India Post Payment Bank
-
Lok Sabha Election 2024: ఖాతా తెరిస్తే రూ.లక్ష!
అది బెంగళూరులోని జనరల్ పోస్టాఫీస్. సాధారణంగా ఓ మోస్తరు రద్దీయే ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా జనం ఇసుకేస్తే రాలనంతగా వస్తున్నారు! ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు చాంతాడంత క్యూలు కడుతున్నారు. ఆశ్చర్యపోయిన సిబ్బంది సంగతేమిటని ఆరా తీస్తే, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకొస్తే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష అందిస్తామన్న హామీ ప్రభావమని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.8,500 జమ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం తెలిసిందే. దాంతో కేంద్రంలో ఇండియా కూటమి వస్తే తమకు ప్రయోజనం దక్కుతుందని భావించిన స్థానికులు బెంగళూరు జనరల్ పోస్టాఫీస్ వద్ద బారులు తీరుతున్నారు. తాను పొద్దున ఎప్పుడో వచ్చానని క్యూలో నిల్చున్న ఓ మహిళ చెప్పడం గమనార్హం. ఖాతా తెరిచిన తొలి రోజు నుంచే డబ్బులు జమవుతాయని పొరుగింటావిడ చెప్పడంతో వచ్చానని మరో మహిళ వెల్లడించింది. శివాజీనగర్, చామరాజపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇలా వస్తున్నారు! నిజం కాదు... తపాలా శాఖ ఒక్కో ఖాతాలో రూ.2,000 నుంచి రూ.8,500 వరకు జమ చేస్తుందన్న నమ్మకంతో ఎక్కువ మంది ఖాతా తెరిచేందుకు వస్తున్నట్టు బెంగళూరు జీపీవో చీఫ్ పోస్ట్‌మాస్టర్ హెచ్ఎం మంజేశ్ చెప్పారు. ‘‘నిజానికి ఇదో వదంతి. తపాలా శాఖ ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. కాకపోతే ఆన్లైన్ నగదు బదిలీ ప్రయోజనానికి ఈ ఖాతా ఉపకరిస్తుంది’’ అని వెల్లడించారు. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో, అందులో వెంటనే డబ్బులు జమవడం మొదలవుతుందన్న వార్తలు వదంతులేనంటూ కార్యాలయం ఆవరణలో పోస్టర్లు కూడా అంటించారు. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దీంతో చేసేది లేక అదనపు కౌంటర్లు తెరిచారు. గతంలో రోజుకు కనాకష్టంగా 50 నుంచి 60 కొత్త ఖాతాలే తెరిచేవారు. ఇప్పుడు రోజుకు కనీసం 1,000 ఖాతాలకు పైగా తెరుస్తున్నట్టు మంజేశ్ తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకొస్తే ప్రతి నెలా రూ.8,500 ఖాతాలో జమ చేస్తామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పడమే ఈ రద్దీకి కారణమని అక్కడి సిబ్బంది అంటున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐపీపీబీ ఖాతాదారులకు బజాజ్ అలియాంజ్ బీమా
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాదారులకు బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఇండియాపోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు ప్రత్యేకం. చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా రక్షణ పొందొచ్చని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది. పాలసీదారు మరణించిన సందర్భంలో తక్షణమే పరిహారంతోపాటు, 5, 7, 10 ఏళ్లపాటు కుటుంబ అవసరాలకు నెలవారీ చెల్లించే సదుపాయాలు ఇందులో ఉన్నట్టు పేర్కొంది. -
వాట్సాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలను ప్రారంభించింది. ఇందుకోసం భారతీ ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపింది. పలు బ్యాంకు సర్వీసులతోపాటు ఇంటి వద్ద సేవల కోసం వినతి, సమీపంలోని పోస్ట్ ఆఫీస్ శాఖ ఎక్కడ ఉంది వంటివి వాట్సాప్ ద్వారా ఖాతాదారులు తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌నకు 4.51 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. లైవ్ ఇంటెరాక్టివ్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్‌ను సైతం వాట్సాప్‌లో పరిచయం చేయనున్నారు. -
వెహికల్ లోన్ కోసం చూస్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే!
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ (Mahindra Finance) సర్వీస్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో (IPPB) భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఇకపై మహీంద్రా కస్టమర్లకు లోన్లు ఈజీగా అందుబాటులో రానున్నాయి. వీరివురు భాగస్వామ్యంతో ఇకపై.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్యాసింజర్ వాహనాలు, త్రీ-వీలర్, ట్రాక్టర్ , వ్యాపార వాహనాల లోన్ కేటగిరీల కోసం మహీంద్రా ఫైనాన్స్‌కు లీడ్ రిఫరల్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే ఉన్న మహీంద్రా ఫైనాన్స్ కస్టమర్లకు పోస్టాఫీసులలో నగదు ఈఎంఐ( EMI )డిపాజిట్ సౌకర్యాన్ని కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను మొదటగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌లలో అందించనున్నారు. రాబోయే నాలుగు-ఆరు నెలల్లో ఇతర రాష్ట్రాలలో విస్తరించాలని భావిస్తున్నారు. దీంతో, పేమెంట్స్ బ్యాంక్ కూడా తన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది. చదవండి: జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా: ఆ ప్లాన్లతో రీచార్జ్, ఈ బెనిఫిట్స్ అన్నీ మీకే! -
ఇంటింటికీ ఆధార్ సేవలు!
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పోస్టమెన్‌ను వినియోగించుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఇండియాపోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు చెందిన 48 వేల మంది పోస్ట్మెన్ను రంగంలోకి దించనుంది. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి చిన్నారుల పేర్లు నమోదు చేసుకోవడం, ఆధార్‌తో సెల్‌ఫోన్ నంబర్లను లింక్ చేయడం, వివరాలను అప్డేట్ చేయడం వంటి సేవలు అందించనున్నారు. రెండో దశ ప్రణాళికలో భాగంగా 1.50లక్షల మంది తపాలా శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వాములను చేయనుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల వారితోపాటు, సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులకు ఆధార్‌ను అందజేయడమే యూఐడీఏఐ లక్ష్యమన్నారు. ఇంటింటికీ వెళ్లే పోస్ట్‌మెన్ ఆధార్ వివరాలను అక్కడికక్కడే అప్డేట్ చేసేందుకు వీలుగా ట్యాబ్లెట్ పీసీ/ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని తెలిపారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 13వేల మంది కామన్ సర్వీస్ సెంటర్ల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఇందులో భాగంగా చేస్తామన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా 755 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి రోజూ ఆన్లైన్ ద్వారా కనీసం 50వేల మంది చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలను అప్డేట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికీ 12 అంకెల బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య ఆధార్‌ను అందించేందుకు యూఐడీఏఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు చేదువార్త. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న విత్ డ్రా, డిపాజిట్ సేవలకు జనవరి 1, 2022 నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు అందించే ఉచిత లావాదేవీల పరిమితిని అధిగమించిన తర్వాత ప్రత్యేకమైన ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఐపీపీబీ తెలిపింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ప్రతి నెల ఉచితంగా 4 లావాదేవీలు చేయవచ్చు, ఆ తర్వాత ప్రతి విత్ డ్రా లావాదేవీకి దాని విలువలో 0.50%(కనీసం రూ.25) ఛార్జీల రూపంలో వసూలు చేయనుంది. ఈ ఖాతాదారులకు క్యాష్ డిపాజిట్ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కాకుండా ఇతర పొదుపు ఖాతాదారులు, కరెంట్ ఖాతాదారులు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకునే మొత్తంలో 0.50 శాతం (కనీసం రూ.25) వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఈ ఖాతాదారులు రూ.10వేల వరకు క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేల మొత్తానికి పైగా డిపాజిట్ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది. గతంలో కూడా ఉచితంగా అందిస్తున్న డోర్ స్టెప్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తుంది. 01 ఆగస్టు 2021 నుంచి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు ఛార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. (చదవండి: మోదీ ప్రభుత్వం భారీ స్కెచ్..! వచ్చే మూడేళ్లలో..!) -
చౌక వడ్డీకే ఐపీపీబీ గృహ రుణాలు.. ఎంతంటే?
డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్)తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) తన 4.5 కోట్ల మంది ఖాతాదారులకు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందించనున్నట్లు ప్రకటించింది. వేతన జీవులకు రూ.50 లక్షల వరకు అందించే గృహ రుణాలపై వడ్డీ రేటు 6.66 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది అని ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్, ఐపీపీబీ పేర్కొన్నాయి. (చదవండి: దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్) దేశ వ్యాప్తంగా 650 బ్రాంచీలు, 136,000కు పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్లతో విస్తృతమైన నెట్ వర్క్ కలిగి ఉన్నట్లు ఐపీపీబీ తెలిపింది. ఐపీపీబీ, ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ గృహ రుణాలు పాన్-ఇండియా మొత్తం అందుబాటులో ఉంటాయి. అవగాహనపూర్వక ఒప్పందం(ఎమ్ఒయు)లో భాగంగా.. అన్ని గృహ రుణాల కోసం క్రెడిట్ అండర్ రైటింగ్, ప్రాసెసింగ్ బాధ్యతలు చేపట్టే ఐపీపీబీ చేత ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ నిర్వహిస్తుంది. ఐపీపీబీ తన ఆన్ గ్రౌండ్ వర్క్ ఫోర్స్ 200,000 పోస్టల్ ఉద్యోగులు(పోస్ట్ మెన్, గ్రామీణ్ డక్ సేవకులు) ద్వారా మైక్రో ఎటిఎమ్, బయోమెట్రిక్ సేవాలు, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ అందిస్తుంది. ఈ విస్తృతమైన నెట్ వర్క్ ద్వారా విభిన్న ప్రజలకు ఎల్ఐసీ హౌసింగ్ రుణాలను చేరడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది అని ఐపీపీబీ తెలిపింది. -
ఐపీపీబీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు చేదువార్త. ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఛార్జీలతో పాటు పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను కూడా ఐపీపీబీ సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జులై 1 నుంచి వర్తిస్తాయి. వడ్డీ రేట్లు ఖాతా బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్ష రూపాయల వరకు బ్యాలెన్స్ ఉంటే 2.75 శాతం అందిస్తుండగా, ఇక 2021 జూలై 1 నుంచి ఏడాదికి 2.5 శాతం అందించనున్నారు. అలాగే, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఖాతాదారులకు లభిస్తుంది. పోస్టాఫీస్ ఖాతాదారులు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మనీ ట్రాన్స్ఫర్ సర్వీసుల కోసం, ఇతర ఆర్థిక సేవలను ఇప్పుడు ఐపీపీబీ యాప్ ద్వారానే పొందవచ్చు. ఈ సేవల కోసం పోస్టాఫీస్ బ్రాంచుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. -
పోస్టల్ బ్యాంక్ నుంచి ‘డాక్‌పే’ యాప్
సాక్షి, అమరావతి: మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి దేశంలో ఎక్కడికైనా తక్షణం నగదు పంపిణీ చేసే సౌకర్యాన్ని తపాలా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ‘డాక్‌పే’ పేరుతో మొబైల్ డిజిటల్ పేమెంట్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. డాక్‌పే యాప్ ద్వారా అన్ని బ్యాంకు అకౌంట్లను అనుసంధానం చేసుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చని ఐపీపీబీ తెలిపింది. నగదు బదిలీ, చెల్లింపులతో పాటు పోస్టల్ శాఖ అందిస్తున్న వివిధ సేవింగ్స్ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. డాక్‌పే యాప్ అందిస్తున్న సేవలు యూపీఐ: ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు సురక్షితంగా, వేగంగా నగదు బదిలీ. వీడీసీ: రూపే డెబిట్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లకు డిజిటల్ విధానంలో చెల్లింపులు చేయొచ్చు. డీఎంటీ: దేశంలో ఎక్కడి బ్యాంకు ఖాతాకైనా తక్షణం నగదు బదిలీ చేసుకోవచ్చు. ఏపీఎస్: ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసుల్లో భాగంగా ఇంటి వద్దనే వేలి ముద్ర వేయడం ద్వారా బ్యాంకు సేవలు పొందవచ్చు. బిల్ చెల్లింపులు : దేశ వ్యాప్తంగా 470కిపైగా వ్యాపార సంస్థలకు నగదు రహిత లావాదేవీలు చేయొచ్చు. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. పోస్టల్ పథకాలు: తపాల శాఖ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, సుకన్య సంవృద్ధి ఖాతా వంటి వివిధ ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చు. -
వేలి ముద్రతో నగదు డ్రా
రామకృష్ణ అత్యవసర పని మీద అనంతపురం జిల్లాలోని ఇప్పేరు గ్రామానికి వెళ్లాడు. ఆన్లైన్ చెల్లింపులకు అలవాటు పడిన అతను అత్యవసరంగా అక్కడ రూ.8,000 నగదు చెల్లించాల్సి వచ్చింది. ఆ ఊళ్లో బ్యాంకు, ఏటీఎం లేదు. కనీసం 20 కి.మీ దూరం వెళ్తేకానీ ఏటీఎం సెంటర్ లేదు. ఏం చేయాలో పాలుపోక బిజినెస్ వ్యవహారాలపై అవగాహన ఉన్న తన స్నేహితునికి ఫోన్ చేశాడు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్తే రూ.10 వేల వరకు నగదు తీసుకోవచ్చని అతను సలహా ఇచ్చాడు. నమ్మకం కలగనప్పటికీ, ప్రయత్నిద్దామని పక్కనే ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి పోస్టుమాస్టర్‌కు తన పరిస్థితి వివరించాడు. అతను రామకృష్ణ వేలిముద్రలు తీసుకొని వెంటనే రూ.10 వేలు ఇచ్చాడు. ఆ వెంటనే తన ఎస్బీఐ ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయాడు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోస్ట్‌మ్యాన్ మన ఇంటి వద్దకే వచ్చి నగదు డిపాజిట్, విత్‌డ్రా, మనీ ట్రాన్స్ఫర్ వంటి సేవలను అందిస్తున్నారు. విద్యుత్, గ్యాస్, వాటర్ బిల్లు తదితర చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలన్నీ పోస్టాఫీసు వద్దకు వెళ్లి ఉచితంగా పొందవచ్చు. పోస్ట్‌మ్యాన్ ఇంటి వద్దకు వచ్చి ఈ సేవలు అందిస్తే క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్స్‌కు రూ.25, ఇతర సేవలకు రూ.15 చొప్పున సర్వీస్ చార్జి వసూలు చేస్తారు. రాష్ట్రంలో 10,489 పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సాక్షి, అమరావతి: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గత ఏడాది అధునాతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 15 రోజుల క్రితం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో పనిలేకుండా నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి వేలిముద్ర వేయడం ద్వారా నగదు తీసుకునే సౌకర్యం కల్పించింది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా నుంచి ఈ విధానంలో నగదు తీసుకోవచ్చు. ఖాతాదారునికి నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉంటే, ఆధార్ డేటాబేస్‌లో చివరిసారి ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా కొన్ని బ్యాంకులు రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, మరికొన్ని బ్యాంకులు రూ.5 వేలు తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖాతాల పెంపుపై దృష్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కొద్ది రోజులుగా ఖాతాల పెంపుపై దృష్టి సారించారు. ఈ ఖాతాల్లో గరిష్టంగా రూ.లక్షకు మించి దాచుకోవడానికి వీలుండదు. అందుకని వీటిని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రూ.లక్షకు మించి ఉన్న నగదు నేరుగా సేవింగ్స్ ఖాతాలోకి వెళ్తుంది. (రూ.లక్షకు మించి డిపాజిట్ చేయాలంటే సేవింగ్స్ ఖాతా తప్పనిసరి) అవసరమైనప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న బ్యాంకింగ్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రామ్ భరోసా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన, అతి తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాలతో పాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల పథకాలు, సేవలను పోస్టాఫీసుల్లో అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 59 పోస్టల్ ఏటీఎంలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొదటి స్థానంలో ఏపీ సర్కిల్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించడంలో ఏపీ సర్కిల్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10.33 లక్షల ఖాతాలతో రూ.21.59 కోట్ల డిపాజిట్లను సేకరించింది. గత ఏడు నెలల్లోనే 6.91 లక్షల ఖాతాలను ప్రారంభించాం. ఈ ఏడాది మొత్తం ఖాతాల సంఖ్యను 30 లక్షలకు చేర్చాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క. – జి.ప్రశాంతి, సీనియర్ మేనేజర్, పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, విజయవాడ డివిజన్. -
పోస్టల్ బ్యాంకును ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా అవతరించనున్న పోస్టల్ పేమెంట్ బ్యాంకును ఈ రోజు(శనివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్ చేసారు. దేశంలోని సుదూర ప్రాంతాలకు వేగంగా బ్యాంకింగ్ సేవలకు తీసుకెళ్లు ప్రణాళికలో భాగంగా ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) ప్రధానం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ పోస్ట్ మ్యాన్లు విస్తృతమైన సేవలందించారంటూ ప్రధాని ప్రశంసించారు. ఇప్పటివరకూ ఉత్తరాలు, పార్సిళ్లను వారు చేరవేశారు...ఇపుడిక పోస్ట్మాన్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు వినియోగదారుల ముంగిటకు వచ్చేశాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోస్ట్మెన్లు ఇంటి వద్దే పోస్టల్ బ్యాంకింగ్ సేవల లభించనున్నాయి. ఇండియా పోస్ట్ దీంతో ప్రభుత్వ రంగ సంస్థ ఐపీపీబీ నుంచి పొదుపు ఖాతాలు, కరెంట్ ఖాతాలు, నగదు బదిలీలు, ప్రత్యక్ష నగదు బదిలీ, బిల్లు, యుటిలిటీ చెల్లింపులు, వ్యాపార చెల్లింపులు వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా 650 శాఖలు, 3250 యాక్సెస్ పాయింట్లలో ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింక్ ఫైనాన్షియల్ సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని 1.55 పోస్టాఫీసు శాఖలను ఐపిపిబితో అనుసంధానం డిసెంబర్ 31 నాటికి పూర్తికానుంది. కాగా ప్రభుత్వ సంస్థ అయిన భారత తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. జనవరి 2017లో పైలట్ ప్రాజెక్టు క్రింద కొన్ని బ్రాంచీల్లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా సెప్టెంబర్ 1న లాంచ్ అయింది. -
నేటి నుంచి ఐపీపీబీ
సుజాతనగర్ : తపాలా శాఖ సేవలు నేటి నుంచి మరింతగా అందుబాటులోకి రానున్నాయి. ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింక్ సేవలను తీసుకెళ్లేలా ప్రభుత్వం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)కి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా 650 బ్రాంచీల్లో ఐపీపీబీని ఒకేసారి ప్రారంభించనున్నారు. పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్న ప్రధాన పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, బ్రాంచి పోస్టాఫీస్‌ల ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్మన్లు ఈ సేవలు అందించనున్నారు. పోస్టాఫీస్‌కు వెళ్లలేని వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, పని ఒత్తిడి ఉండేవారికి ఈ సేవలు మరింతగా ఉపయోగపడనున్నాయి. వేలిముద్ర ద్వారా లావాదేవీలు పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచిన వారు వేలిముద్రల ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఇందుకుగాను పోస్టాఫీస్‌లో జీరో అకౌంట్ తెరిచేందుకు సెప్టెంబర్ 10 వరకు గడువు ఇచ్చారు. తమ ఆధార్, మొబైల్ నంబర్లను ఇచ్చి ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. ఖాతా ప్రారంభించగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. లావాదేవీల అనంతరం వెంటనే సెల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఇందు లో సేవింగ్స్ ఖాతా(ఎస్బీ) తెరిచేవారు రూ.100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ ఖాతా తెరవాలనుకున్నవారు రూ.1000 డిపాజిట్ చేయాలి. సేవింగ్స్ ఖాతాలో రూ.ఒక లక్ష వరకు డిపాజిట్ చేసుకునే సౌకర్యం ఉంది. అంతకంటే ఎక్కువగా డిపాజిట్ చేయాలనుకునేవారు దీనికి అనుబం ధంగా మరో ఖాతాను తెరవాల్సిఉంటుంది. సేవలు ఇలా.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఖాతాదారులు అనేక రకాల సేవలు ఇంటివద్దనుంచే పొందే వీలుంది. తమఖాతా నుంచి నగదును తీసుకోవాలంటే కేటాయించిన నంబర్‌కు ఫోన్ చేసి ఎంత కావాలో చెపితే ఆ మొత్తాన్ని ఇంటికే తీసుకొస్తారు. సంబందిత పరికరం సహాయంతో వేలిముద్ర ద్వారా ఖాతా నుంచి నగదును చెల్తిస్తారు. గరిష్టంగా రూ.20 వేల వరకు ఇంటి వద్దకే తీసుకొస్తారు. అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే వారు పోస్టాఫీస్‌కు వెళ్ళాల్సిందే. ఖాతాదారులకు ఇచ్చే క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కార్డు స్కాన్ చేయడం ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఖాతాదారులు విద్యుత్, ఫోన్, తదితర బిల్లులు చెల్లింపులు చేసుకోవచ్చు. నెఫ్ట్, ఆర్‌టీజీఐ, ఐఎంపీఎస్ వంటి చెల్లింపులు చేయవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కూడా అవకాశం ఉంది. ఎస్ఎంస్, మిస్డ్‌కాల్ బ్యాంకింగ్ సేవలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రాయితీలు, పథకాల చెల్లింపులు, విద్యార్ధులకు చెల్లించే స్కాలర్షిప్లు కూడా ఈ ఖాతాల ద్వారా జరిపే అవకాశాలు ఉన్నాయి. చిరువ్యాపారులు, కిరాణ వర్తకులు, రైతులు క్యూఆర్ కార్డు ద్వారా నగదు రహిత సేవలను పొందవచ్చు. ప్రయాణంలో నగదు భద్రతపై ఎలాంటి దిగులు ఉండదు. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు క్యూఆర్ కార్డును వినియోగించవచ్చు. రుణాలూ పొందవచ్చు. రెండో దశలో అవకాశం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సదుపాయం మొదటి దశలో ఖమ్మం టౌన్ పరిధిలోని 11 సబ్ పోస్టాఫీస్‌లు, ఒక హెడ్ ఆఫీస్, 02 బ్రాంచ్ ఆఫీసులు మొత్తం 13 పోస్టాఫీస్‌లకు మాత్రమే ఇచ్చారు. రెండవ దఫాలో మరో 1000 పోస్టాఫీస్‌లకు ఈ అవకాశం కల్పిస్తారు. అప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని పోస్టాఫీసుల్లో ఐపీపీబి సదుపాయం అందుబాటులోకి వస్తుంది. –టి.శివరామ ప్రసాద్, కొత్తగూడెం హెడ్ పోస్ట్ మాస్టర్ -
దేశవ్యాప్తంగా ఐపీపీబీలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ)లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పోస్టల్ కార్యదర్శి బీవీ సుధాకర్ వెల్లడించారు. శుక్రవారం డాక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 సెప్టెంబర్ నాటికి జిల్లాకు ఒకటి చొప్పున సుమారు 650 బ్యాంక్ శాఖలు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బ్యాంకులకు వాటి పరిధిలోని పోస్టాఫీసులను అనుసంధానించనున్నట్లు పేర్కొన్నా రు. కేంద్రం అమలు చేస్తున్న నగదు బదిలీ (డీబీటీ) పథకంలో ప్రభుత్వం, వినియోగదారుడికి మధ్య సేవలందించనుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే బ్యాంకు పాలనాయంత్రాంగం కోసం 3,500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోస్టల్ శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ఇటీవల జాతీయ సర్వీస్ కాల్ సెంటర్‌ను ప్రారంభించామని, టోల్‌ఫ్రీ నంబర్ 1924కు ఫోన్ చేస్తే 24 గంటల్లోగా ఫిర్యాదులపై స్థితిగతులు అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామీణ డాక్ సేవలో ఖాళీగా ఉన్న సుమారు 55 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోస్టల్ శాఖ సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించినట్లు సుధాకర్ వెల్లడించారు. పోస్టల్ భవనాలకు సోలార్ విద్యుత్ వినియోగిస్తే ఖర్చు తగ్గించుకోవచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 13,800 కోట్ల ఆదాయాన్ని గడించాలని లక్ష్యంగా నిర్ణయించా మన్నారు. సమావేశంలో ఏపీ సర్కిల్ సీజీఎం సంపత్, రాధిక చక్రవర్తి పాల్గొన్నారు.