ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఎండీ సజ్జనార్
అఫ్జల్‌గంజ్: ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ బుధవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం జీడిమెట్ల డిపోకు చెందిన గండి మైసమ్మ–అఫ్జల్‌గంజ్ బస్సులో లక్డీకాపూల్ వద్ద ఎక్కి సాధారణ వ్యక్తిలా టికెట్టు తీసుకొని సీబీఎస్ వరకు ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో మాటలు కలిపి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సీబీఎస్ నుంచి కాలినడకన ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. పదకొండున్నర గంటల సమయంలో ఎంజీబీఎస్‌కు చేరుకున్న సజ్జనార్ గంటన్నర పాటు బస్టాండ్ ఆవరణలో తిరిగారు. పరిశుభ్రత, మరుగుదొడ్లు, బస్సుల రూట్ బోర్డులు, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాలను పరిశీలిస్తూ బస్టాండ్‌లోని ప్రయాణికులతో రవాణా సేవల వివరాలపై అడిగి తెలుసుకున్నారు.
అప్పటిదాకా సజ్జనార్‌ను ఎవరూ గుర్తు పట్టకపోవడం గమన్హారం. విషయం తెలుసుకున్న ఈడీ మునిశేఖర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఈడీ కార్యాలయంలో మునిశేఖర్, రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ వరప్రసాద్, హెడ్ రీజియన్ ఆర్‌ఎం వెంకన్న తదితరులతో మూడు గంటలపాటు సమావేశమయ్యారు. పార్కింగ్‌లో పేరుకుపోయిన వాహనాలను స్క్రాప్ యార్డుకు తరలించాలని, ప్రకటనల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి పార్కు నిర్వహణ బాధ్యతను ఔట్ సోర్సింగ్‌కు అప్పగించాలని సూచించారు. బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్టాల్స్‌ను వెంటనే అద్దెకివ్వాలని, టిక్కెట్టేతర ఆదాయం పెంచేందుకు పండుగలు, వివాహ సమయాల్లో బస్సులను అద్దె ప్రాతిపాదికన తిప్పాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment