బస్తాలు అడ్డుపెట్టి ప్రవాహాన్ని మళ్లిస్తున్న దృశ్యం
కంటోన్మెంట్ : కంటోన్మెంట్ పరిధిలోని రామన్నకుంట నీటి ప్రవాహం మళ్లింపు ఉద్రిక్తతకు దారితీసింది. కుంట పూర్తిస్థాయిలో నిండిపోవడంతో బ్యాక్ వాటర్ కారణంగా ఆరోవార్డు పరిధిలోని కొన్ని కాలనీలు జలమయం కావడంతో నీటిని కిందకు వదిలారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, పాండుయాదవ్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటిని మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే సీనియర్ ఐపీఎస్ అధికారిణి తేజ్‌దీప్ కౌర్ అక్కడకి చేరుకుని సౌజన్యకాలనీలోని తన ఇంటిముందునుంచి నీరు వెళ్లకుండా మళ్లించాలని బోర్డు సభ్యులు, సిబ్బందిని ఆదేశించారు.
అంతేగాకుండా రెవెన్యూ, కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది, బోర్డు సభ్యుల ప్రమేయం లేకుండానే తాను సూచించిన చోట చెరువుకు గండివేయాలని హంగామా సృష్టించారు. దీనిని అడ్డుకున్నందుకు ఆమె సహాయక సిబ్బంది తమ ప్రతాపం చూపారు. ఉన్నతాధికారి సూచనల మేరకు బోయిన్ పల్లి పోలీసులు వాగ్వాదానికి దిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
దీంతో బోర్డు సభ్యులు సమస్యను సీఈఓ సుజాత గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సౌజన్య కాలనీలోని ఆమె ఇంటి ముందుకు వరద నీరు రాకుండా బస్తాలు అడ్డుపెట్టి ప్రవాహన్ని పక్క కాలనీలోకి మళ్లించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే సాయన్న ఆ ప్రాంతంలో పర్యటించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
విధుల్లో జోక్యం తగదు:
కేంద్ర రక్షణశాఖ ఆధీనంలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సాగే ఇక్కడి మున్సిపల్ వ్యవహరాలపై ఇతర శాఖలకు చెందిన అధికారులు జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారిణి తమ సిబ్బంది విధుల్లో జోక్యం చేసుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. శనివారం ఉదయం ఈ ఘటనపై విచారణ చేపడతాం. సౌజన్య కాలనీలో ఓ వీధిలో కొందరు వ్యక్తులు తమ ఇషా్తనుసారం బస్తాలు అడ్డుపెట్టి వరద నీటి ప్రవాహాన్ని ఇతరుల ఇళ్లమీదకు వదిలిన ఘటనపై కూడా చర్యలు తీసుకుంటాం.
–సుజాత గుప్తా, సీఈఓ