సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్‌ బస్సు బుగ్గి! | Hyderabad: TSRTC Electric Bus Catches Fire While On Charging | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్‌ బస్సు బుగ్గి!

Published Wed, Feb 23 2022 3:25 AM | Last Updated on Wed, Feb 23 2022 11:51 AM

Hyderabad: TSRTC Electric Bus Catches Fire While On Charging - Sakshi

మంటల్లో కాలుతున్న ఆర్టీసీ బస్సు

కంటోన్మెంట్‌: సికింద్రాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ కంటోన్మెంట్‌ డిపోలో మంగళవారం ఓ ఎలక్ట్రిక్‌ బస్సు అగ్నికి ఆహుతి అయింది. విద్యుత్‌ చార్జింగ్‌ కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే పూర్తిగా దగ్ధమైంది. కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్న ఫైరింజన్‌ కేవలం 10 నిమిషాల్లో డిపోకు చేరుకున్నప్పటికీ ఆలోపే బస్సంతా కాలిపోయింది. జేబీఎస్‌ నుంచి ఎయిర్‌పోర్టు మధ్య నడిచే ఓ ఎలక్ట్రిక్‌ బస్సు (టీఎస్‌10 యూబీ 8025) మంగళవారం ఉదయం రెండు ట్రిప్పులు పూర్తిచేసుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు డిపోకు వచ్చింది.

డ్రైవర్, కండక్టర్‌ దిగాక డిపో సిబ్బంది బస్సును చార్జింగ్‌కు పెట్టారు. కాసేపయ్యాక ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సును చుట్టుముట్టాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సమీపంలోని ఇతర బస్సులకు మంటలు అంటుకోకుండా వాటిని దూరంగా తీసుకెళ్లారు. అలాగే ప్యారడైజ్‌ చౌరస్తా సమీపంలోని ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే ఫైర్‌ సిబ్బంది డిపోకు వచ్చేసరికే బస్సు మంటల్లో కాలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆర్టీసీ ఉన్నతాధికారులతోపాటు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్‌ బస్సు మూడేళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తుండటం గమనార్హం. 

మూడేళ్లుగా సేవలు... 
నగరంలోని పికెట్, మియాపూర్‌ ఆర్టీసీ డిపోల్లో కొత్తగా ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టారు. పికెట్‌ డిపోలో 22, మియాపూర్‌లో 20 బస్సులు నిత్యం మూడు ట్రిప్పులవారీగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులను తరలిస్తూ ఉంటాయి. పికెట్‌ డిపో నుంచి మూడు వేర్వేరు మార్గాల్లో రోజుకు 88 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే 180 కి.మీ. వరకు ప్రయాణించే ఈ బస్సులను షిప్టులవారీగా నడుపుతూ విరామ సమయాల్లో డిపోలోని ప్రత్యేక చార్జింగ్‌ పాయింట్‌ల ద్వారా చార్జింగ్‌ చేస్తుంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement