general post office
-
Lok Sabha Election 2024: ఖాతా తెరిస్తే రూ.లక్ష!
అది బెంగళూరులోని జనరల్ పోస్టాఫీస్. సాధారణంగా ఓ మోస్తరు రద్దీయే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా జనం ఇసుకేస్తే రాలనంతగా వస్తున్నారు! ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు చాంతాడంత క్యూలు కడుతున్నారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది సంగతేమిటని ఆరా తీస్తే, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకొస్తే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష అందిస్తామన్న హామీ ప్రభావమని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8,500 జమ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం తెలిసిందే. దాంతో కేంద్రంలో ఇండియా కూటమి వస్తే తమకు ప్రయోజనం దక్కుతుందని భావించిన స్థానికులు బెంగళూరు జనరల్ పోస్టాఫీస్ వద్ద బారులు తీరుతున్నారు. తాను పొద్దున ఎప్పుడో వచ్చానని క్యూలో నిల్చున్న ఓ మహిళ చెప్పడం గమనార్హం. ఖాతా తెరిచిన తొలి రోజు నుంచే డబ్బులు జమవుతాయని పొరుగింటావిడ చెప్పడంతో వచ్చానని మరో మహిళ వెల్లడించింది. శివాజీనగర్, చామరాజపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇలా వస్తున్నారు! నిజం కాదు... తపాలా శాఖ ఒక్కో ఖాతాలో రూ.2,000 నుంచి రూ.8,500 వరకు జమ చేస్తుందన్న నమ్మకంతో ఎక్కువ మంది ఖాతా తెరిచేందుకు వస్తున్నట్టు బెంగళూరు జీపీవో చీఫ్ పోస్ట్‌మాస్టర్ హెచ్ఎం మంజేశ్ చెప్పారు. ‘‘నిజానికి ఇదో వదంతి. తపాలా శాఖ ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. కాకపోతే ఆన్లైన్ నగదు బదిలీ ప్రయోజనానికి ఈ ఖాతా ఉపకరిస్తుంది’’ అని వెల్లడించారు. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో, అందులో వెంటనే డబ్బులు జమవడం మొదలవుతుందన్న వార్తలు వదంతులేనంటూ కార్యాలయం ఆవరణలో పోస్టర్లు కూడా అంటించారు. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీంతో చేసేది లేక అదనపు కౌంటర్లు తెరిచారు. గతంలో రోజుకు కనాకష్టంగా 50 నుంచి 60 కొత్త ఖాతాలే తెరిచేవారు. ఇప్పుడు రోజుకు కనీసం 1,000 ఖాతాలకు పైగా తెరుస్తున్నట్టు మంజేశ్ తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకొస్తే ప్రతి నెలా రూ.8,500 ఖాతాలో జమ చేస్తామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడమే ఈ రద్దీకి కారణమని అక్కడి సిబ్బంది అంటున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
'నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్'
లక్నో: తన జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వృద్ధ టైప్ రైటర్ కిషన్ కుమార్ తనను వదిలేయండి మహా ప్రభో అని వేడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండనీయండని, తన పని తనను చేసుకోనివ్వండంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నారు. లక్నో జనరల్ పోస్టాపీస్ ముందు ఓ పాత టైప్ రైటింగ్ మిషన్‌తో పనిచేసుకుంటూ కిషన్ కుమార్ బతుకీడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత వారం ఓ ఎస్సై ఆయనను ఆ ప్రదేశం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడమే కాకుండా.. అతడిపై దాడికి దిగి టైప్ రైటర్‌ను ధ్వంసం చేశాడు. ఈ ఫొటోలు, వీడియో సామాజిక అనుసంధాన వేదికల్లో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆ పెద్దాయనపై సానూభూతి పెల్లుబుకింది. ఎస్సైని సస్పెండ్ చేశారు. ఆయనకు కొత్త టైప్ రైటర్ కొనివ్వడమే కాకుండా లక్ష రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆయనకు బెదిరింపులు రావడంతో పోలీసులే ఎస్కార్ట్‌గా రోజు ఆయన ఇంటికి వెళ్లడం పనిచేసుకునే ప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తున్నారు. అయితే, ప్రశాంతంగా ఏ ఆందోళన లేకుండా 35 ఏళ్లుగా కొనసాగుతున్న తన జీవితంలో జరిగిన ఈ ఘటనతోనే ఆయన కలవరపడుతుండగా తాజాగా ఆయనకు కొత్త సమస్య వచ్చిపడింది. ఆయన పనిచేసే ప్రాంతానికి పలువురు వెళ్లి సానూభూతితో పలకరిస్తుండటంతోపాటు ఇంటర్వ్యూల పేరిట మీడియా వస్తుంటడంతో ఆయనకు ప్రశాంతంగా పనిచేసుకునే అవకాశం కరువైంది. దీంతో ఆయన నేరుగా' నా చుట్టూ ఇంతమంది ఉంటుంటే నేనేం పనిచేయలేకపోతున్నాను. గత రెండు రోజులుగా ఒక్క రూపాయి కూడా సంపాదన లేదు. ఇలాగే జరిగితే నాకుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. ఇక్కడికి నేను పనిచేసుకునేందుకు వస్తున్నాను. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కాదు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ పక్క నాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండగా.. సహాయం చేస్తామని బ్యాంకు ఖాతా వివరాలు చెప్పండంటూ కూడా మరికొన్ని ఫోన్లు వస్తున్నాయి. కానీ నాకు ఇప్పటి వరకు ఎవ్వరి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు' అని కుమార్ చెప్పారు.