మాకు అప్పు పుట్టలేదు.. మీ పేరుతో తెస్తారా! | Not getting loans to RTC | Sakshi
Sakshi News home page

మాకు అప్పు పుట్టలేదు.. మీ పేరుతో తెస్తారా!

Published Wed, Sep 30 2015 3:51 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

మాకు అప్పు పుట్టలేదు.. మీ పేరుతో తెస్తారా! - Sakshi

మాకు అప్పు పుట్టలేదు.. మీ పేరుతో తెస్తారా!

- కార్మికుల క్రెడిట్ సొసైటీతోఆర్టీసీ అవగాహన
- దసరా అడ్వాన్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపు తిప్పలివి

సాక్షి, హైదరాబాద్:
ప్రభుత్వాలు సాయం చేయవు. నిండా అప్పులు, నష్టాల్లో మునిగిపోవడంతో బ్యాంకులు అప్పు ఇవ్వవు. వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోవడంతో అవసరాలకు డబ్బుల్లేవు. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సంస్థగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్న ఆర్టీసీ (ఉమ్మడి రూపం) ప్రస్తుత దుస్థితి ఇది. కార్మికుల ‘గుడ్‌విల్’ను ముందుంచి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుని రోజులు గడిపే స్థాయికి చేరుకుంది. మంగళవారం జరిగిన ఓ పరిణామం ఆర్టీసీ దుస్థితిని తేటతెల్లం చేస్తోంది.
 
ఇదీ సంగతి: ఏ నెలకానెల జీతాలు చెల్లించడం టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీలకు చాలాకష్టమైంది. కార్మికులు ఘనంగా నిర్వహించుకునే దసరా పండుగకు అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం అందించే ఆనవాయితీ ఉంది. ఇందుకు రెండు సంస్థలకు కలిపి రూ.43 కోట్లు కావాలి. కానీ చిల్లిగవ్వ చేతిలో లేక దాన్ని వాయిదా వేశాయి. అలాగే, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపు 2012 నుంచి పెండింగులో ఉంది. 2012 సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని ఆగస్టులో చెల్లించనున్నట్టు సంస్థలు కార్మిక సంఘాలతో గతంలోనే ఒప్పందం చేసుకున్నాయి. కానీ మాట తప్పాయి.

దీంతో కార్మికుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయకపోవటంతో బ్యాంకుల నుంచి అప్పు తీసుకుందామన్నా బ్యాంకులు సిద్ధంగా లేవు. దీంతో కార్మికులకు సంబంధించిన క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)పై దృష్టి సారించింది. ప్రతినెలా తమ జీతం నుంచి 5 శాతం చొప్పున ఈ సొసైటీకి కార్మికులు జమ చేస్తారు. క్రమం తప్పకుండా నిధి జమ అయ్యే సొసైటీ కావటంతో దీనికి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు సరేనంటున్నాయి. ఆ సొసైటీ నిధులను గతంలో సొంతానికి వాడుకున్న ఆర్టీసీ వాటిని తిరిగి చెల్లించేందుకు ఏపీ కేంద్ర సహకార బ్యాంకు నుంచి రూ.162 కోట్ల అప్పు కోసం యత్నించింది.

అక్కడ చేదు అనుభవం ఎదురుకావడంతో సీసీఎస్ పేరుతో అప్పు పొందింది. ఇదే మాదిరే తాజాగా కెనరాబ్యాంకు నుంచి రూ.80 కోట్లు అప్పు తెచ్చేందుకు సీసీఎస్ సరేనంది. ఈమేరకు మంగళవారం జరిగిన పాలకమండలి సమావేశం తీర్మానించింది. ఆర్టీసీ కోసం అప్పు తెస్తే సీసీఎస్ గుడ్‌విల్ దెబ్బతింటుందని నలుగురు పాలకమండలి సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. మెజార్టీ సభ్యులు సానుకూలంగా ఉండటంతో తీర్మానానికి ఆటంకం కలగలేదు. తెచ్చిన అప్పులో రూ.40 కోట్ల చొప్పున రెండు ఆర్టీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement