సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల జనాభా దాటిన పట్టణాలకు కేంద్ర పథకం కింద కేటాయించిన అధునాతన బస్సులు వెనక్కు వెళ్లే ప్రమాదం నెల కొంది. కేంద్రం విధించిన షరతుకు ఆర్టీసీ అభ్యంతరం తెలపటంతో రాష్ట్రానికి వెయ్యి బస్సులు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది!
ప్రత్యేక రవాణా విభాగం నెలకొల్పితేనే..
జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం(జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద జనాభా సంఖ్య పది లక్షలు దాటిన పట్టణాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 10 వేల బస్సులు అందజేస్తున్నారు. దీనికి సంబంధించి సవివర నివేదికలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం కోరింది. బస్సులు కొనుగోలు వ్యయంలో 35 నుంచి 80 శాతం వరకు గ్రాంట్ల రూపంలో కేంద్రం నిధులు సమకూర్చనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి దాదాపు వెయ్యి బస్సులు వస్తాయని భావించినా కేంద్రం విధించిన నిబంధనతో అవి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు.
నగరాలకు బస్సులు ఇవ్వాలంటే స్థానిక సంస్థ(నగర పాలక సంస్థ)తో ప్రత్యేక రవాణా విభాగాన్ని నెలకొల్పాలని కేంద్ర ం మెలిక పెట్టడమే దీనికి కారణం. స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్‌పీవీ) ఏర్పాటు చేసి బస్ డిపోలు, వర్క్‌షాప్ ప్రాంతాలను బదలాయించాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల రవాణా వ్యవస్థను ఆర్టీసీ నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ఎస్‌పీవీ ఏర్పాటు చేస్తే నగరాల్లో తమ ఆదాయానికి భారీగా గండి పడుతుందని ఆర్టీసీ ఆందోళన చెందుతోంది. దీంతో ఎస్‌పీవీ ఏర్పాటుకు ససేమిరా అంటోంది. ఎస్‌పీవీ అంటే ఆర్టీసీ అధికారులే కాకుండా మునిసిపల్, ట్రాఫిక్ తదితర విభాగాల అధికారులూ సభ్యులుగా ఉంటారు. ఆదాయం, వ్యయం, నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీతో సంబంధం లేకుండా ఎస్‌పీవీ పర్యవేక్షిస్తుంది. జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద గతంలో హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ నగరాలకు బస్సులు అందించిన విషయం విదితమే.
నిధుల వాటా ఇలా..
జనాభా 40 లక్షలు దాటిన నగరాల్లో స్టాండర్డ్ బస్సుల కొనుగోలుకు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ 35 శాతం నిధులు సమకూరిస్తే 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 50 శాతం నిధులను బ్యాంకుల నుంచి ఎస్‌పీవీ సమీకరించుకోవాలి. ప్రీమియం బస్సులు(లో ఫ్లోర్ లగ్జరీ) అయితే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 10 శాతం ఖర్చు భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. పది లక్షల నుంచి 40 లక్షల లోపు జనాభా ఉంటే మునిసిపల్ కార్పొరేషన్లలో స్టాండర్డ్ టైపు బస్సులకు కేంద్రం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, ఎస్‌పీవీ 30 శాతం నిధులు అందచేయాలి. లగ్జరి బస్సులకైతే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 10 శాతం భరించాలని కేంద్ర తెలిపింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ) బస్సుల కొనుగోలుకు అనుమతించి ప్రతిపాదనలు పంపితే కేంద్ర మంజూరు, నిర్వహణ కమిటీ ఆమోదించాక నిధులు విడుదలవుతాయి. ఎస్‌పీవీ నిబంధన కచ్చితంగా పాటించినట్లు లిఖితపూర్వకంగా పేర్కొంటేనే నిధులు మంజూరు అవుతాయని కేంద్రపట్టణాభివృద్ధి సంస్థ స్పష్టం చేసింది.
వెయ్యి బస్సులు వెనక్కే!
Published Mon, Sep 2 2013 2:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement