తమ డిమాండ్లను పట్టించుకోకుంటే ఉద్యమిస్తామంటూ కార్మికసంఘాల అల్టిమేటం
మరోసారి ఉమ్మడి జేఏసీ రూపంలో నిరసనలకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ప్రధాన సంఘాలకు నాయకత్వం వహించిన నేతల్లో ఎక్కువమంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉన్నా, ప్రస్తుతం వారు కూడా ఇతర సంఘాల తరహాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ అంటూ లేదు. కొన్ని సంఘాలు కలిపి ఒక కమిటీగా, మరికొన్ని సంఘాలు కలిపి ఒక సంఘంగా పనిచేస్తున్నాయి.
ఈ రెండు జేఏసీలతో సంబంధం లేకుండా కొన్ని సంఘాల ప్రతినిధులు సొంతంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కారి్మకుల సమస్యల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం స్పందించని నేపథ్యంలో అన్ని సంఘాలు కలిపి ఒక జేఏసీగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమయ్యేలా చేస్తామంటూ కొన్ని సంఘాలు చెబుతున్నాయి.
కార్మిక సంఘాల గుర్తింపే ప్రధాన లక్ష్యం
గత ప్రభుత్వం ఆర్టీసీలో కార్మిక సంఘాల ఉనికి లేకుండా చేసింది. వాటి స్థానంలో డిపోల్లో ఉద్యోగుల ఆధ్వర్యంలో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేసి ఆయా అంశాలు మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత అప్పగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది.
దీంతో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. కార్మిక సంఘాలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటంతో ఇటీవల ఓ సంఘం సీఎంకు సీఐటీయూ ప్రతినిధుల ద్వారా వినతిపత్రం ఇప్పించాల్సి వచి్చంది.
కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంతోపాటు వారికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంతో సంబంధం లేని 11 అంశాలను ముందుగా పరిష్కరించాలి. ప్ర భుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతో సంబంధం ఉన్న మరి కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. ఆయా అంశాలపై తీసు కునే నిర్ణయాల్లో కార్మిక సంఘాలను భాగస్వాములను చేయాలి. – వీఎస్‌రావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి
ఇవీ డిమాండ్లు..
» ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన అంశాన్ని పరిశీలిస్తున్నామంటూ ప్రకటించటం మినహా ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలులోకి తేలేదు. ఫలితంగా ఆర్టీసీ ఉద్యోగులు.. ఆర్టీసీ ఉద్యోగులుగానే ఉండిపోవాల్సి వచ్చింది. దీన్ని ప్రధాన డిమాండ్‌గా కొన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.
» సరిపోను డ్రైవర్లు లేక ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీనివల్ల వారు తీవ్ర ఒత్తిడి ని ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారిస్తూ అన్ని రకాల పోస్టుల్లో ఖాళీలు భర్తీ చేయాలన్న డి మాండ్‌ను అన్ని సంఘాలు పేర్కొంటున్నాయి.
» సాంకేతిక సమస్యలతో జరిగే పొరపాట్లు, చి న్నచిన్న తప్పిదాలకు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, వెంటనే వారికి ఉద్యో గ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
» 2021 వేతన సవరణ జరపాలని, 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, చనిపోయిన, మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చి వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకోవాలని, ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య తగ్గించి, అవసరమైన సంఖ్యలో బస్సులను సొంతంగా సమకూర్చుకోవాలని, మహిళా ఉద్యోగులను రాత్రి 8 తర్వాత పని చేయించవద్దని, రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలని... ఇలా పలు అంశాలను ప్రభుత్వం ముందుంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment