'నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్'
లక్నో: తన జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్కు చెందిన వృద్ధ టైప్ రైటర్ కిషన్ కుమార్ తనను వదిలేయండి మహా ప్రభో అని వేడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండనీయండని, తన పని తనను చేసుకోనివ్వండంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నారు. లక్నో జనరల్ పోస్టాపీస్ ముందు ఓ పాత టైప్ రైటింగ్ మిషన్తో పనిచేసుకుంటూ కిషన్ కుమార్ బతుకీడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, గత వారం ఓ ఎస్సై ఆయనను ఆ ప్రదేశం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పడమే కాకుండా.. అతడిపై దాడికి దిగి టైప్ రైటర్ను ధ్వంసం చేశాడు.
ఈ ఫొటోలు, వీడియో సామాజిక అనుసంధాన వేదికల్లో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆ పెద్దాయనపై సానూభూతి పెల్లుబుకింది. ఎస్సైని సస్పెండ్ చేశారు. ఆయనకు కొత్త టైప్ రైటర్ కొనివ్వడమే కాకుండా లక్ష రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆయనకు బెదిరింపులు రావడంతో పోలీసులే ఎస్కార్ట్గా రోజు ఆయన ఇంటికి వెళ్లడం పనిచేసుకునే ప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తున్నారు. అయితే, ప్రశాంతంగా ఏ ఆందోళన లేకుండా 35 ఏళ్లుగా కొనసాగుతున్న తన జీవితంలో జరిగిన ఈ ఘటనతోనే ఆయన కలవరపడుతుండగా తాజాగా ఆయనకు కొత్త సమస్య వచ్చిపడింది. ఆయన పనిచేసే ప్రాంతానికి పలువురు వెళ్లి సానూభూతితో పలకరిస్తుండటంతోపాటు ఇంటర్వ్యూల పేరిట మీడియా వస్తుంటడంతో ఆయనకు ప్రశాంతంగా పనిచేసుకునే అవకాశం కరువైంది.
దీంతో ఆయన నేరుగా' నా చుట్టూ ఇంతమంది ఉంటుంటే నేనేం పనిచేయలేకపోతున్నాను. గత రెండు రోజులుగా ఒక్క రూపాయి కూడా సంపాదన లేదు. ఇలాగే జరిగితే నాకుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. ఇక్కడికి నేను పనిచేసుకునేందుకు వస్తున్నాను. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కాదు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ పక్క నాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండగా.. సహాయం చేస్తామని బ్యాంకు ఖాతా వివరాలు చెప్పండంటూ కూడా మరికొన్ని ఫోన్లు వస్తున్నాయి. కానీ నాకు ఇప్పటి వరకు ఎవ్వరి నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు' అని కుమార్ చెప్పారు.