వేలి ముద్రతో నగదు డ్రా | Cash draw with fingerprint | Sakshi
Sakshi News home page

వేలి ముద్రతో నగదు డ్రా

Published Tue, Nov 26 2019 5:19 AM | Last Updated on Tue, Nov 26 2019 5:19 AM

Cash draw with fingerprint - Sakshi

రామకృష్ణ అత్యవసర పని మీద అనంతపురం జిల్లాలోని ఇప్పేరు గ్రామానికి వెళ్లాడు. ఆన్‌లైన్‌ చెల్లింపులకు అలవాటు పడిన అతను అత్యవసరంగా అక్కడ రూ.8,000 నగదు చెల్లించాల్సి వచ్చింది. ఆ ఊళ్లో బ్యాంకు, ఏటీఎం లేదు. కనీసం 20 కి.మీ దూరం వెళ్తేకానీ ఏటీఎం సెంటర్‌ లేదు. ఏం చేయాలో పాలుపోక బిజినెస్‌ వ్యవహారాలపై అవగాహన ఉన్న తన స్నేహితునికి ఫోన్‌ చేశాడు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్తే రూ.10 వేల వరకు నగదు తీసుకోవచ్చని అతను సలహా ఇచ్చాడు. నమ్మకం కలగనప్పటికీ, ప్రయత్నిద్దామని పక్కనే ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి పోస్టుమాస్టర్‌కు తన పరిస్థితి వివరించాడు. అతను రామకృష్ణ వేలిముద్రలు తీసుకొని వెంటనే రూ.10 వేలు ఇచ్చాడు. ఆ వెంటనే తన ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో ఆశ్చర్యపోయాడు.

ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే పోస్ట్‌మ్యాన్‌ మన ఇంటి వద్దకే వచ్చి నగదు డిపాజిట్, విత్‌డ్రా, మనీ ట్రాన్స్‌ఫర్‌ వంటి సేవలను అందిస్తున్నారు. విద్యుత్, గ్యాస్, వాటర్‌ బిల్లు తదితర చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలన్నీ పోస్టాఫీసు వద్దకు వెళ్లి ఉచితంగా పొందవచ్చు. పోస్ట్‌మ్యాన్‌ ఇంటి వద్దకు వచ్చి ఈ సేవలు అందిస్తే క్యాష్‌ డిపాజిట్, విత్‌డ్రాయల్స్‌కు రూ.25, ఇతర సేవలకు రూ.15 చొప్పున సర్వీస్‌ చార్జి వసూలు చేస్తారు. రాష్ట్రంలో 10,489 పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

సాక్షి, అమరావతి: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ గత ఏడాది అధునాతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 15 రోజుల క్రితం ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఏటీఎం కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలతో పనిలేకుండా నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి వేలిముద్ర వేయడం ద్వారా నగదు తీసుకునే సౌకర్యం కల్పించింది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా నుంచి ఈ విధానంలో నగదు తీసుకోవచ్చు. ఖాతాదారునికి నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉంటే, ఆధార్‌ డేటాబేస్‌లో చివరిసారి ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా కొన్ని బ్యాంకులు రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, మరికొన్ని బ్యాంకులు రూ.5 వేలు తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 

ఖాతాల పెంపుపై దృష్టి
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకులో కొద్ది రోజులుగా ఖాతాల పెంపుపై దృష్టి సారించారు. ఈ ఖాతాల్లో గరిష్టంగా రూ.లక్షకు మించి దాచుకోవడానికి వీలుండదు. అందుకని వీటిని పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రూ.లక్షకు మించి ఉన్న నగదు నేరుగా సేవింగ్స్‌ ఖాతాలోకి వెళ్తుంది. (రూ.లక్షకు మించి డిపాజిట్‌ చేయాలంటే సేవింగ్స్‌ ఖాతా తప్పనిసరి) అవసరమైనప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న బ్యాంకింగ్‌ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ రామ్‌ భరోసా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అటల్‌ పెన్షన్‌ యోజన, అతి తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాలతో పాటు పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వంటి అన్ని రకాల పథకాలు, సేవలను పోస్టాఫీసుల్లో అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 59 పోస్టల్‌ ఏటీఎంలను ఏర్పాటు చేశామని చెప్పారు. 

మొదటి స్థానంలో ఏపీ సర్కిల్‌ 
పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాలను ప్రారంభించడంలో ఏపీ సర్కిల్‌ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10.33 లక్షల ఖాతాలతో రూ.21.59 కోట్ల డిపాజిట్లను సేకరించింది. గత ఏడు నెలల్లోనే 6.91 లక్షల ఖాతాలను ప్రారంభించాం. ఈ ఏడాది మొత్తం ఖాతాల సంఖ్యను 30 లక్షలకు చేర్చాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆధార్‌ ఎనేబుల్డ్‌ సర్వీస్‌ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క.
– జి.ప్రశాంతి, సీనియర్‌ మేనేజర్, పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్, విజయవాడ డివిజన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement