సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరల భారాన్ని తగ్గించుకునేందుకు డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రాజెక్టుకు తెలంగాణ ఆర్టీసీ పచ్చ జెండా ఊపింది. ప్రయోగాత్మకంగా ఓ బస్సును మార్చేం దుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ రైలు లోకోమోటివ్స్‌కు సంబంధించిన పరికరాలు రూపొందించే ఓ ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యతను అప్పగించింది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఓ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మారుస్తోంది. ఇది విజయవంతమైతే మిగతా బస్సులను మార్చే దిశగా యోచించనుంది.
ఒక్కో బస్సుకు రూ.60 లక్షలు..
బ్యాటరీ బస్సులతో డీజిల్ భారం పూర్తిగా తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న డీజిల్ ధరలను బేరీజు వేసుకుంటే ఓ బస్సును నడిపేందుకు కిలోమీటరుకు రూ.20 వరకు ఖర్చవుతుంది. బ్యాటరీ బస్సుల నిర్వహణలో మాత్రం రూ.6గా మాత్రమే ఉండనుంది. ఇది ఆర్టీసీకి బాగా కలిసొస్తుంది. కాకపోతే బ్యాటరీ బస్సుల ఖరీదు చాలా ఎక్కువ. ప్రస్తుతం మన దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సులు తయారవుతున్నాయి.
కానీ వాటిల్లో వినియోగించే బ్యాటరీలను మాత్రం చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మొత్తం బస్సు ధరలో బ్యాటరీ ఖర్చే 70 శాతం వరకు ఉంటోంది. ఒక బస్సు ఖరీదు ప్రస్తుతం రూ.కోటిన్నర వరకు ఉంటోంది. అయితే డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మారిస్తే రూ.60 లక్షల వరకు ఖర్చవుతోంది. రైల్వే లోకోమోటివ్ పరికరాలు తయారు చేసే హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఇటీవల ముందుకొచ్చి ఆర్టీసీ ప్రతిపాదనకు అంగీకరించింది.
ఒక బస్సును పరీక్షించి..
ప్రస్తుతం ఒక బస్సును ఆ సంస్థ సిద్ధం చేస్తోంది. అనంతరం దాన్ని నడిపేందుకు అనుమతులు తీసుకుని రోడ్డుపైకి తీసుకొస్తారు. కీలక మార్గంలో దాన్ని తిప్పి, పని తీరును అంచనా వేయనున్నారు. ఫలితం బాగుంటే మిగతా బస్సలను కూడా మార్చేందుకు ముందడుగు వేయనున్నారు. అన్ని బస్సులను మార్చాలంటే భారీ వ్యయం అవుతుంది. అలా నేరుగా కన్వర్షన్‌కు అప్పగించకుండా, నిర్ధారిత కాలం పాటు బస్సులను ఆ సంస్థనే నిర్వహించి, డీజిల్ భారం లేకపోవడంతో ఆదా అయ్యే మొత్తాన్ని తీసుకునే ఓ ప్రత్యామ్నాయ విధానాన్ని ఎంపిక చేయనున్నారు. ఇది కూడా టెండర్ల ద్వారా అప్పగించనున్నారు. దీన్ని ఖరారు చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తారని సమాచారం.
సజ్జనార్ చొరవతో..
కొన్నేళ్లుగా డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఆర్టీసీపై భారం పెరుగుతోంది. దీంతో ఆ ఖర్చును తగ్గించుకునేందుకు దాదాపు రెండేళ్లుగా ఆర్టీసీ ఈ కన్వర్షన్ ఆలోచన చేస్తోంది. ఉన్నతాధికారుల నుంచి స్పందన రాకపోవటంతో పెండింగులో ఉండిపోయింది. ఇటీవల అధికారులు ఈ విషయాన్ని ఎండీ సజ్జనార్ దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన ఓ బస్సును మార్చేందుకు అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment