Lok Sabha Election 2024: ఖాతా తెరిస్తే రూ.లక్ష! | Lok Sabha Election 2024: Hopeful Of INDIA Bloc Win, Women Open Accounts For Mahalakshmi Scheme | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఖాతా తెరిస్తే రూ.లక్ష!

Published Fri, May 31 2024 4:30 AM | Last Updated on Fri, May 31 2024 4:30 AM

Lok Sabha Election 2024: Hopeful Of INDIA Bloc Win, Women Open Accounts For Mahalakshmi Scheme

బెంగళూరు జనరల్‌ పోస్టాఫీస్‌కు 

పోటెత్తుతున్న మహిళలు 

కాంగ్రెస్‌ ‘మహాలక్షి్మ’ హామీయే కారణం 

అది బెంగళూరులోని జనరల్‌ పోస్టాఫీస్‌. సాధారణంగా ఓ మోస్తరు రద్దీయే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా జనం ఇసుకేస్తే రాలనంతగా వస్తున్నారు! ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతా తెరిచేందుకు చాంతాడంత క్యూలు కడుతున్నారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది సంగతేమిటని ఆరా తీస్తే, కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకొస్తే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష అందిస్తామన్న హామీ ప్రభావమని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8,500 జమ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ గాంధీ హామీ ఇవ్వడం తెలిసిందే.

 దాంతో కేంద్రంలో ఇండియా కూటమి వస్తే తమకు ప్రయోజనం దక్కుతుందని భావించిన స్థానికులు బెంగళూరు జనరల్‌ పోస్టాఫీస్‌ వద్ద బారులు తీరుతున్నారు. తాను పొద్దున ఎప్పుడో వచ్చానని క్యూలో నిల్చున్న ఓ మహిళ చెప్పడం గమనార్హం. ఖాతా తెరిచిన తొలి రోజు నుంచే డబ్బులు జమవుతాయని పొరుగింటావిడ చెప్పడంతో వచ్చానని మరో మహిళ వెల్లడించింది. శివాజీనగర్, చామరాజపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇలా వస్తున్నారు! 

నిజం కాదు... 
తపాలా శాఖ ఒక్కో ఖాతాలో రూ.2,000 నుంచి రూ.8,500 వరకు జమ చేస్తుందన్న నమ్మకంతో ఎక్కువ మంది ఖాతా తెరిచేందుకు వస్తున్నట్టు బెంగళూరు జీపీవో చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ హెచ్‌ఎం మంజేశ్‌ చెప్పారు. ‘‘నిజానికి ఇదో వదంతి. తపాలా శాఖ ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. కాకపోతే ఆన్‌లైన్‌ నగదు బదిలీ ప్రయోజనానికి ఈ ఖాతా ఉపకరిస్తుంది’’ అని వెల్లడించారు. 

పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతా తెరిచేందుకు రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో, అందులో వెంటనే డబ్బులు జమవడం మొదలవుతుందన్న వార్తలు వదంతులేనంటూ కార్యాలయం ఆవరణలో పోస్టర్లు కూడా అంటించారు. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీంతో చేసేది లేక అదనపు కౌంటర్లు తెరిచారు. గతంలో రోజుకు కనాకష్టంగా 50 నుంచి 60 కొత్త ఖాతాలే తెరిచేవారు. ఇప్పుడు రోజుకు కనీసం 1,000 ఖాతాలకు పైగా తెరుస్తున్నట్టు మంజేశ్‌ తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకొస్తే ప్రతి నెలా రూ.8,500 ఖాతాలో జమ చేస్తామని స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చెప్పడమే ఈ రద్దీకి కారణమని అక్కడి సిబ్బంది అంటున్నారు! 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement