టీఎస్‌కు మిగులు.. ఏపీకి దిగులు
- బస్‌భవన్‌లో మళ్లీ ‘విభజన’ కిరికిరి
- ఏపీఎస్‌ఆర్టీసీలో దిగువస్థాయి సిబ్బంది కొరత
- అదనంగా ఉన్న తెలంగాణవారిని తీసుకోవడానికి నిరాకరణ
- ఆంధ్రా నుంచి ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తెచ్చుకోవాలని నిర్ణయం
- ఫర్నిచర్ పంపకంపై టీఎస్‌ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రధాన పరిపాలన కేంద్రం బస్‌భవన్‌లో మళ్లీ విభజన చిచ్చు రగులుకుంది. ఇటీవలే పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీల్లో ‘ఎక్కడి వారక్కడే’ పద్ధతిలో అధికారులు, ఉద్యోగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించినప్పటికీ... ఆ తర్వాత లొల్లి మొదలైంది. బస్‌భవన్‌లో ప్రస్తుతం 875 మంది వరకు సిబ్బంది పని చేస్తున్నారు. జనాభా సంఖ్య పద్ధతిలో 58:42 నిష్పత్తిలో వారి పంపకం పూర్తి చేశారు. కానీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన సిబ్బంది తక్కువ ఉండడంతో దాదాపు 160 మంది వరకు ఏపీకి సిబ్బంది కొరత ఏర్పడింది.
అదే సమయంలో తెలంగాణకు చెందిన సిబ్బంది ఎక్కువ ఉండడంతో టీఎస్ ఆర్టీసీకి అదనపు సిబ్బంది వచ్చారు. దీంతో అదనంగా ఉన్నవారిని డిప్యుటేషన్ పద్ధతిలో ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయించాల్సి ఉంది. కానీ, తాజాగా వారిని తీసుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నట్టు సమాచారం. వారి బదులు ఆంధ్రాప్రాంతానికి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తెచ్చి నియమించుకునేందుకు కసరత్తు మొదలైనట్టు తెలిసింది. అవసరమైతే వారికి కాస్త అధికంగా వేతనాలు చెల్లించేందుకు కూడా సిద్ధపడ్డట్టు సమాచారం.
ఏపీఎస్ ఆర్టీసీకి బస్‌భవన్‌లోని ‘ఎ’ బ్లాకు, టీఎస్ ఆర్టీసీకి ‘బి’ బ్లాకును కేటాయించడంతో కార్యాలయాల సర్దుబాటు కొనసాగుతోంది. అయితే ఈ కార్యాలయాల్లో ఫర్నిచర్ పంపకంపై ఇప్పుడు వివాదం రగులుకుంటోంది. ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో ఈ పంపకాలు జరిగినప్పటికీ... తెలంగాణకు పనిచేయని కంప్యూటర్లు, పాత ఫర్నిచర్, పాతకార్లు వచ్చాయని, ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలోకి లేటెస్ట్ కంప్యూటర్లు, కొత్త ఫర్నిచర్, కొత్త కార్లు చేరాయంటూ తెలంగాణ అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు చేస్తున్నారు.
కొందరు ఉన్నతాధికారులు కావాలనే తెలంగాణకు పాత సామగ్రి వచ్చేలా చక్రం తిప్పారనేది వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల సిబ్బంది మధ్య వాదోపవాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇప్పుడు మరో సమస్యకు దారి తీసింది. ఉద్యోగుల విభజన ప్రశాంతంగా ముగిసినా... తదనంతర పరిణామాలతో మళ్లీ బస్‌భవన్‌లో కాస్త వేడి రగిలినట్టు కనిపిస్తోంది.