వాల్తేరు డిపో ఆవరణలో ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ కటౌట్లు
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ మిత్రపక్షాలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డడంతో గురువారం నాటి ఎన్నికలు పోటాపోటీగా జరగనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి : ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో గురువారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాత్రికి ఫలితాలు వెల్లడించనున్నారు. విశాఖలోని వాల్తేరు, మద్దిలపాలెం, గాజువాక, కూర్మన్నపాలెం, సింహాచలం, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం, మధురవాడ, విశాఖరూరల్ డిపోలతో పాటుగా రీజనల్ మేనేజర్ కార్యాలయంలోను పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేశారు.
ముమ్మరంగా ప్రచారం : ఎన్‌ఎంయూ, ఈయూ, మిత్రపక్షాలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ప్రచారం మంగళవారంతో ముగిసింది. ప్రతిష్ట కోసం ఎన్‌ఎంయూ, పరువు కోసం ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎన్నికలలో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎంయూ అధికారంలో ఉండడం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్‌కు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, కార్మిక పరిషత్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వంటి యూనియన్లు మద్దతు ప్రకటించాయి. దీంతో ఈ ఏడాది ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా యూనియన్ల రాష్ట్ర స్థాయి నాయకులు అన్ని డిపోల్లో ముమ్మరంగా ప్రచారం చేసి వెళ్లారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, ఆర్‌ఎం కార్యాలయ సిబ్బంది, ఆర్టీసీ డిస్పెన్సరీ సిబ్బంది ఈ ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కార్మికశాఖ అన్ని చర్యలు చేపట్టింది. తెల్లవారుజామునే కార్మికశాఖ సిబ్బంది పోలింగ్‌బూత్‌లకు చేరుకోనున్నారు. కాగా, గురువారం సెలవులో వుండే ఆర్టీసీ సిబ్బందికి ఆయా యూనియన్లు డిపోలో పనులు పురమాయించారు.
హామీల వర్షం : ఈ సారి ఆర్టీసీ ఎన్నికలలో మునుపెన్నడూ లేని రీతిలో యూనియన్లు పోటాపోటీగా హామీల వర్షం కుíరిపించడం విశేషం. పదేళ్లపాటు ట్యాక్స్ హాలీడే, మహిళా కండక్టర్లు రాత్రివేళ త్వరగా డ్యూటీ దిగేలా చర్యలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడం, అద్దె బస్సులకు మంగళం పాడడం, అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై చర్యలు, గూడ్స్ రవాణా, మెరుగైన వేతన ఒప్పందం, కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ చేయడం, డిపో స్పేర్‌విధానం రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై యూనియన్లు హామీలు గుప్పించాయి.
సందడిగా డిపోలు : నగర, గ్రామీణ జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల్లో సందడి నెలకొంది. డిపోల ఆవరణలో ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ కటౌట్లు, స్వాగతద్వారాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆయా యూనియన్ల ఆఫీసులు కొద్దిరోజులుగా సందడిగా కనిపిస్తున్నాయి. రాత్రి పొద్దుపోయే దాకా ఎన్నికల సరళిపై డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులు విశ్లేషించుకుంటున్నారు. ఆర్టీసీ సిబ్బది డ్యూటీ దిగిపోయాక సంబంధిత యూనియన్ కార్యాలయాల బాట పడుతున్నారు. ఇక బస్సుల్లో కూడా ఆర్టీసీ సిబ్బంది ఎన్నికల గురించే చర్చించుకోవడం విశేషం.
పకడ్బందీగా ఏర్పాట్లు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి అన్ని ఏర్పాట్లూ చేశామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుధేష్‌కుమార్ తెలిపారు. సింహాచలం ఆర్టీసీ గ్యారేజీ డిపోలో పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లను బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఇక్కడ ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించారో డిపో మేనేజర్ సీహెచ్ దివ్యను ఆరా తీశారు. విశాఖలో 4,478 మంది కార్మికులు ఓటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. ఎక్కడి డిపోలో కార్మికులు అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పది డిపోలతో పాటు రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద నాన్ ఆపరేషన్ యూనిట్‌కు బూత్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాడేరు పర్యటన నేపథ్యంలో బస్‌లు ఆ దిశగా పంపిస్తున్న తరుణంలో డ్రైవర్లు, కండక్టర్లు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రణాళిక చేశామన్నారు. ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఆరు వరకూ ఓటింగ్ జరుపుతామని వివరించారు. ఈ నెల 13, 14 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment