సాక్షి, హైదరాబాద్: కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని పదికోట్లమంది మహిళలు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. డిసెంబరు ఏడో తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకోగా, అదే నెల తొమ్మిదే తేదీన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచి తంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.
సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని దీన్ని ఆ రోజు ప్రారంభించినట్టు స్వయంగా సీఎం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇది కూడా ఒకటి. రెండు కేటగిరీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ ద్వారా, బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను గుర్తిస్తున్నారు. సోమవారం నాటికి జారీ అయిన జీరో టికెట్ల సంఖ్య 10 కోట్లను దాటింది.
రూ.550 కోట్ల మేర ఆదా
పది కోట్ల జీరో టికెట్ల రూపంలో మహిళా ప్రయాణికులకు రూ.550 కోట్ల మేర ఆదా అయినట్టు తెలిసింది. అంతమేర ఆదాయం ఆర్టీసీ కోల్పోయినందున, ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య సగటున నిత్యం 10 లక్షల కంటే ఎక్కువ మేర పెరిగింది.
కానీ, ఆ తాకిడిని తట్టుకునే సంఖ్యలో ఆర్టీసీ వద్ద బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. కొత్త బస్సులు కొంటున్నామని ఆర్టీసీ చెబుతున్నా, కొన్ని నామమాత్రంగానే వచ్చాయి. ఇప్పటికిప్పుడు కనీసం 4 వేల బస్సులు అవసరమన్న అభిప్రాయాన్ని ఆర్టీసీనే వ్యక్తం చేస్తోంది. కానీ, వాటిని కొనేందుకు అవసరమైన నిధులు సంస్థ వద్ద లేనందున, ప్రభుత్వమే సాయం చేయాల్సి ఉంది.
సరిపోను బస్సులు లేక జనం పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నా, ఈ పథకం విజయవంతమైందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయోత్సవం తరహాలో ఓ కార్య క్రమం నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. 10 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్టు తేలగానే కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. వీలైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
బకాయిల చెల్లింపు ప్రకటనకు అవకాశం
దీర్ఘకాలంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు. దీనిపై కార్మికుల నుంచి ఒత్తిడి వస్తోంది. రెండు వేతన సవరణలు, అంతకుముందు వేతన సవరణ తాలూకు బాండ్ల మొత్తం బకాయి ఉంది. సీసీఎస్, పీఫ్ బకాయిలూ ఉన్నాయి. దీంతో సమ్మక్క–సారలమ్మ జాతరలోపు ఏదో ఒక బకాయి చెల్లింపుపై ప్రకటన చేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది.
బాండ్ల మొత్తం, పీఎఫ్ బకాయిల చెల్లింపుపై ప్రకటన చేసే అవకాశముంది. ఉద్యోగులు వేతన సవరణపై ఒత్తిడి తెస్తున్నా, అది ఖజానాపై పెద్ద భారమే మోపేలా ఉన్నందున దాని విషయంలో ఆచితూచి నిర్ణయించాలని భావిస్తున్నారు. సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
రూ.1,040 కోట్లతో కొత్త బస్సులు
గత ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ 1,050 బస్సులకు టెండర్లు పిలిచింది. అవి దశలవారీగా సమకూరాల్సి ఉంది. మరో వేయి ఎలక్ట్రిక్ బస్సులు కూడా రావాల్సి ఉంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్న పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్య వెంటనే పెంచాల్సి ఉన్న విషయాన్ని ఆర్టీసీ తాజాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మంగళవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయి బడ్జెట్ పద్దులపై చర్చించారు. ఈ సందర్భంగా 2 వేల బస్సులు కొనేందుకు రూ.1,040 కోట్లు కేటాయించాలని కోరినట్టు తెలిసింది. దీనికి భట్టివిక్రమార్క సానుకూలంగా స్పందించారు. అయితే, ఆర్టీసీ అంతర్గత ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింత కసరత్తు చేయాలని, మెట్రో రైలు తరహాలో దీనిపై దృష్టి సారించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment