కార్మికుల సొమ్మూ హాంఫట్! | Workers' remittances hamphat! | Sakshi
Sakshi News home page

కార్మికుల సొమ్మూ హాంఫట్!

Published Sat, Mar 14 2015 1:34 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

కార్మికుల సొమ్మూ హాంఫట్! - Sakshi

కార్మికుల సొమ్మూ హాంఫట్!

  • కార్మిక సంక్షేమ నిధులు వాడేసిన ఆర్టీసీ యాజమాన్యం
  • ఆర్టీసీలో ‘సంక్షేమ’ చక్రం పంక్చరయింది.. నిండా ఆర్థిక సమస్యలు, అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీ సొంత సిబ్బందినే హాహాకారాలు పెట్టిస్తోంది.. ఎక్కడ పైసా కనిపించినా స్వాహా చేసేస్తోంది.. అత్యవసర సమయంలో కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసుకున్న నిధులనూ వాడేసుకుంటోంది.. భవిష్యత్ అవసరాల కోసం తమ వేతనాల నుంచి కోత పెట్టుకుని మరీ జమ చేసుకుంటున్న నిధులను కొల్లగొట్టేస్తోంది.. చివరికి మరణించిన కార్మికుల కుటుంబాలకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న నిధినీ ఊడ్చేస్తోంది.. ‘నిధులు’ ఖాళీకావడంతో అవసరానికి సొమ్ము అందక ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ఆందోళనలో మునిగిపోతున్నారు. మరోసారి ఆందోళన బాట పట్టాలని యోచిస్తున్నారు.
     - సాక్షి, హైదరాబాద్

     
    ప్రపంచంలో అత్యధిక బస్సులను నిర్వహిస్తున్న రవాణా సంస్థగా ఏపీఎస్ ఆర్టీసీ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. 19 వేలకుపైగా బస్సులున్న మరో సంస్థ అంటూ లేదు. కానీ ఇప్పుడు ఏడున్నర దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ చవిచూడని నష్టాలను మూటగట్టుకునే దిశలో సాగుతోంది. ఈ ఏడాది దాదాపు రూ. 1,100 కోట్ల వరకు నమోదవుతాయని అంచనా. దీనికితోడు అప్పులు, వాటి వడ్డీలు సంస్థను పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఈ తరుణంలోనైనా ఆర్థిక సాయం చేయాలంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టీసీ విజ్ఞప్తులు చేసింది. సానుకూల స్పందన లేకపోవడంతో.. ఎక్కడ పైసా కనిపించినా వాడేసుకుంటోంది. ఇలా యాజమాన్యం దృష్టి కార్మికుల ‘నిధుల’పై పడింది.
     
    దొరికింది దొరికినట్లే..

    పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత గూడు కట్టుకునేందుకు, ఆరోగ్య సమస్యలు తలెత్తితే చికిత్సల కోసం.. ఇలా ప్రతి అవసరానికి కార్మికులను అప్పటికప్పుడు ఆదుకునే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్) నిధినీ ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది. కార్మికులు పదవీ విరమణ చేస్తే అందాల్సిన ప్రయోజనాల కోసం దాచిపెట్టుకున్న స్టాఫ్ రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్‌ఆర్‌బీఎస్) మొత్తాన్ని ఊడ్చేసింది. చివరికి మరణించిన కార్మికుల కుటుంబాలకు సాయం అందించేందుకు ఏర్పాటు చేసుకున్న స్టాఫ్ బెన్వలెంట్ థ్రిఫ్ట్ (ఎస్‌బీటీ) నిధిని కూడా వదల్లేదు. మొత్తంగా ఈ మూడు రకాల నిధుల నుంచి దాదాపు రూ. 886 కోట్లను సంస్థ అవసరాల పేరిట అధికారులు ఖాళీ చేసేశారు. ఈ మూడు నిధుల నుంచి కార్మికులు సొంత అవసరాలకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు వాటిల్లోని నిధులన్నీ ఖాళీకావడంతో కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. పిల్లల చదువులకు ఫీజుల దగ్గరి నుంచి పెళ్లిళ్లు, గృహరుణాలు, అనారోగ్య సమస్యల దాకా వివిధ రకాల అవసరాలకు సాయం అందక కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
     
    మొత్తుకుంటున్న కార్మికులు..

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో కలిపి వివిధ రుణాల కోసం కార్మికులు పెట్టుకున్న 23,000 దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నా యి. వీటి మంజూరు కోసం ఆర్టీసీ సిబ్బంది నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. యాజమాన్యం నిధులు వాడేసుకోవడంతో... ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితేగాని తామేమీ చేయలేమని అధికారులు పేర్కొంటున్నారు. ఇరు  రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తే వాటిని నిధుల్లో జమ చేయాలని అధికారులు భావించారు. కానీ ప్రభుత్వాలు మొండిచేయి చూపడంతో ఆ ఆశ కూడా నిరాశే అయింది.
     
    పదవీ విరమణ ప్రయోజనాలకు దెబ్బ..

    కార్మికులు ప్రతినెలా రూ. 250 చొప్పున ఈ నిధికి జమచేస్తారు. ఈ సొమ్మును వేతనాల నుంచే నేరుగా మినహాయిస్తారు. ఇలా మొత్తంగా ప్రతినెలా దాదాపు రూ. 3.25 కోట్లు జమవుతాయి. పదవీ విరమణ పొందిన కార్మికులకు ఈ పథకం నుంచే ప్రతినెలా పింఛన్ అందిస్తారు. దాంతోపాటు కార్మికుల అత్యవసరాలకు గరిష్టంగా రూ. లక్ష వరకు రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. ఇటీవలి వరకు నిండుగా ఉన్న ఈ నిధి నుంచి రూ. 400 కోట్లను యాజమాన్యం వాడుకుంది. దాంతో ఈ పథకం కింద రుణం కోసం ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి.
     పెండింగ్ దరఖాస్తుల సంఖ్య
     ఆంధ్రప్రదేశ్ పరిధిలో..    1,100
     తెలంగాణ పరిధిలో..    900
     
    స్టాఫ్ బెనెవలెంట్ థ్రిఫ్ట్ స్కీం (ఎస్‌బీటీ)

    ప్రతినెలా వేతనం నుంచి రూ. 100 చొప్పున కార్మికులు ఈ నిధికి జమ చేస్తారు. ఇలా మొత్తంగా నెలానెలా రూ. 1.20 కోట్ల చొప్పున జమ అవుతాయి. కార్మికులెవరైనా మరణిస్తే ఈ పథకం కింద రూ.లక్షన్నర వరకు ఆర్థిక సాయం చేస్తారు. దాంతోపాటు గరిష్టంగా రూ. లక్ష చొప్పున కుటుంబ అవసరాలకు రుణం పొందే వీలుంటుంది. ఈ ఎస్‌బీటీకి సంబంధించి రూ. 300 కోట్లను ఆర్టీసీ వాడుకుంది. ఈ పథకం కింద రుణం కోసం రెండు వేలకుపైగా దరఖాస్తులు పేరుకుపోయాయి.
     
    క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ

    ప్రతినెలా ఒక్కో కార్మికుడు వేతనంలో హోదాపరంగా 9 శాతం వరకు ఈ సొసైటీకి జమచేస్తారు. ఇలా రెండు రాష్ట్రాల నుంచి ప్రతి నెలా రూ. 53 కోట్లు జమవుతాయి. ఇటీవలి వరకు ఆ నిధిలో సిద్ధంగా ఉన్న రూ. 186 కోట్లను ఆర్టీసీ వాడుకుంది. రూ. 5 లక్షల వరకు అందే షార్ట్‌టర్మ్ లోన్, రూ.లక్షన్నర వరకు అందే విద్యారుణాలు, రూ. 20 లక్షల వరకు అందే గృహరుణాలు, చికిత్సలకు రుణాలను కార్మికులు దీని నుంచి పొందవచ్చు. ఇలాంటి రుణాల కోసం కార్మికులు పెట్టుకున్న దాదాపు 19,000కుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటికి రుణం మంజూరు చేయాలంటే ఇప్పటికిప్పుడు రూ. 165 కోట్లు అవసరం. ఏడు నెలల కింద ఇలాగే నిధులు వాడేసుకుంటే కార్మికులు ఆందోళన చేశారు. దాంతో ప్రభుత్వం నుంచి అందినమొత్తంతో నవంబర్ నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు రుణాలిచ్చారు. మళ్లీ ఇటీవల పోగైన నిధులను ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది.
     
     సొసైటీలో ప్రతినెలా జమ..
     ఏపీ పరిధి నుంచి..    రూ. 28 కోట్లు
     తెలంగాణ పరిధిలో    రూ. 25 కోట్లు
     పెండింగు దరఖాస్తులు:
     ఏపీ పరిధిలో..    9,400
     తెలంగాణ పరిధిలో..10,004
     నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన 3 రోజుల్లో సొమ్ము అందాలి. ఇప్పుడు నెలలు గడిచినా దిక్కులేదు.
     
     ప్రతిసారీ ఉద్యమించాలా..?
     మేం దాచుకున్న డబ్బు నుంచి రుణం పొందాలంటే కూడా ఉద్యమించాల్సిన దుస్థితి రావటం దారు ణం. గతంలో ఆందోళనలు చేస్తే కొన్ని నిధులు కేటాయించారు. ఇప్పుడు మళ్లీ మా నిధులు ఖాళీ చేశారు. ప్రభుత్వాలేమో సాయం చేయడం లేదు. అవి వస్తేకాని వీటికి జమయ్యే దిక్కులేదు. ఇక మేం అత్యవసరాల కోసం అధిక వడ్డీతో బయట అప్పులు చేయాల్సిందేనా?
     - దామోదరరావు, ఎంప్లాయీస్ యూనియన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement