలక్ట్రిక్‌ బస్సులను కొనేందుకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున సబ్సిడీ ప్రకటించింది. ఆ మొత్తాన్ని ఆర్టీసీకి కేటాయిస్తోంది. కానీ దాన్ని వినియోగించుకోలేక చేతులెత్తేసిన ఆర్టీసీ.. ఆ మొత్తాన్ని ప్రైవేటు సంస్థపాలు చేస్తోంది. జూలైలో కొన్ని బస్సులను అందుబాటులోకి తేవాలని సంబంధిత ప్రైవేటు సంస్థ యోచిస్తోంది. 

ఇదేం విడ్డూరం 
ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో బ్యాటరీ బస్సులు ఇప్పటికే తిరుగుతున్నాయి. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో కొన్ని నగరాలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, లక్నో, జైపూర్, అహ్మదాబాద్, గువాహటి తదితర నగరాలకు నిర్ధారిత మొత్తంలో సబ్సిడీ బస్సులను మంజూరు చేసింది. హైదరాబాద్‌కు మొదటి దశలో 40 బస్సులు మంజూరు చేసింది. మన దేశంలో సొంత పరిజ్ఞానంతో ఈ బస్సులు తయారు కావటంతో లేదు. చైనా, యూరప్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావటంతో ఖరీదు ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కొన్ని కంపెనీలు చైనా సాంకేతిక సహకారంతో సొంతంగా తయారు చేయటం మొదలుపెట్టాయి.

కీలకమైన బ్యాటరీలను మాత్రం చైనా నుంచే కొంటున్నాయి. ఒక్కో బ్యాటరీ ధర దాదాపు రూ.90 లక్షలు ఉంటుండటంతో బస్సు ధర రూ.2.40 కోట్లు పలుకుతోంది. దీంతో ప్రోత్సాహకంగా ఒక్కో బస్సుకు కేంద్రం రూ.కోటి సబ్సిడీ ప్రకటించింది. హైదరాబాద్‌లో 40 బస్సులకు రూ.40 కోట్లు మంజూరు చేసింది. కానీ ఆర్టీసీ మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరించింది. సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున బస్సుల కొనుగోలు సాధ్యం కాదని నిర్ణయించి ఆ మొత్తాన్ని ప్రైవేటు సంస్థకు కట్టబెడుతోంది. ఆ సాయాన్ని పొందిన ప్రైవేటు సంస్థ.. బస్సులు సమకూర్చుకుని అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగించనుంది. ఇందుకు ప్రతి కిలోమీటరుకు రూ.50కి పైగా ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. 

ఆ బస్సులు కొన్నారు కదా.. 
గతంలో ఆర్టీసీ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద ఒక్కోటి రూ.1.10 కోట్లు ఖరీదు చేసే 80 బస్సులు కొనుగోలు చేసింది. కేంద్రం ఇచ్చిన సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో సమకూరిస్తే ఈ బ్యాటరీ బస్సులు కూడా ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అప్పుడు వాటిని నడిపేందుకు ప్రైవేటు సంస్థకు అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరోవైపు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేసిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించటం సహజమే. అలా ఆర్టీసీకి కూడా పర్యావరణ ప్రోత్సాహం ప్రకటించే వీలుంది. కానీ ఈ ప్రయత్నాలేవీ జరగకుండా ప్రైవేటు సంస్థలతో కూడిన కన్సార్షియంకు బస్సుల బాధ్యత అప్పగించేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం పోను మిగతా మొత్తంపైనే అద్దెను లెక్క గడతామని, ఇది తక్కువగానే ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఈ బస్సుల నిర్వహణ అనుకూలంగా ఉంటే మరో 60 బస్సులు కొనాలని ఆర్టీసీ భావిస్తోంది. వాటికి కూడా కేంద్రాన్ని సబ్సిడీ కోరాలని భావిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో 500 వరకు బ్యాటరీ బస్సులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో కొన్ని మినీ బస్సులు ప్రవేశపెట్టి అంతర్గత రోడ్లలో నడపాలన్న ఆలోచనతో ఉంది. 40 బస్సుల విషయంలోనే చేతులెత్తేసి ప్రైవేటు సంస్థపై ఆధారపడ్డ ఆర్టీసీ.. అంతపెద్ద సంఖ్యలో బస్సులను ఎలా సమకూర్చుకుంటుందో మరి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement