
సత్తా ఉంటేనే కాలేజీలకు గుర్తింపు
బిల్డింగులు కాదు.. ఫ్యాకల్టీ ఉండాలి
మెరుగైన నైపుణ్యమే గీటురాయి
ఈ దిశగా సాంకేతిక విద్యకు మెరుగులు
‘సాక్షి’తో జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి. కిషన్‌కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విసురుతున్న సవాళ్లకు అనుగుణంగా సాంకేతిక విద్యలో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ హెచ్) నూతన వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ టి.కిషన్‌కుమార్‌రెడ్డి అన్నారు. వీసీగా తన లక్ష్యం కూడా అదేనని చెప్పారు. మంగళ వారం వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
పూర్తిగా సాంకేతిక వర్సిటీ కావడం వల్ల జేఎన్టీయూహెచ్ బాధ్యతలు కత్తిమీద సాములాంటివేనని పేర్కొ న్నారు. తమ వర్సిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు కాలే జీల్లోనూ నాణ్యత పెంచడంపై దృష్టి పెడతామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గబోమని స్పష్టంచేశారు. నిబంధనల ప్రకా రం కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు ఉంటేనే గుర్తింపు ఇస్తామని తెలిపారు. కోర్ గ్రూ పుల తగ్గింపు క్షేమకరం కాదని అభిప్రాయపడ్డారు. సీఎస్‌ఈ వైపే విద్యార్థులను పరుగులు పెట్టించడం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు.
భవనాలు కాదు.. బోధకులు ముఖ్యం
ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులవైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని కిషన్‌కుమార్‌రెడ్డి తెలిపా రు. అయితే, నాణ్యమైన ఫ్యాకల్టీ కొరత ఉందని చెప్పారు. ‘అందమైన భవనాలుంటేనే మంచి విద్య వస్తుందనే భ్రమలు తొలగాలి. బోధకుల ప్రమాణా లేంటో పరిశీలిస్తాం. అనుబంధ గుర్తింపు ఇచ్చేట ప్పుడు అన్ని కోణాల్లోనూ పరిశీలన చేస్తాం. విద్యా ర్థులకు మెరుగైన ప్రమాణాలతో విద్యను అందించే దిశగానే కాలేజీలు ఉండాలి.
త్వరలోనే ఈ విషయంపై వర్సిటీ అధికారులతో సమీక్షిస్తా. నాణ్యత పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. వర్సిటీ లోని అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసుకుని నైపుణ్యంతో కూడిన విద్యను అందించే ప్రయత్నం చేస్తాం’ అని తెలిపారు.
ఉద్యోగానికి నైపుణ్యమే కీలకం
విద్యార్థికి ఉద్యోగం సంపాదించే నైపుణ్యాలు నేర్పటమే కీలకమని కిషన్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘ఉద్యోగాల ట్రెండ్ మారింది. ఏఐ వచ్చాక ఉద్యోగం రావడం కష్టంగా మారింది. ఇప్పుడు కంప్యూటర్‌తో పరుగులు పెట్టే నైపుణ్యం అవసరం. ఇంజనీరింగ్‌లో ఎన్ని మార్కులొచ్చాయని కంపెనీలు చూడటం లేదు. ఏమేర నైపుణ్యం ఉందనే విషయాన్ని పరిగణనలోనికి తీసుకుంటున్నాయి.
ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. జేఎన్టీయూహెచ్ పరిధిలోనూ నైపుణ్యాలు అభివృద్ధి చేస్తాం. పుస్తకాల పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. అన్ని ప్రైవేటు కాలేజీలు ఈ దిశగా అడుగులు వేయడానికి కృషి చేస్తాం’ అని వెల్లడించారు.
జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ కిషన్‌కుమార్ రెడ్డి
గవర్నర్ ఉత్తర్వులు.. వెంటనే బాధ్యతల స్వీకరణ
మెదక్ జిల్లాలో పుట్టి జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన టీకే రెడ్డి
గతంలో దీన్‌దయాళ్ పెట్రోలియం వర్సిటీ వీసీగా సేవలు
సాక్షి, హైదరాబాద్: జవ హర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యా లయం (జేఎన్టీయూ) వైస్ చాన్స్ లర్ (వీసీ)గా ప్రొఫెసర్ టీ కిషన్‌కుమా ర్‌రెడ్డిని నియమిస్తూ మంగళ వారం గవర్నర్ ఉత్తర్వు లు జారీచేశారు. ఆ వెంటనే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. గత ఏడాది మే నెలలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వీసీల గడువు ముగియటంతో సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేక పాలనాధికారులుగా ప్రభుత్వం నియమించింది. అనంతరం గత ఏడాది అక్టోబర్‌లో పలు వర్సిటీలకు ప్రభుత్వం వీసీలను నియమించింది.
జేఎన్టీయూహెచ్‌కు కూడా సెర్చ్ కమిటీని వేసినప్పటికీ సాంకేతిక సమస్యలతో వీసీ నియామకం ఆపివేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. గత నెలలో సెర్చ్ కమిటీ తిరిగి సమావేశమై ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వారిలో నుంచి కిషన్‌కుమార్‌రెడ్డిని వీసీగా గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఎంపిక చేశారు.
సిద్దిపేట నుంచి జేఎన్టీయూహెచ్ వీసీ దాకా
ప్రొఫెసర్ టీకే రెడ్డి సిద్దిపేట జిల్లా అల్లీపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గురవారెడ్డి కుమారుడు. పాఠశాల చదువు హైదరాబాద్ సెయింట్ పాల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో సాగింది. నారాయణగూడలోని న్యూసైన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో 1973–78లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. 1981–87లో అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీలో థర్మల్ ఫ్లూయిడ్ సైన్స్‌పై పీహెచ్‌డీ చేశారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేశారు. పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. అనేక జాతీయ అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment