సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా 100 శాతానికిపైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. ‘మహాలక్ష్మి’పథకంతో ఉచిత ప్రయాణం నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
ఈ పథకం విజయవంతంగా నడుస్తున్నా.. మరోవైపు ఇదే తీవ్ర ఆందోళనకూ కారణమవుతోంది. ఇప్పుడున్న ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు పాతబడ్డాయి. కొన్ని అయితే డొక్కుగా మారాయి. అలాంటి బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి నడిస్తే ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు బస్సుల్లోని సీట్లలో చాలా వరకు మహిళలతో నిండిపోతుండటంతో.. పురుషులకు సీట్లు దొరక్క ప్రైవేటు వాహనాల వైపు మొగ్గుతున్నారన్నదీ ఆందోళన రేపుతోంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే.. ఈ రెండు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ ఎన్ని బస్సులు కొందాం, ఏ కేటగిరీలో ఎన్ని ఉండాలన్న ప్రతిపాదనలు, సమావేశాలకే సర్కారు పరిమితం అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
అదనంగా 10లక్షల మంది..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా తొలుత ‘మహాలక్ష్మి’పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న దీన్ని పట్టాలెక్కించారు. ఈ పథకం విజయవంతంగా నడుస్తోంది. బస్సుల్లో నిత్యం 10 లక్షల మందికిపైగా అదనంగా ప్రయాణిస్తున్నారు. గతంలో 66శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 90శాతం దాటింది. ప్రత్యేక రోజుల్లో 101 శాతానికీ చేరుతోంది.
ఉచిత ప్రయాణానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం రీయింబర్స్ చేసే నేపథ్యంలో ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ.10 కోట్ల మేర పెరిగింది. ఈ నెల 17, 18 తేదీల్లో ఏకంగా రూ.22.50 కోట్ల చొప్పున ఆదాయం నమోదైంది. అయితే పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు లేక ఇబ్బందులు వస్తున్నాయి. కర్ణాటకలో ఇదే తరహాలో పథకాన్ని ప్రారంభించినప్పుడు బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
మన ఆర్టీసీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించినప్పుడు ఈ అంశం కూడా వారి దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన కొత్త బస్సులు సిద్ధం చేసుకుని పథకాన్ని ప్రారంభించి ఉండాల్సిందని.. అలా చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నాలుగు వేల బస్సులు అవసరం
ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఈ కేటగిరీలకు సంబంధించి 7,292 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్పేర్‌లో ఉంచే బస్సులను కూడా వాడేస్తున్నారు. ఇప్పుడున్న రద్దీని నియంత్రించాలంటే కనీసం నాలుగు వేల అదనపు బస్సులు అవసరమని అంచనా. ఇటీవల వచ్చిన కొత్త బస్సులు 50 మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో వెయ్యి బస్సులకు ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది.
మరో వెయ్యి ఎలకిŠట్రక్ బస్సులు కొనేందుకు ఏర్పాట్లు చేసింది. అవి అందేందుకు కొన్ని నెలలు పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు అవసరం. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేవు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే, లేదా ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు తీసుకుంటేనే కొనుగోళ్లు సాధ్యం. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment