కేడర్‌లో సమన్వయం కోసం మంత్రి తలసాని కార్యాలయంలో నిర్వహించిన సమావేశం (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు రోజురోజుకీ తీవ్రమవుతోంది. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఎమ్మెల్యే సాయన్న మరణంతో నేతలందరినీ ఒక్కతాటిపై నడిపించే వారు కరువయ్యారు.ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారు ఎవరికి వారే తమ ఉనికి చాటేందుకు ఆరాటపడుతున్నారు. అంతేకాక ఇద్దరు మంత్రులు సైతం నియోజకవర్గంలో పార్టీకి తామే పెద్దదిక్కు అనేలా క్యాడర్‌ను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో తాము ఎవరి వెంట నడవాలో అర్థం నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
భౌగోళికంగా హైదరాబాద్ జిల్లాలో ఉండే కంటోన్మెంట్ నియోజకవర్గం పార్లమెంట్ విషయానికొస్తే మల్కాజ్‌గిరి పరిధిలో ఉంటుంది. ఆది నుంచీ మల్కాజ్‌గిరి ఎంపీ లేదా ఎంపీ అభ్యర్థులే ఇక్కడ ఆధిపత్యం చేలాయిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మల్కాజ్‌గిరి ఎంపీ అయిన ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి సహజంగానే పార్టీ నేతలకు పెద్ద దిక్కుగా ఉంటున్నారు.
2019లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా అదే ధోరణిలో బోర్డు సభ్యులంతా తనవైపే ఉండేలా జాగ్రత్త లు పడుతూ వచ్చారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న సైతం మర్రి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నే బోర్డు ఎన్నికల ప్రకటన వెలువడటంతో సహజంగానే మర్రి తన వర్గంలోని బోర్డు మాజీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ఒక్కసారిగా పరిస్థితుల్లో తారుమారు అయ్యాయి.
కీలకంగా మారిన మంత్రి..
ఎమ్మెల్యే సాయన్న దశదిన కర్మ ముగిసిన మరుసటి రోజే మంత్రి తలసాని, సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదితలతో పాటు బోర్డు మాజీ సభ్యుల్లో జక్కుల మహేశ్వర్ రెడ్డి (జేఎమ్మార్)ను తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. అక్కడికక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బోర్డు ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ ప్రకటించడంతో పాటు, సర్వసభ్య సమావేశానికి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల సర్వసభ్య సమావేశం రెండు సార్లూ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మరోసారి ఎమ్మెల్యే కూతుర్లు, జేఎమ్మార్‌తో పాటు మర్రి వర్గంలోని మరో ముఖ్య నేత బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్‌ను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు.
తదనంతరం తెలంగాణ భవన్‌లో తన ఆధ్వర్యంలోనే ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సైతం మర్రిని ఆహ్వానించలేదు. బోర్డు మాజీ సభ్యులు సైతం మర్రి రాజశేఖర్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండానే ఈ భేటీలకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్‌లు మన్నె కృశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నాగేశ్‌లను కూడా ఈ భేటీకి పిలవకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
దిద్దుబాటులోనూ..
గత నెల 25 బొల్లారంలో నిర్వహించిన తొలి ఆత్మీయ సమ్మేళనం పార్టీలోని అసమ్మతిని బహిర్గతం చేసింది. మాజీ బోర్డు సభ్యులే వార్డుల అనధికారిక ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తూ ఉండటాన్ని పలువురు నేతలు తప్పుబట్టారు. మన్నె కృశాంక్, గజ్జెల నాగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న శ్రీగణేశ్‌ను సైతం పార్టీ నేతలు దూరంగానే పెట్టారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్‌లు తమ అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా మంత్రి తలసాని మరోసారి రంగంలోకి దిగారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మర్రితో పాటు ముఖ్య నేతలంతా హాజరైన ఈ సమావేశంలోనూ ఇన్‌చార్జ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మరోసారి నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా ప్రజాక్షేత్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లో సాయన్న కుమార్తెల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సాయన్న ప్రధాన అనుచరుల్లో ఒకరైన ముప్పిడి మధుకర్‌ను కొందరు నేతలు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఎలా మారుతుందోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment