నష్టాల ప్రయాణం | loss journey | Sakshi
Sakshi News home page

నష్టాల ప్రయాణం

Published Mon, Feb 26 2018 2:35 PM | Last Updated on Mon, Feb 26 2018 2:35 PM

loss journey - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వరంగల్‌ రీజియన్‌లో డిపోలు : 9 
ఆర్టీసీ బస్సులు : 762 
అద్దె బస్సులు  : 230
బస్సులు రోజూ తిరిగే కిలోమీటర్లు : 3.91 లక్షలు
నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు : 10 లక్షలు
రోజు సగటు ఆదాయం :  రూ.1.15 కోట్లు

హన్మకొండ: ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ ప్రయాణం ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. నష్టాలు, లాభాలతో  ఎగుడు...దిగుడుల మధ్య ముందుకెళుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని డిపోలు, రీజియన్ల వారిగా స్థానిక పరిస్థితులకు  అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ లాభాలబాట పట్టించాలని గతంలో సీఎం కేసీఆర్‌ చేసిన సూచనల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో కొంతమేర సత్ఫలితాలు వచ్చాయి. వాస్తవానికి 2017 జనవరి నాటికి వరంగల్‌ రీజియన్‌ రూ.19.35  కోట్ల నష్టంలో ఉండేది.

కానీ సంస్థాగతంగా చేపట్టిన చర్యలతో 2017 డిసెంబర్‌ నాటికి నష్టాల నుంచి పూర్తి స్థాయిలో గట్టెక్కి రూ.38 లక్షల లాభాల్లోకి వెళ్లింది. ఇలా 2017 సంవత్సరం భారీ నష్టాలతో  మొదలై లాభాలతో ముగిసినప్పటికీ 2018 మొదటి నెలలోనే ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ భారీ నష్టాలను చవిచూసింది. ఈ ఒక్క నెలలోనే రూ.3.54 కోట్ల నష్టం వాటిల్లడంతో షాక్‌ తిన్న ఆర్టీసీ రీజియన్‌ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.  

ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లోని 9 డిపోల్లో 992 బస్సులు ఉండగా ఇందులో 762 సంస్థ బస్సులు, 230 అద్దెబస్సులు ఉన్నాయి. రీజియన్‌లో ప్రతిరోజు ఈ బస్సులు 3.91 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఇలా రోజుకు సగటున రూ.1.15 కోట్ల ఆదాయం వస్తోంది. పల్లెవెలుగు బస్సుల ద్వారా నష్టాలు ఎక్కువగా వస్తుండడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. 

నష్టాలను పూడ్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వారిని తొలగించినా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏసీ బస్సుల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న అటెండెంట్లను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. హన్మకొండ–హైదరాబాద్‌ మధ్య నడిచే బస్సులు మధ్య స్టేజీల్లో నిలిపే అవకాశం లేనందున ప్రయాణికులకు కాజీపేట, హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో వాటర్‌బాటిళ్లు, ఇతర వస్తువులు అటెండెంట్లను నియమించి అందించవచ్చని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.

ఇలా ప్రతి బస్సుకు ఒక అటెండెంట్‌కు బదులు కాజీపేట, ఉప్పల్‌లో రెండు లేదా మూడు షిఫ్టుల్లో ఒక్కొక్కరిని నియమించి ప్రయాణికుల అవసరాలు తీర్చాలని చూస్తోంది. అయితే దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో అటెండెంట్లను మాత్రం కొనసాగించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వరంగల్‌ రీజియన్‌లో 38 ఏసీ బస్సులున్నాయి. ఇందులో 15 వజ్ర ఏసీ మినీ బస్సులు. కొత్తగా వచ్చే 2 బస్సులతో రీజియన్‌లో మొత్తం 40 ఏసీ బస్సులు కానున్నాయి. ఈ బస్సుల్లో ప్రస్తుతం 30 మంది అటెండెంట్లు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.8,500 వేతనం చెల్లిస్తోంది. వీరిలో కనీసం 20 మందిని తొలగించాలనే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది. 

ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సుల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు అనువైన ప్రధాన రూట్లలో సెమీ ఎక్స్‌ప్రెస్‌లు నడపాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రైవేట్‌ వాహనాలకు ధీటుగా ప్రయాణికులను త్వరగా గమ్యస్థానం చేరవేయడం ద్వారా ఆర్టీసీ వైపు ప్రయాణికులను ఆకర్షించడంతోపాటు ఆదాయం పెంచుకోవాలన్నదే ఆర్టీసీ ఆలోచన. దీంతోపాటు మిని పల్లెవెలుగు బస్సులను నడపాలని చూస్తోంది. మినీబస్సులను వన్‌మన్‌ సర్సీస్‌గా నడుపుతారు. ఇందులో  కండక్టర్‌ అవసరం ఉండదు.

దీంతో మ్యాన్‌పవర్‌ కూడా తగ్గుతోంది. తద్వారా వేతన పెట్టుబడులు తగ్గుతాయి. పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్న మహబూబాబాద్‌ డిపో పరిధిలో మినీపల్లె వెలుగు బస్సులు ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించింది. దీంతోపాటు జనగామ డిపోలోను కొన్ని రూట్లలో మినీబస్సులను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకోగలిగింది. ఈ క్రమంలో రీజియన్‌లోని మరికొన్ని డిపోల్లో ఆదాయం పెంచుకునేందుకు అనువుగా ఉన్న రూట్లలో మినీ పల్లెవెలుగు బస్సులు నడపాలనే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ఈ మేరకు వరంగల్‌ రీజియన్‌ అధికారులు ప్రతిపాదనలు  సిద్ధం  చేస్తున్నారు.


పల్లె వెలుగు రూట్లపై ప్రత్యేక దృష్టి..

వరంగల్‌ రీజియన్‌లో ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నాం. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. తమ ప్రణాళికలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకుంటాం. ఆ తర్వాత  అమలు చేస్తాం. ప్రధానంగా పల్లెవెలుగు బస్సులు నడిచే రూట్లలో ఆదాయం పెంచుకునేలా ప్రణాళికలు తయారు చేస్తాం.  అనవసర ఖర్చులు తగ్గించుకుంటాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. నష్టాలు పూడ్చుకునేందుకు ఆనువైన మార్గాలు ఎంచుకుని ముందుకు పోతాం.  
 – తోట సూర్యకిరణ్, ఆర్‌ఎం, వరంగల్‌ రీజియన్‌
 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement