కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు | 40 percent increase passengers with effect of Mahalakshmi scheme | Sakshi
Sakshi News home page

కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు

Published Mon, Dec 18 2023 2:30 AM | Last Updated on Mon, Dec 18 2023 2:30 AM

40 percent increase passengers with effect of Mahalakshmi scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదనంగా ప్రయాణిసున్న వారిలో 90 శాతం మహిళలే అన్నది సుస్పష్టం. ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు రూ.4.50 కోట్లు పెరిగినట్టు లె క్కలు చెబుతున్నాయి. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సు (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌)ల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నందున టికెట్‌ రూపంలో నేరుగా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంది త ప్ప పెరగదు.

కానీ ఈ పథకంతో ఆర్టీసీ కోల్పోయే ఆదాయా న్ని ప్రభుత్వం రీయింబర్స్‌ చేయనున్నందున ఆ రూపంలో అదనపు ఆదాయం వచ్చి పడుతుంది. గతంలో సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం రూ.13–14 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, ఇప్పుడది రూ.18.25 కోట్లకు చేరుతోంది. గతంలో సాధారణ రోజుల్లో (సోమవారం కాకుండా) నిత్యం బస్సుల్లో 25–30 లక్షల మధ్య ప్రయాణించేవారు. ఇప్పుడది 43 లక్షలు దాటుతోంది. వెరసి.. ఈ పథకం ప్రారంభమయ్యాక 40 శాతం ప్రయాణికులు పెరిగనట్టు గుర్తించారు.  

జీరో టికెట్‌ జారీతో తేలిన లెక్క 
సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తే, సోమవారాల్లో ఆ సంఖ్య 34 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభమయ్యాక, గత సోమవారం 51 లక్షల మంది ప్రయాణించినట్టు అధికారులు లెక్కలేశారు. అయితే, ఆరోజు వరకు మహిళలకు టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. టికెట్లు జారీ చేస్తే, ఎంతమంది మహిళలు బస్సులెక్కారో కచ్చితంగా తెలుస్తుంది. మూడు రోజుల క్రితం జీరో టికెట్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు.

మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారో ఆ టికెట్ల జారీతో తేలుతుంది. దానికి ఎంత చార్జీ చెల్లించాల్సి ఉంటుందో కూడా అందులో స్పష్టమవుతుంది. ఆర్టీసీ ఆ లెక్కలను ప్రతినెలా ప్రభుత్వానికి అందిస్తుంది. దాని ఆధారంగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. ఇప్పుడు జీరో టికెట్ల జారీ ప్రకారం 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 43,12,033 మంది ప్రయాణించినట్లు తేలింది. వీరి ద్వారా రూ.1,826.49 కోట్ల ఆదాయం సమకూరింది (ప్రభుత్వం రీయింబర్స్‌ చేసే మొత్తంతో కలిపి).  

నాలుగువేల బస్సులు పాతవే... 
మహిళల సంఖ్య భారీగా పెరిగినందున బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. చాలా బస్సుల్లో మూడొంతుల స్థలంలో మహిళలే ఉంటున్నారు. దీంతో పురుషులు కొందరు స్థలం లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అదుపుతప్పకుండా ఉండాలంటే కనీసం 2,500 కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేశారు. ప్రస్తుతం 40 శాతం రద్దీ పెరిగినా, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న బస్సులతోనే నెట్టుకొస్తున్నారు.

అయితే, ఆర్టీసీలో దాదాపు 4 వేల బస్సులు బాగా పాతబడి ఉన్నాయి. ఈ బస్సుల్లో రద్దీ పెరిగితే అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలు చోటుచేసుకునే వరకు ఎదురుచూడకుండా కొత్త బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. గతంలో ఆర్డర్‌ ఇచ్చిన బస్సులు కొన్ని త్వరలో సమకూరే అవకాశం ఉంది. కానీ అవి సరిపోవు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కొత్త బస్సులు కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement