హైదరాబాద్: కంటోన్మెంట్ శాసనసభా నియోజకవర్గంలో వారసురాళ్లు కదన భేరికి సంసిద్ధులవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణంతో అధికార బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యరి్థగా ఆయన కుమార్తె లాస్యను ప్రకటించింది. దీంతో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం మహిళా అభ్యర్థుల వైపే మొగ్గు చూపే పరిస్థితులు ఎదురయ్యాయి. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి, ఆ వర్గం ఓటర్లపై దృష్టిపెట్టిన బీజేపీ.. ఈ ఎన్నికల్లోనే అధిక సంఖ్యలో అతివలకు టికెట్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది.
► ఇక కాంగ్రెస్ సైతం తమ పార్టీ తరఫున మహిళనే రంగంలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఇద్దరు మహిళా అభ్యర్థులు సుషి్మత శంకర్‌రావు, రజని ప్రధానంగా పోటీ పడుతుండగా, అధిష్టానం సుషి్మతకే టికెట్ కేటాయించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యరి్థగా దాదాపు ఖరారు చేసిందని తెలుస్తోంది. దీంతో కంటోన్మెంట్‌లో వారసురాళ్ల పోటీ అనివార్యం కానుంది. సుషి్మత తండ్రి శంకర్‌రావు 2009–14 మధ్య కాలంలో కంటోన్మెంట్‌లో ఎమ్మెల్యేగా పనిచేశారు. సాయన్న 1994 నుంచి 2009లో ఒక్కసారి మినహా అయిదుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గద్దర్ కుటుంబం కంటోన్మెంట్‌ను ఆనుకుని ఉండే అల్వాల్‌లో నివాసముంటోంది.
బీజేపీ నుంచి సుస్మిత..
బీజేపీ నుంచి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉద్యోగి పరశురామ్, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న కపిల్ బరాబరి టికెట్ కోసం తీవ్రంగానే ప్రయతి్నస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్‌రావు కుమార్తె సుషి్మతకు టికెట్ ఇప్పించడంలో ఆమె మామ వివేక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అధిష్టానం తీరుపై అసహనంతో ఉన్న వివేక్‌ను ఒప్పించే క్రమంలో బీజేపీ పెద్దలు ఆయన మేనకోడలు సుషి్మతకు టికెట్ ఖరారు చేయొచ్చనే అంచనాలున్నాయి.
కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్..
కాంగ్రెస్ నుంచి స్థానిక నేతలు డీబీ దేవేందర్, నర్సింహతో పాటు పొంగులేటి అనుచరుడు పిడమర్తి, అల్వాల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జీవక పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమర్పణకు వెళ్తూ అట్టహాసంగా ర్యాలీ నిర్వహించిన సర్వే ఆ తర్వాత సైలెంటయ్యారు. తాజా సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం గద్దర్ కుమార్తె వెన్నెల వైపు మొగ్గు చూపినట్లు సంకేతాలు అందుతున్నాయి.
తొలి మహిళా ఎమ్మెల్యే మంకమ్మ
1957లో ఏర్పడిన కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బీవీ గురుమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 1967లో ఈ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో వి. రామారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడాదిలోనే ఈయన మరణించడంతో ఉపఎన్నికల్లో ఆయన సతీమణి మంకమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తిరిగి 1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచారు. కంటోన్మెంట్ తొలి, ఏకైక మహిళా ఎమ్మెల్యేగా రికార్డు ఆమె పేరిటే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment