పడిపోవాల్సిందేనా?
బ్రిడ్జిని కూల్చేశారు.. అలా వదిలేశారు.. అంతే.. ఆ మార్గంలో వెళ్లేవారి పరిస్థితేంటి.. దానిని దాటుకుంటూ ఎలా గమ్యం చేరతారు.. పట్టుజారితే అంతే..నాలాలో కొట్టుకుపోవాల్సిందే.. చివరికి అదే జరిగింది.. అభం శుభం తెలియని ఓ నిండుప్రాణం అధికారుల నిర్లక్ష్యానికి గాలిలో కలిసిపోయింది.. కంటోన్మెంట్ పరిధిలో కూల్చేసిన ఫిలిప్స్‌బ్రిడ్జి ప్రాంతంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. బ్రిడ్జి కూల్చేసిన ప్రాంతంలో నాలా మీద ఉన్న పైప్‌లైన్ దాటుతూ బోయిన్‌పల్లి చిన్నతోకట్టాకు చెందిన రాకేశ్ (29) ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు.
– కంటోన్మెంట్
ముందు చూపు లేకుండా ప్రణాళికలు రూపొందించడం... తీరా పనులు ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో మళ్లీ మొదటికి వెళ్లడం కంటోన్మెంట్ బోర్డు అధికారులకు అలవాటుగా మారింది. కంటోన్మెంట్ పరిధిలో చేపట్టి అర్ధంతరంగా ఆగిపోయిన పనులకు తోడు సెంటర్‌పాయింట్– పుల్లారెడ్డి చౌరస్తా మార్గంలో ‘ఫిలిప్స్ బ్రిడ్జి’ని నాలుగు నెలల క్రితం (ఏప్రిల్ 17) కూల్చేసి ఇప్పటికీ విస్తరణ పనులు ప్రారంభించలేదు. తాడ్‌బంద్ చౌరస్తా నుంచి నేరుగా బోయిన్‌పల్లి చెక్‌పోస్టు, మేడ్చల్ హైవేకు వెళ్లేందుకు అనువైన ఈ మార్గంలో ఫిలిప్స్ గోడౌన్ వద్ద బ్రిడ్జి కేవలం 20 అడుగుల వెడల్పు మాత్రమే ఉండేది. పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ బ్రిడ్జిని విస్తరించాలన్న డిమాండ్‌తో స్థానిక బోర్డు సభ్యులు ఎప్పటికప్పుడు బోర్డులో ప్రతిపాదిస్తూ వచ్చారు.
అయితే ఈ బ్రిడ్జి విస్తరణకు గ్యారిసన్ ఇంజనీరింగ్ (జీఈ) అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, డిజైన్ మార్చాలని ఇలా పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి 2013లో బ్రిడ్జి విస్తరణ పనులకు బోర్డు ఆమోదం లభించింది. అదే సమయంలో తాడ్‌బంద్– బాలంరాయి మార్గంలో జైకా ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులు మొదలవడంతో ఈ మార్గాన్ని వన్‌వేగా మార్చారు. దీంతో అదే సమయంలో ఫిలిప్స్ బ్రిడ్జి విస్తరణ చేపడితే ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందని భావించి ఈ పనులు చేపట్టేందుకు ట్రాఫిక్ అధికారులు అనుమతించలేదు.
గత డిసెంబర్‌లోనే జైకా పనులు పూర్తికావడంతో బ్రిడ్జి విస్తరణకు అడ్డంకులు తొలగిపోయినప్పటికీ, కాంట్రాక్ట్ కాలపరిమితి ముగింపు, బ్రిడ్జి విస్తరణ సమయంలో ట్రాఫిక్ మళ్లింపునకు నాలా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు తోడు భూ సార పరీక్షలు, బ్రిడ్జి డిజైన్‌లో మార్పులు అంటూ అధికారులు తాత్సారం చేయడంతో మరింత ఆలస్యమైంది. తాజాగా మూడు నెలల్లో పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 16 నుంచి జూలై 16వ తేదీ వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకల్ని నిషేధించి, దారి మళ్లింపు చేపట్టారు. నిర్దేశిత గడువు ముగిసిపోయినప్పటికీ విస్తరణ పనులు ఒక్క అడుగుకూడా ముందుకు సాగకపోవడం గమనార్హం.
వాహనదారుల ఇక్కట్లు..
ఓల్డ్ బోయిన్‌పల్లి, న్యూబోయిన్‌పల్లి పరిధిలోని సుమారు 100కు పైగా కాలనీల ప్రజలతో పాటు సికింద్రాబాద్ నుంచి సుచిత్ర–కొంపల్లి, మేడ్చల్ మార్గాలకు వెళ్లే వాహనదారులు సెంటర్‌పాయింట్ మార్గాన్నే వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ దారిలో వాహనాల రాకపోకల్ని నిషేధించడంతో ద్విచక్ర వాహనదారులు సమీపంలోని కాలనీ మార్గాలను ఆశ్రయిస్తుండగా, మెజారిటీ వాహనాలను దుబాయ్‌గేట్– బోయిన్‌పల్లి మార్కెట్, డైమండ్ పాయింట్ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గాల్లో ట్రాఫిక్‌జామ్‌లు నిత్యకృత్యమయ్యాయి. దుబాయ్ గేట్ చౌరస్తాలో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ సమస్య కొనసాగుతోంది.
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
కంటోన్మెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలైపోయాడు. బోయిన్‌పల్లి చిన్నతోకట్టాకు చెందిన రాకేశ్ (29) బుధవారం మధ్యాహ్నం సెంటర్‌పాయింట్ చౌరస్తా సమీపంలో కూల్చేసిన ‘ఫిలిప్స్ గోడౌన్’ దాటుతూ ప్రమాదవశాత్తు నాలాలో పడి మరణించాడు. డ్రైవర్‌గా పనిచేసే రాకేశ్ బాలాజీనగర్‌లోని అత్తగారింటికి బాపూజీనగర్ మీదుగా సెంటర్‌పాయింట్‌కు వెళ్లే క్రమంలో నాలాపైనున్న మంచినీటి పైపులైను దాటుతూ వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి నాలాలో పడిపోయి ప్రవాహంలో మునిగిపోయాడు. ఓ సెక్యూరిటీ గార్డు గమనించి స్థానికులకు చెప్పగా దాదాపు గంటన్నర సేపు ప్రవాహంలో వెతికారు. 108 సిబ్బంది, పోలీసులు సైతం వెతికి ప్రయోజనం లేకపోవడంతో వెనుతిరిగారు. తరువాత ఇద్దరు స్థానిక యువకులు నాలాలోకి దిగి ప్రవాహంలో కొంతదూరం వెళ్లి వెతగ్గా మృతదేహం కనిపించింది. దీంతో జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ ఘటనకు కంటోన్మెంట్ బోర్డు అధికారులే బాధ్యత వహించాలని స్థానిక నేతలు నేతలు భానుక మల్లికార్జున్, ముప్పిడి మధుకర్ సీఈఓ వచ్చే వరకు శవాన్ని తరలించడకుండా అడ్డుకున్నారు. బోర్డు సభ్యులు పాండుయాదవ్, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేందర్‌ను నిలదీశారు. ఎమ్మెల్యే సాయన్న చేరుకొని మృతుడు గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిగా గుర్తించాడు. దహన సంస్కారాల నిమిత్తం ఎమ్మెల్యే రూ.5వేలు అందజేయగా, బోర్డు సభ్యులు మరో రూ.25వేలు అందజేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మన్నె కృషాంక్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జెల నాగేశ్ మృతదేహాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మృతదేహాన్ని గాంధీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి భార్య అనిత, మూడేళ్ల కుమారుడు శ్రవణ్ ఉన్నారు.