contonement
-
కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వాల్సిందే.. గద్దర్ కూతురు వెన్నెల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా, వెన్నెల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నా పేరును పరిశీలిస్తోంది. టికెట్ విషయంలో చాలా మంది నన్ను అడుగుతున్నారు. అందుకే మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. కంటోన్మెంట్లో పుట్టి పెరిగాను. ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తాను. గద్దర్ కూతురుగా మీ ముందుకు వస్తున్నాను. ఓట్ల విప్లవం రావాలని గద్దర్ అన్నారు. అందుకే చివరగా కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతుగా నిలిచారు. గద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. కానీ, అకాల మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గద్దర్ భార్య విమల గద్దర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాకు టికెట్ ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. నా కూతురు వెన్నెలకు టికెట్ ఇవ్వండి. వెన్నెలను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని అన్నారు. ఇదిలా ఉండగా, ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక, గద్దర్‌కు కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా మంచి అనుబంధమే ఉంది. కాంగ్రెస్‌ను ప్రజలు మళ్లీ గెలిపించాలని గద్దర్ పలు సందర్భాల్లో కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో కవిత ధర్నాల సంగతేంటి.. బీఆర్ఎస్పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్ -
కంటోన్మెంట్ బీఆర్ఎస్లో గందరగోళం.. ఎమ్మెల్యే రేసులో అరడజను ఆశావహులు!
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు రోజురోజుకీ తీవ్రమవుతోంది. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఎమ్మెల్యే సాయన్న మరణంతో నేతలందరినీ ఒక్కతాటిపై నడిపించే వారు కరువయ్యారు.ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారు ఎవరికి వారే తమ ఉనికి చాటేందుకు ఆరాటపడుతున్నారు. అంతేకాక ఇద్దరు మంత్రులు సైతం నియోజకవర్గంలో పార్టీకి తామే పెద్దదిక్కు అనేలా క్యాడర్‌ను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో తాము ఎవరి వెంట నడవాలో అర్థం నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. భౌగోళికంగా హైదరాబాద్ జిల్లాలో ఉండే కంటోన్మెంట్ నియోజకవర్గం పార్లమెంట్ విషయానికొస్తే మల్కాజ్గిరి పరిధిలో ఉంటుంది. ఆది నుంచీ మల్కాజ్గిరి ఎంపీ లేదా ఎంపీ అభ్యర్థులే ఇక్కడ ఆధిపత్యం చేలాయిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి సహజంగానే పార్టీ నేతలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా అదే ధోరణిలో బోర్డు సభ్యులంతా తనవైపే ఉండేలా జాగ్రత్త లు పడుతూ వచ్చారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న సైతం మర్రి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నే బోర్డు ఎన్నికల ప్రకటన వెలువడటంతో సహజంగానే మర్రి తన వర్గంలోని బోర్డు మాజీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ఒక్కసారిగా పరిస్థితుల్లో తారుమారు అయ్యాయి. కీలకంగా మారిన మంత్రి.. ఎమ్మెల్యే సాయన్న దశదిన కర్మ ముగిసిన మరుసటి రోజే మంత్రి తలసాని, సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదితలతో పాటు బోర్డు మాజీ సభ్యుల్లో జక్కుల మహేశ్వర్ రెడ్డి (జేఎమ్మార్)ను తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. అక్కడికక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బోర్డు ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ ప్రకటించడంతో పాటు, సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల సర్వసభ్య సమావేశం రెండు సార్లూ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మరోసారి ఎమ్మెల్యే కూతుర్లు, జేఎమ్మార్‌తో పాటు మర్రి వర్గంలోని మరో ముఖ్య నేత బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్‌ను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. తదనంతరం తెలంగాణ భవన్లో తన ఆధ్వర్యంలోనే ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సైతం మర్రిని ఆహ్వానించలేదు. బోర్డు మాజీ సభ్యులు సైతం మర్రి రాజశేఖర్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే ఈ భేటీలకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్లు మన్నె కృశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేశ్‌లను కూడా ఈ భేటీకి పిలవకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. దిద్దుబాటులోనూ.. గత నెల 25 బొల్లారంలో నిర్వహించిన తొలి ఆత్మీయ సమ్మేళనం పార్టీలోని అసమ్మతిని బహిర్గతం చేసింది. మాజీ బోర్డు సభ్యులే వార్డుల అనధికారిక ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తూ ఉండటాన్ని పలువురు నేతలు తప్పుబట్టారు. మన్నె కృశాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న శ్రీగణేశ్‌ను సైతం పార్టీ నేతలు దూరంగానే పెట్టారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్లు తమ అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా మంత్రి తలసాని మరోసారి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మర్రితో పాటు ముఖ్య నేతలంతా హాజరైన ఈ సమావేశంలోనూ ఇన్చార్జ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా ప్రజాక్షేత్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లో సాయన్న కుమార్తెల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సాయన్న ప్రధాన అనుచరుల్లో ఒకరైన ముప్పిడి మధుకర్‌ను కొందరు నేతలు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా మారుతుందోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు బుగ్గి!
కంటోన్మెంట్: సికింద్రాబాద్ పరిధిలోని ఆర్టీసీ కంటోన్మెంట్ డిపోలో మంగళవారం ఓ ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. విద్యుత్ చార్జింగ్ కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే పూర్తిగా దగ్ధమైంది. కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్న ఫైరింజన్ కేవలం 10 నిమిషాల్లో డిపోకు చేరుకున్నప్పటికీ ఆలోపే బస్సంతా కాలిపోయింది. జేబీఎస్ నుంచి ఎయిర్‌పోర్టు మధ్య నడిచే ఓ ఎలక్ట్రిక్ బస్సు (టీఎస్10 యూబీ 8025) మంగళవారం ఉదయం రెండు ట్రిప్పులు పూర్తిచేసుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు డిపోకు వచ్చింది. డ్రైవర్, కండక్టర్ దిగాక డిపో సిబ్బంది బస్సును చార్జింగ్కు పెట్టారు. కాసేపయ్యాక ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సును చుట్టుముట్టాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సమీపంలోని ఇతర బస్సులకు మంటలు అంటుకోకుండా వాటిని దూరంగా తీసుకెళ్లారు. అలాగే ప్యారడైజ్ చౌరస్తా సమీపంలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే ఫైర్ సిబ్బంది డిపోకు వచ్చేసరికే బస్సు మంటల్లో కాలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆర్టీసీ ఉన్నతాధికారులతోపాటు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సు మూడేళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తుండటం గమనార్హం. మూడేళ్లుగా సేవలు... నగరంలోని పికెట్, మియాపూర్ ఆర్టీసీ డిపోల్లో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. పికెట్ డిపోలో 22, మియాపూర్‌లో 20 బస్సులు నిత్యం మూడు ట్రిప్పులవారీగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులను తరలిస్తూ ఉంటాయి. పికెట్ డిపో నుంచి మూడు వేర్వేరు మార్గాల్లో రోజుకు 88 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఫుల్ చార్జింగ్ చేస్తే 180 కి.మీ. వరకు ప్రయాణించే ఈ బస్సులను షిప్టులవారీగా నడుపుతూ విరామ సమయాల్లో డిపోలోని ప్రత్యేక చార్జింగ్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేస్తుంటారు. -
మెంబర్ షిప్ కోసం 20 ఏళ్లు వెయిటింగ్.. కొందరు ఆ కోరిక తీరకుండానే
సాక్షి, హైదరాబాద్: ఏదైనా క్లబ్బులో సభ్యత్వం కావాలంటే నిర్దేశిత మొత్తం చెల్లిస్తే చాలు వెంటనే అవకాశం కల్పిస్తారు. మరీ డిమాండ్ ఉన్న క్లబ్బుల్లో ఒకటి రెండేళ్లు లేదా గరిష్టంగా ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అదే సికింద్రాబాద్ క్లబ్ మెంబర్షిప్ పొందాలంటే 20 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిందే. అప్పటికీ సభ్యత్వం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. గత పదేళ్లుగా కొత్త సభ్యత్వాలే ఇవ్వలేదు. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసిన వారిలో కొందరు ఆ కోరిక తీరకుండానే చనిపోయారంటే అతిశయోక్తి కాదేమో. 218 ఏళ్ల క్రితం అప్పటి నిజాం నవాబు ప్రస్తుత అల్వాల్ పరిధిలోని ప్రాంతాలను సికింద్రాబాద్‌గా నామకరణం చేశారు. 1806లో హుస్సేన్ సాగర్‌కు తూర్పున ఉన్న 13 మొఘలాయి గ్రామాలను బ్రిటిష్‌వారికి అప్పగించారు. అదే కాలక్రమేణ కంటోన్మెంట్‌గా ఏర్పడింది. ► నిజాం ఆధీనంలోని హైదరాబాద్‌కు సమాంతరంగా బ్రిటిషర్లు సికింద్రాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. మిలిటరీ అధికారుల వినోదం కోసం క్రీడాప్రాంగణాలు, బార్లు, థియేటర్ల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మిలిటరీ అధికారుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఓ సంఘం ఆధ్వర్యంలో 1878లో ‘పబ్లిక్ రూమ్స్’ పేరిట ఓ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ► తొలుత బొల్లారం (సికింద్రాబాద్ స్టేషన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం)లో ఏర్పాటైన ఈ సంఘం తమ కార్యాలయాన్ని తొకట్టా గ్రామ (కాలక్రమంలో ఇదే బోయిన్‌పల్లిగా మారింది) పరిధిలోని 20.17 ఎకరాల విస్తీర్ణంలోని ఓల్డ్ గ్రాంట్ బంగళా (ఓజీబీ)లోనికి మార్చారు. ► 1836 గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఓల్డ్ గ్రాంట్ బంగళాల స్థలం పూర్తిగా ఆర్మీ ఆధీనంలో, భవనం మాత్రమే హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద యజమానులకు అప్పగించారు. ఈ మేరకు సికింద్రాబాద్ క్లబ్ స్థలం యాజమాన్యం ఇప్పటికీ ఆర్మీ ఆధీనంలో ఉండగా, భవనం మాత్రమే క్లబ్ నిర్వాహకుల చేతుల్లో ఉంది. ► కాలక్రమేనా సికింద్రాబాద్ గారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటెడ్ సర్వీసెస్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్‌గా మారింది. ► సికింద్రాబాద్ క్లబ్బులో సభ్యత్వం పొందిన వారు ‘ఎలైట్ పర్సన్స్’గా చెలామణి అయ్యే వారు. ► 2010 నాటికి ఈ క్లబ్బులో సభ్యుల సంఖ్య 8 వేలకు చేరుకోవడంతో కొత్త సభ్యత్వాలను నిలిపివేశారు. అప్పటికే 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి సైతం నేటికీ సభ్యత్వాలు దక్కలేదు. (చదవండి: బ్రాండ్ హైదరాబాద్.. లండన్, న్యూయార్క్.. ఇప్పుడు మనదగ్గర) కార్పొరేట్ సభ్యత్వానికి రూ.10 లక్షలు సికింద్రాబాద్ క్లబ్లో సభ్యత్వం దక్కని వారికి ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ సభ్యత్వాలకు అవకాశం కల్పించారు. రూ.10 లక్షల నాన్ రీఫండబుల్ రుసుముతో పదేళ్ల కాలపరిమితితో కూడి సభ్యత్వాన్ని అందజేస్తారు. కనీసం రూ.2 కోట్ల టర్నోవర్, రూ.5 కోట్లకు మించి నెట్‌వర్త్ కలిగిన హైదబాద్‌లోని వ్యాపారులకు మాత్రమే ఈ సభ్యత్వం ఇస్తారు. ఇవి కూడా 250 మించి ఇవ్వరు. సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ పరిధిలోని మిలిటరీ ఉన్నతాధికారులకు నేరుగా సభ్యత్వం ఇస్తారు. ఇది కూడా గరిష్టంగా 1100 మందికి మాత్రమే ఇస్తారు. (చదవండి: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ రేస్ కార్లతో.. ‘ఫార్ములా–ఈ’) ► ఈ క్లబ్‌లకు దేశీయంగా వివిధ పట్టణాల్లోని 71 పేరెన్నిక కలిగిన క్లబ్బులు, అంతర్జాతీయంగా యూకే, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా వివిధ దేశాల్లోని 20కి పైగా క్లబ్బులతో అఫిలియేషన్ ఉంది. అంటే ఈ క్లబ్బు సభ్యులను అఫిలియేషన్ ఉన్న ఆయా క్లబ్బుల్లోకి అతిథులుగా అనుమతిస్తారు. సికింద్రాబాద్ క్లబ్బు సభ్యత్వానికి డిమాండ్ పెరగడానికి ఈ అఫిలియేషన్ కూడా ఒకటి కావడం గమనార్హం. (చదవండి: నా కల నెరవేర్చావు.. థ్యాంక్ యూ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా) -
రామన్నకుంట నీటి మళ్లింపుపై వివాదం
కంటోన్మెంట్ : కంటోన్మెంట్ పరిధిలోని రామన్నకుంట నీటి ప్రవాహం మళ్లింపు ఉద్రిక్తతకు దారితీసింది. కుంట పూర్తిస్థాయిలో నిండిపోవడంతో బ్యాక్ వాటర్ కారణంగా ఆరోవార్డు పరిధిలోని కొన్ని కాలనీలు జలమయం కావడంతో నీటిని కిందకు వదిలారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, పాండుయాదవ్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారిణి తేజ్‌దీప్ కౌర్ అక్కడకి చేరుకుని సౌజన్యకాలనీలోని తన ఇంటిముందునుంచి నీరు వెళ్లకుండా మళ్లించాలని బోర్డు సభ్యులు, సిబ్బందిని ఆదేశించారు. అంతేగాకుండా రెవెన్యూ, కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది, బోర్డు సభ్యుల ప్రమేయం లేకుండానే తాను సూచించిన చోట చెరువుకు గండివేయాలని హంగామా సృష్టించారు. దీనిని అడ్డుకున్నందుకు ఆమె సహాయక సిబ్బంది తమ ప్రతాపం చూపారు. ఉన్నతాధికారి సూచనల మేరకు బోయిన్ పల్లి పోలీసులు వాగ్వాదానికి దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. దీంతో బోర్డు సభ్యులు సమస్యను సీఈఓ సుజాత గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సౌజన్య కాలనీలోని ఆమె ఇంటి ముందుకు వరద నీరు రాకుండా బస్తాలు అడ్డుపెట్టి ప్రవాహన్ని పక్క కాలనీలోకి మళ్లించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సాయన్న ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విధుల్లో జోక్యం తగదు: కేంద్ర రక్షణశాఖ ఆధీనంలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సాగే ఇక్కడి మున్సిపల్ వ్యవహరాలపై ఇతర శాఖలకు చెందిన అధికారులు జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారిణి తమ సిబ్బంది విధుల్లో జోక్యం చేసుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. శనివారం ఉదయం ఈ ఘటనపై విచారణ చేపడతాం. సౌజన్య కాలనీలో ఓ వీధిలో కొందరు వ్యక్తులు తమ ఇషా్తనుసారం బస్తాలు అడ్డుపెట్టి వరద నీటి ప్రవాహాన్ని ఇతరుల ఇళ్లమీదకు వదిలిన ఘటనపై కూడా చర్యలు తీసుకుంటాం. –సుజాత గుప్తా, సీఈఓ -
‘బంగారు’ గణపయ్య
కంటోన్మెంట్ : బోయిన్‌పల్లిలో రెండు దశాబ్దాలుగా ప్రతీయేటా వినూత్న రీతిలో గణపతి మండలపాలను ఏర్పాటు చేస్తున్న రాణా ప్రతాప్ యువసేన ఈ సారి గణపతిని బంగారు వెండిమయం చేస్తున్నారు. సుమారు రూ.లక్ష విలువ చేసే ‘ఫైబర్ గణపతి’ని పుణేలో ప్రత్యేకంగా తయారు చేయించిన నిర్వాహకులు... గణపతికి కేజీ బంగారం చైన్, నాలుగు కేజీల వెండి కిరీటాన్ని సైతం తయారు చేయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగే గణపతి కలశ స్థాపనలో ఆయా ఆభరణాల్ని అలంకరించనున్నారు. కాగా ఫైబర్ గణపతిని బోయిన్పల్లి హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టంచనుండగా, ఆభరణాలను రాణాప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో బ్యాంకులో భద్రపరచనున్నట్లు నిర్వాహకులు జంపన ప్రతాప్, ఆనంద్‌బాబు, గోవర్థన్‌రెడ్డి, అరుణ్ కుమార్ తెలిపారు. -
పడిపోవాల్సిందేనా?
బ్రిడ్జిని కూల్చేశారు.. అలా వదిలేశారు.. అంతే.. ఆ మార్గంలో వెళ్లేవారి పరిస్థితేంటి.. దానిని దాటుకుంటూ ఎలా గమ్యం చేరతారు.. పట్టుజారితే అంతే..నాలాలో కొట్టుకుపోవాల్సిందే.. చివరికి అదే జరిగింది.. అభం శుభం తెలియని ఓ నిండుప్రాణం అధికారుల నిర్లక్ష్యానికి గాలిలో కలిసిపోయింది.. కంటోన్మెంట్ పరిధిలో కూల్చేసిన ఫిలిప్స్బ్రిడ్జి ప్రాంతంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. బ్రిడ్జి కూల్చేసిన ప్రాంతంలో నాలా మీద ఉన్న పైప్‌లైన్ దాటుతూ బోయిన్పల్లి చిన్నతోకట్టాకు చెందిన రాకేశ్ (29) ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. – కంటోన్మెంట్ ముందు చూపు లేకుండా ప్రణాళికలు రూపొందించడం... తీరా పనులు ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో మళ్లీ మొదటికి వెళ్లడం కంటోన్మెంట్ బోర్డు అధికారులకు అలవాటుగా మారింది. కంటోన్మెంట్ పరిధిలో చేపట్టి అర్ధంతరంగా ఆగిపోయిన పనులకు తోడు సెంటర్‌పాయింట్– పుల్లారెడ్డి చౌరస్తా మార్గంలో ‘ఫిలిప్స్ బ్రిడ్జి’ని నాలుగు నెలల క్రితం (ఏప్రిల్ 17) కూల్చేసి ఇప్పటికీ విస్తరణ పనులు ప్రారంభించలేదు. తాడ్బంద్ చౌరస్తా నుంచి నేరుగా బోయిన్పల్లి చెక్‌పోస్టు, మేడ్చల్ హైవేకు వెళ్లేందుకు అనువైన ఈ మార్గంలో ఫిలిప్స్ గోడౌన్ వద్ద బ్రిడ్జి కేవలం 20 అడుగుల వెడల్పు మాత్రమే ఉండేది. పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ బ్రిడ్జిని విస్తరించాలన్న డిమాండ్‌తో స్థానిక బోర్డు సభ్యులు ఎప్పటికప్పుడు బోర్డులో ప్రతిపాదిస్తూ వచ్చారు. అయితే ఈ బ్రిడ్జి విస్తరణకు గ్యారిసన్ ఇంజనీరింగ్ (జీఈ) అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, డిజైన్ మార్చాలని ఇలా పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి 2013లో బ్రిడ్జి విస్తరణ పనులకు బోర్డు ఆమోదం లభించింది. అదే సమయంలో తాడ్బంద్– బాలంరాయి మార్గంలో జైకా ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులు మొదలవడంతో ఈ మార్గాన్ని వన్‌వేగా మార్చారు. దీంతో అదే సమయంలో ఫిలిప్స్ బ్రిడ్జి విస్తరణ చేపడితే ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని భావించి ఈ పనులు చేపట్టేందుకు ట్రాఫిక్ అధికారులు అనుమతించలేదు. గత డిసెంబర్లోనే జైకా పనులు పూర్తికావడంతో బ్రిడ్జి విస్తరణకు అడ్డంకులు తొలగిపోయినప్పటికీ, కాంట్రాక్ట్ కాలపరిమితి ముగింపు, బ్రిడ్జి విస్తరణ సమయంలో ట్రాఫిక్ మళ్లింపునకు నాలా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు తోడు భూ సార పరీక్షలు, బ్రిడ్జి డిజైన్‌లో మార్పులు అంటూ అధికారులు తాత్సారం చేయడంతో మరింత ఆలస్యమైంది. తాజాగా మూడు నెలల్లో పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 16 నుంచి జూలై 16వ తేదీ వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకల్ని నిషేధించి, దారి మళ్లింపు చేపట్టారు. నిర్దేశిత గడువు ముగిసిపోయినప్పటికీ విస్తరణ పనులు ఒక్క అడుగుకూడా ముందుకు సాగకపోవడం గమనార్హం. వాహనదారుల ఇక్కట్లు.. ఓల్డ్ బోయిన్పల్లి, న్యూబోయిన్‌పల్లి పరిధిలోని సుమారు 100కు పైగా కాలనీల ప్రజలతో పాటు సికింద్రాబాద్ నుంచి సుచిత్ర–కొంపల్లి, మేడ్చల్ మార్గాలకు వెళ్లే వాహనదారులు సెంటర్‌పాయింట్ మార్గాన్నే వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ దారిలో వాహనాల రాకపోకల్ని నిషేధించడంతో ద్విచక్ర వాహనదారులు సమీపంలోని కాలనీ మార్గాలను ఆశ్రయిస్తుండగా, మెజారిటీ వాహనాలను దుబాయ్గేట్– బోయిన్పల్లి మార్కెట్, డైమండ్ పాయింట్ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గాల్లో ట్రాఫిక్‌జామ్‌లు నిత్యకృత్యమయ్యాయి. దుబాయ్ గేట్ చౌరస్తాలో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ సమస్య కొనసాగుతోంది. నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి కంటోన్మెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలైపోయాడు. బోయిన్పల్లి చిన్నతోకట్టాకు చెందిన రాకేశ్ (29) బుధవారం మధ్యాహ్నం సెంటర్‌పాయింట్ చౌరస్తా సమీపంలో కూల్చేసిన ‘ఫిలిప్స్ గోడౌన్’ దాటుతూ ప్రమాదవశాత్తు నాలాలో పడి మరణించాడు. డ్రైవర్‌గా పనిచేసే రాకేశ్ బాలాజీనగర్‌లోని అత్తగారింటికి బాపూజీనగర్ మీదుగా సెంటర్‌పాయింట్‌కు వెళ్లే క్రమంలో నాలాపైనున్న మంచినీటి పైపులైను దాటుతూ వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి నాలాలో పడిపోయి ప్రవాహంలో మునిగిపోయాడు. ఓ సెక్యూరిటీ గార్డు గమనించి స్థానికులకు చెప్పగా దాదాపు గంటన్నర సేపు ప్రవాహంలో వెతికారు. 108 సిబ్బంది, పోలీసులు సైతం వెతికి ప్రయోజనం లేకపోవడంతో వెనుతిరిగారు. తరువాత ఇద్దరు స్థానిక యువకులు నాలాలోకి దిగి ప్రవాహంలో కొంతదూరం వెళ్లి వెతగ్గా మృతదేహం కనిపించింది. దీంతో జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ ఘటనకు కంటోన్మెంట్ బోర్డు అధికారులే బాధ్యత వహించాలని స్థానిక నేతలు నేతలు భానుక మల్లికార్జున్, ముప్పిడి మధుకర్ సీఈఓ వచ్చే వరకు శవాన్ని తరలించడకుండా అడ్డుకున్నారు. బోర్డు సభ్యులు పాండుయాదవ్, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేందర్‌ను నిలదీశారు. ఎమ్మెల్యే సాయన్న చేరుకొని మృతుడు గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిగా గుర్తించాడు. దహన సంస్కారాల నిమిత్తం ఎమ్మెల్యే రూ.5వేలు అందజేయగా, బోర్డు సభ్యులు మరో రూ.25వేలు అందజేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మన్నె కృషాంక్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జెల నాగేశ్ మృతదేహాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మృతదేహాన్ని గాంధీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి భార్య అనిత, మూడేళ్ల కుమారుడు శ్రవణ్ ఉన్నారు.