సాక్షి, హైదరాబాద్: వాహన కాలుష్యానికి కళ్లెం వేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రం... ఆర్టీసీ విషయంలో మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు అమలు చేస్తున్న ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) పథకం కింద ఇచ్చే రాయితీని అందించాలన్న ఆర్టీసీ అభ్యర్థనను బుట్టదాఖలు చేసింది.
ప్రైవేటు కంపెనీలు అద్దె ప్రాతిపదికన ఇచ్చే విధానానికే రాయితీ కల్పిస్తామని తేల్చిచెప్పింది. దీంతో కంగుతినటం ఆర్టీసీ వంతైంది. ప్రైవేటు కంపెనీలు ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తే వాటికి రాయితీ అందించేందుకు మాత్రమే కేంద్ర రవాణా శాఖ ఆసక్తి చూపుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆర్టీసీ ఆశలపై నీళ్లు చల్లింది. తక్కువ ఖర్చుతో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలన్న ఆర్టీసీ ఆలోచనకు, ప్రారంభంలోనే ఢిల్లీ అధికారులు మోకాలడ్డారు.
ఇదీ సంగతి..
ఫేమ్–1 పథకం కింద 40 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం ఆర్టీసీకి మంజూరు చేసింది. వాటిని ఓ ప్రైవేటు కంపెనీ కొనుగోలు చేసి జీసీసీ పద్ధతిలో ఆర్టీసీకి అద్దెకిచ్చింది. ఒక్కో బస్సుకు రూ. కోటి చొప్పున రాయితీ ఇచ్చింది. ఇప్పుడు ఆ బస్సులకు కి.మీ.కి ఆర్టీసీ రూ. 34–35 చొప్పున అద్దెను ప్రైవేటు సంస్థకు చెల్లిస్తోంది. ఈ బస్సులు సాధారణ ప్రయాణికులకు ఉపయోగపడటం లేదు.
ఏసీ బస్సులు కావడంతో వాటి టికెట్ ధర భారీగా ఉంది. అంత ధర పెట్టేందుకు సాధారణ ప్రయాణికులు సిద్ధంగా లేనందున గత్యంతరం లేక ఆర్టీసీ వాటిని కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రమే నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఫేమ్–2 పథకం కింద నాన్ ఏసీ బస్సులను మాత్రమే కొని తక్కువ టికెట్ ధరతో వాటిని సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది. దీని కింద రాష్ట్రానికి 300 బస్సులు సమకూరే అవకాశం ఉంది. ఇవి కూడా అద్దె ప్రాతిపదికనే తీసుకోవాల్సిందే.
కానీ సొంతంగా సమకూర్చుకొనే ఆలోచనతో ఆర్టీసీ కేంద్రానికి సరికొత్త ప్రతిపాదన చేసింది. దాదాపు వెయ్యి వరకు ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని భావించింది. ఇందుకు ఒక్కో బస్సుకు రూ. 60 లక్షల వరకు ఖర్చు వస్తుండటంతో ఫేమ్ పథకం కింద వచ్చే రాయితీని తమకు అందించాలని ఢిల్లీ అధికారులను కోరింది. అయితే తాజాగా వారు ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జీసీసీ పద్ధతిలో అద్దె ప్రాతిపదికన బస్సులు సమకూర్చే ప్రైవేటు సంస్థలకే వాటిని ఇస్తామని అధికారులు తేల్చిచెప్పినట్టు సమాచారం.
ప్రైవేటు కంపెనీల ఒత్తిడి వల్లే...
కొన్ని ప్రైవేటు కంపెనీల ఒత్తిడి వల్లే ఢిల్లీ అధికారులు ఆర్టీసీ ప్రతిపాదనను పక్కనపెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీకే సొంతంగా రాయితీ కల్పిస్తే భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల ఆర్టీసీలు కూడా ఇదే పంథాను అనుసరిస్తాయి. దీంతో తమకు అందాల్సిన లబ్ధి గల్లంతవుతుందన్న ఉద్దేశంతో ప్రైవేటు సం స్థలు ఢిల్లీ అధికారులను ప్రభావితం చేస్తున్నా యన్నది ఆరోపణ. ఆర్టీసీ ప్రతిపాదనకు ఢిల్లీ అధికారులు అంగీకరించి ఉంటే వెయ్యి పాత డీజిల్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులుగా మారి ఉండేవి. దీనివల్ల కాలుష్యానికి అడ్డుకట్ట పడి ఉండేది. అలాగే ఆర్టీసీపై భారీగా డీజిల్ భారం సైతం తప్పి ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment