సాక్షి, హైదరాబాద్: అందినట్టే అంది బ్యాటరీ బస్సులు చేజారిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 325 ఎలక్ట్రిక్ బస్సులు అందకుండా పోతున్నాయి. ఇవన్నీ సబ్సిడీ ధరలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి కావటం విశేషం. కొత్త బస్సులు కొనే పరిస్థితి లేక కునారిల్లుతున్న ఆర్టీసీ ఖాతాలో ఒకేసారి ఇన్ని బస్సులు చేరే అవకాశం చేజారిపోతోంది. డిసెంబర్ 15లోపు టెండర్ల తంతు పూర్తి చేసి కేంద్ర ఉపరితల రవాణాశాఖకు వివరాలు అందజేయాల్సి ఉన్నా, ఆర్టీసీ సమ్మె వల్ల ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇక గడువుకు ఎక్కువ సమయం లేకపోవటంతో ఆ బస్సుల కేటాయింపు రద్దయినట్టేనని ఆర్టీసీ తేల్చేసింది.
ఇదీ సంగతి..
కేంద్ర ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో అన్ని ప్రధాన నగరాలు, కొన్ని పట్టణాలకు బ్యాటరీ బస్సులను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ ఖరీదైనవి కావటంతో వాటిని సబ్సిడీ ధరలకు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఫాస్టర్ అడా ప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) పథకం పేరుతో వీటిని మంజూరు చేస్తోంది. తొలిదశలో హైదరాబాద్ సిటీకి వంద ఏసీ బస్సులు మంజూరు చేయగా వాటిల్లో 40 వచ్చాయి. వీటిల్లో ఒక్కో బస్సుపై రూ.కోటి సబ్సిడీ ప్రకటించింది. రెండో దశలో భాగంగా 325 నాన్ ఏసీ బస్సులు మంజూరయ్యాయి. వీటిల్లో ఒక్కో దానిపై రూ.50 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించింది. ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో వాటిని ఏర్పాటు చేసేలా ఆర్టీసీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సరిగ్గా ఫర్మ్‌ను ఎంపిక చేసే సమయంలో ఆర్టీసీలో సమ్మె మొదలైంది. వాస్తవానికి సెప్టెంబర్‌లోనే ఆర్టీసీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్‌లో దాన్ని మదించి కాం ట్రాక్టు సంస్థను గుర్తించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను సగానికి సగం తగ్గించి 5,100 బస్సులను ప్రైవేటు పర్మిట్ల ద్వారా తిప్పాలని నిర్ణయించింది. అంటే, ఆర్టీసీ బస్సులు తిరిగే రూట్లలో ప్రైవేటు బస్సులు స్టేజీ క్యారి యర్లుగా తిరగాల్సి ఉందన్నమాట. దీంతో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఏ ఖాతాలో ఉంచాలన్న విషయంలో స్పష్టత రాకపోవటంతో, వాటి కోసం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను అధికారులు రద్దు చేశారు.
స్పష్టత వచ్చాక తిరిగి పిలవాలని నిర్ణయించారు. కానీ సమ్మె ఏకంగా 52 రోజుల సుదీర్ఘ సమయం కొనసాగటం, రూట్ పర్మిట్లపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావటంతో తీవ్ర జాప్యం జరిగింది. తిరిగి సమ్మె ముగిసి ఆర్టీసీ యథావిధిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి తేల్చారు. కానీ, డిసెంబర్ 15 వరకు టెండర్ ఖరారు చేసి ఢిల్లీకి పంపాల్సి ఉంది. దానికి సమయం చాలా తక్కువగా ఉండటంతో అధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి ఇప్పటికిప్పుడు అదనపు సమయం తీసుకునే వెసులుబాటు లేకపోవటంతో ఈ సంవత్సరానికి ఆ ప్రాజెక్టును వదులుకోవాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేస్తే తప్ప ఈ బస్సులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
అన్నీ ప్రైవేటు సంస్థలకే..
నిజానికి ఎలక్ట్రిక్ బస్సులను కొనే స్థోమత ఆర్టీసీకి లేదు. ఒక్కో బస్సుకు రూ.50లక్షల సబ్సిడీ వస్తున్నందున ప్రభుత్వం సహకరిస్తే కొనే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం అన్ని నిధులు ఆర్టీసీకి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. దీంతో ప్రైవేటు సంస్థలకు ఆ సబ్సిడీని బదిలీ చేసి అద్దె ప్రాతిపదికన ఆ సంస్థ నుంచి బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. ఫేమ్ పథకంలో ఈ వెసులుబాటు ఉండటంతో దాన్నే ఆర్టీసీ అనుసరించింది. డిసెంబర్ 15లోపు టెండర్ల ప్రక్రియ పూర్తయితే, మరో ఏడెనిమిది నెలల్లో బస్సులందే అవకాశం ఉండేది. వాటిల్లో 309 బస్సులను సిటీలో, మిగతావి వరంగల్ పట్టణంలో నడపాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న దశలో ఈ అవాంతరం ఆర్టీసీని నిరాశకు గురిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment