సాక్షి, హైదరాబాద్: ఏదైనా క్లబ్బులో సభ్యత్వం కావాలంటే నిర్దేశిత మొత్తం చెల్లిస్తే చాలు వెంటనే అవకాశం కల్పిస్తారు. మరీ డిమాండ్ ఉన్న క్లబ్బుల్లో ఒకటి రెండేళ్లు లేదా గరిష్టంగా ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అదే సికింద్రాబాద్ క్లబ్ మెంబర్‌షిప్ పొందాలంటే 20 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిందే. అప్పటికీ సభ్యత్వం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. గత పదేళ్లుగా కొత్త సభ్యత్వాలే ఇవ్వలేదు. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసిన వారిలో కొందరు ఆ కోరిక తీరకుండానే చనిపోయారంటే అతిశయోక్తి కాదేమో. 218 ఏళ్ల క్రితం అప్పటి నిజాం నవాబు ప్రస్తుత అల్వాల్ పరిధిలోని ప్రాంతాలను సికింద్రాబాద్‌గా నామకరణం చేశారు. 1806లో హుస్సేన్ సాగర్‌కు తూర్పున ఉన్న 13 మొఘలాయి గ్రామాలను బ్రిటిష్‌వారికి అప్పగించారు. అదే కాలక్రమేణ కంటోన్మెంట్‌గా ఏర్పడింది.
► నిజాం ఆధీనంలోని హైదరాబాద్‌కు సమాంతరంగా బ్రిటిషర్లు సికింద్రాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. మిలిటరీ అధికారుల వినోదం కోసం క్రీడాప్రాంగణాలు, బార్‌లు, థియేటర్‌ల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మిలిటరీ అధికారుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఓ సంఘం ఆధ్వర్యంలో 1878లో ‘పబ్లిక్ రూమ్స్’ పేరిట ఓ క్లబ్‌ను ఏర్పాటు చేశారు.
► తొలుత బొల్లారం (సికింద్రాబాద్ స్టేషన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం)లో ఏర్పాటైన ఈ సంఘం తమ కార్యాలయాన్ని తొకట్టా గ్రామ (కాలక్రమంలో ఇదే బోయిన్‌పల్లిగా మారింది) పరిధిలోని 20.17 ఎకరాల విస్తీర్ణంలోని ఓల్డ్ గ్రాంట్ బంగళా (ఓజీబీ)లోనికి మార్చారు.
► 1836 గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఓల్డ్ గ్రాంట్ బంగళాల స్థలం పూర్తిగా ఆర్మీ ఆధీనంలో, భవనం మాత్రమే హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్‌ఓఆర్) కింద యజమానులకు అప్పగించారు. ఈ మేరకు సికింద్రాబాద్ క్లబ్ స్థలం యాజమాన్యం ఇప్పటికీ ఆర్మీ ఆధీనంలో ఉండగా, భవనం మాత్రమే క్లబ్ నిర్వాహకుల చేతుల్లో ఉంది.
► కాలక్రమేనా సికింద్రాబాద్ గారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటెడ్ సర్వీసెస్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్‌గా మారింది.
► సికింద్రాబాద్ క్లబ్బులో సభ్యత్వం పొందిన వారు ‘ఎలైట్ పర్సన్స్’గా చెలామణి అయ్యే వారు.
► 2010 నాటికి ఈ క్లబ్బులో సభ్యుల సంఖ్య 8 వేలకు చేరుకోవడంతో కొత్త సభ్యత్వాలను నిలిపివేశారు. అప్పటికే 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి సైతం నేటికీ సభ్యత్వాలు దక్కలేదు. (చదవండి: బ్రాండ్ హైదరాబాద్.. లండన్, న్యూయార్క్.. ఇప్పుడు మనదగ్గర)
కార్పొరేట్ సభ్యత్వానికి రూ.10 లక్షలు
సికింద్రాబాద్ క్లబ్‌లో సభ్యత్వం దక్కని వారికి ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ సభ్యత్వాలకు అవకాశం కల్పించారు. రూ.10 లక్షల నాన్ రీఫండబుల్ రుసుముతో పదేళ్ల కాలపరిమితితో కూడి సభ్యత్వాన్ని అందజేస్తారు. కనీసం రూ.2 కోట్ల టర్నోవర్, రూ.5 కోట్లకు మించి నెట్‌వర్త్ కలిగిన హైదబాద్‌లోని వ్యాపారులకు మాత్రమే ఈ సభ్యత్వం ఇస్తారు. ఇవి కూడా 250 మించి ఇవ్వరు. సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ పరిధిలోని మిలిటరీ ఉన్నతాధికారులకు నేరుగా సభ్యత్వం ఇస్తారు. ఇది కూడా గరిష్టంగా 1100 మందికి మాత్రమే ఇస్తారు. (చదవండి: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ రేస్ కార్లతో.. ‘ఫార్ములా–ఈ’)
► ఈ క్లబ్‌లకు దేశీయంగా వివిధ పట్టణాల్లోని 71 పేరెన్నిక కలిగిన క్లబ్బులు, అంతర్జాతీయంగా యూకే, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా వివిధ దేశాల్లోని 20కి పైగా క్లబ్బులతో అఫిలియేషన్ ఉంది. అంటే ఈ క్లబ్బు సభ్యులను అఫిలియేషన్ ఉన్న ఆయా క్లబ్బుల్లోకి అతిథులుగా అనుమతిస్తారు. సికింద్రాబాద్ క్లబ్బు సభ్యత్వానికి డిమాండ్ పెరగడానికి ఈ అఫిలియేషన్ కూడా ఒకటి కావడం గమనార్హం. (చదవండి: నా కల నెరవేర్చావు.. థ్యాంక్ యూ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా)
Comments
Please login to add a commentAdd a comment